పదిలో వందశాతం తప్పనిసరి
ABN , Publish Date - Jan 28 , 2026 | 11:43 PM
ల్లాలో ఈ విద్యా సంవత్సరం పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత తప్పక సాధించాలని, దీనికి ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి కోరారు.
వలస బాటలో 10,500 విద్యార్థులు
9వేల మందిని వెనక్కి రప్పించాం - కలెక్టర్
గోనెగండ్ల, జనవరి 28(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఈ విద్యా సంవత్సరం పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత తప్పక సాధించాలని, దీనికి ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి కోరారు. బుధవారం గోనెగండ్లలోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పదో తరగతి విద్యార్థులలో విద్యా ప్రమాణాలను పరిశీలించారు. లెక్కలు, ఇంగ్లీష్ సబ్జెక్ట్‌లలో విద్యార్థులు వెనుకబడి ఉన్నారని, వారికి పరీక్షలు ప్రారంభం అయ్యేలోపు మంచి బోధన అందించడానికి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. 100 రోజుల ప్రణాళిక కింద జిల్లాలో పాఠశాలలను దత్తత తీసుకున్న ఆఫీసర్లు మంచి ఉత్తీర్ణత సాధించేలా చూడాలన్నారు. కర్నూలు జిల్లాలో ఎక్కువ శాతం కూలీలు వలసలు వెళుతున్నారని, వారి వెంటన తమ పిల్లలకు కూడా తీసుకువెళుతున్నారని, దీంతో విద్య ప్రమాణాలు దెబ్బతింటున్నాయని అన్నారు. అలాగే జిల్లాలో ఇప్పటి వరకు 10,500 మంది విద్యార్ధులు తమ తల్లిదండ్రులతో పాటు వలస వెళ్లారని అయితే అందులో 9వేల మంది విద్యార్ధులను వెనక్కి రప్పించామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మణిమంజరి, ఎంఈవో రామాంజినేయులు, నీలకంఠ, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకాన్ని కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.