Share News

దైవ దర్శనానికి వెళ్తూ మృత్యుఒడికి

ABN , Publish Date - Feb 28 , 2026 | 12:05 AM

నంద్యాల జిల్లా డోన మండలంలోని జగదుర్తి గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందగా..

 దైవ దర్శనానికి వెళ్తూ మృత్యుఒడికి
నంద్యాల జిల్లా డోన ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీలో తల్లి, పిల్లల మృతదేహాలు

నంద్యాల జిల్లా డోన మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం

ఫ కారు, రాంగ్‌ రూట్‌లో వచ్చిన క్రేన ఢీకొని తల్లి, ఇద్దరు పిల్లలు మృతి.. ఒకరికి తీవ్రగాయాలు

డోన రూరల్‌, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లా డోన మండలంలోని జగదుర్తి గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందగా.. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలివీ.. కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని రామకృష్ణానగర్‌ చెందిన సివిల్‌ ఇంజనీర్‌ ప్రమోద్‌ తన కుటుంబ సభ్యులతో శ్రీశైలానికి దర్శనానికి కారులో బయలుదేరారు. డోన మండలం జగదుర్తి గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై కారు, రాంగ్‌ రూట్‌లో వచ్చిన క్రేన ఢీకొన్నాయి. దీంతో కారు పొలాల్లోకి దూసుకెళ్లింది. కారు నుజ్జునుజ్జు కావడంతో పాటు అందులో ప్రయాణిస్తున్న నలుగురూ పొలంలో చెల్లాచెదురుగా పడిపోయారు. ఈ ప్రమాదంలో శాంత (36), కుమార్తె భార్గవి (9), కుమారుడు సిద్ధార్థ్‌ (3) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ప్రమోద్‌ను డోన ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. డోన రూరల్‌ సీఐ సీఎం రాకేశబాబు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను డోన ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లుఆయన తెలిపారు.

సీతారామపురం మెట్ట వద్ద చెట్టుకు ఢీకొన్న ఆటో

చెట్టుకు ఢీకొట్టిన ఆటో.. డ్రైవర్‌ మృతి

బేతంచెర్ల, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి) : వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి వేపచెట్టుకు ఢీకొన్న ఘటనలో డ్రైవర్‌ మృతిచెందాడు. ఈఘటన మండలంలోని సీతారామాపురం మెట్ట వద్ద శుక్రవారం చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వివరాలు.. మండలంలోని బలపాలపల్లికి చెందిన ఆటో డ్రైవర్‌ మధు(22) తన ఆటోలో వ్యవసాయ పనుల కోసం బేతంచెర్ల లోని సంజీవనగర్‌, బేగర్‌పేట, వడ్డేపేట కాలనీలకు చెందిన 15మంది వ్యవసాయ కూలీలను హుసేనాపురంలో పత్తి పనులు చేయడానికి తీసుకెళ్తున్నాడు. సీతరామపురం మెట్ట వద్ద ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి ఆటో అదుపుతప్పి వేపచెట్టుకు ఢీకొంది. డ్రైవర్‌ మధుతో పాటు రామ తులసి, కోట్ల మీనాక్షమ్మ, బెల్లం నరసమ్మ, లక్ష్మీదేవి, రాములమ్మ, వెంకటలక్షమ్మ, తులసి, ఆదిలక్ష్మి, ఈశ్వరమ్మ, మద్దిలేటమ్మకు తీవ్ర గాయాలయ్యాయి, క్షతగాత్రులకు బేతంచెర్ల ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రథమ చికిత్సలు నిర్వహించారు. మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆటో డ్రైవర్‌ మధు మృతిచెందాడు. బేతంచెర్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

బోల్తాపడ్డ వాహనం.. 25 మందికి గాయాలు

ఆస్పరి, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పుటకలమర్రి బస్‌ స్టాప్‌ సమీపంలో శుక్రవారం 50 మంది కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనం బోల్తా పడింది. ఈఘటనలో 25 మంది తీవ్ర గాయాలపాలైనట్లు పోలీసులు తెలిపారు. వివరాలు.. పుటకలమర్రి నుంచి పత్తికొండ మండలం నలకదొడ్డి గ్రామంలో వ్యవసాయ కూలీలు మొక్కజొన్న కోత కోసం వెళ్తున్నారు. పుటకలమర్రి బస్‌ స్టాప్‌ ఎదురుగా బోల్తా పడడంతో 25 మందికి గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ గంగాధర్‌ తెలిపారు.

రెండు మోటార్‌ సైకిళ్లు ఢీ

- ఇద్దరికి తీవ్ర గాయాలు

బేతంచెర్ల, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): బేతంచెర్ల పట్టణ శివార్లలోని డోన రహదారిలో నయారా పెట్రోల్‌ బంక్‌ సమీపంలో రెండో మోటార్‌ సైకిళ్లు ఢీకొన్న సంఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం సాయంత్రం ఈ సంఘటన బేతంచెర్లలో చోటు చేసుకుంది. మండలంలోని హెచకొట్టాలకి చెందిన రామ మద్దయ్య తన పని నిమిత్తం మోటార్‌ సైకిల్‌పై బేతంచెర్లకు వస్తున్నాడు. నయారా పెట్రోల్‌ బంక్‌లో పెట్రోల్‌ పోయించుకోవడానికి రోడ్డును క్రాస్‌ చేస్తుండగా వెంకన్న ఫ్యాక్టరీలో పని చేస్తున్న రాజస్థాన యువకుడు బేతంచెర్లకు బైక్‌పై వస్తూ పెట్రోల్‌ బంక్‌ లోనికి పోయే ఢీకొనడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. రామమద్దయ్యకు ఎడమ కాలుకు గాయాలు కాగా, రాజస్థాన ఫ్యాక్టరీ కార్మికుడు ప్రహ్లాదక్‌ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రహ్లాద పరిస్థితిని విషమంగా ఉంది. ఎస్‌ఐ రమేష్‌బాబు ప్రహ్లాదను తన జీపులో బేతంచెర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఇద్దరిని మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

బంగారం వ్యాపారి కుచ్చుటోపీ?

ఎమ్మిగనూరు/ టౌన, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): ఎమ్మిగనూరు పట్టణంలో ఓ బంగారం వ్యాపారి కోటి రూపాయలకు పైగానే కుచ్చుటోపీ పెట్టినట్లు సమాచారం. పట్టణం, గ్రామాలకు చెందిన వారు ఆభరాణాలు తయారీ చేసేందుకు ఇచ్చిన కోటి రూపాయలకు పైగా విలువ చేసే బంగారాన్ని తిరిగి చెల్లించకుండా ముఖం చాటేసినట్లు తెలుస్తోంది. నగలు తయారు చేసేందుకు బంగారు ఇచ్చిన బాధితులు సదరు బంగారు వ్యాపారి దుకాణం చూట్టు తిరుగుతూ వచ్చారు. బంగారు వ్యాపారి కొన్ని రోజులు నుంచి దుఖాణాన్ని తెరవకపోవడంతో తమకు కుచ్చుటోపీ పెట్టాడని భాదితులు గ్రహించారు. దీంతో శుక్రవారం పట్టణ పోలీస్‌ స్టేషనను ఆశ్రయించారు. బంగారు వ్యాపారి చేతిలో పట్టణానికి చెందిన కొంత మంది బంగారం, నగలు విక్రయించే వ్యాపారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై పట్టణ ఎస్‌ఐ మధుసూదన రెడ్డిని వివరణ కోరగా భాదితులు స్టేషనకు వ చ్చారని, పూర్తిగా ఆధారాలతో వస్తే కేసు నమోదు చేస్తామని వారికి చెప్పినట్లు తెలిపారు.

Updated Date - Feb 28 , 2026 | 12:05 AM