Share News

‘ఒమిక్రాన్‌ ఆర్‌ఎఫ్‌- 5’

ABN , Publish Date - Jul 19 , 2026 | 03:52 AM

రాష్ట్రంలో మళ్లీ వెలుగుచూస్తున్న కొవిడ్‌ పాజిటివ్‌ కేసులకు కారణం ‘ఒమిక్రాన్‌ ఆర్‌ఎఫ్‌-5’ కారణమని జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ పరీక్షల్లో తేలింది. ఇది కరోనా వైర్‌సలోని ఒమిక్రాన్‌..

‘ఒమిక్రాన్‌ ఆర్‌ఎఫ్‌- 5’

  • ప్రస్తుత కొవిడ్‌ వేరియంట్‌ ఇదే

  • అంత ప్రమాదకరం కాదు.. భయపడాల్సిన పనిలేదు

  • ఆస్పత్రులు, ప్రత్యేక వార్డులు, పరీక్ష కిట్లు సిద్ధం

  • డీఎంఈ విష్ణువర్థన్‌ వెల్లడి

అమరావతి, జూలై 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మళ్లీ వెలుగుచూస్తున్న కొవిడ్‌ పాజిటివ్‌ కేసులకు కారణం ‘ఒమిక్రాన్‌ ఆర్‌ఎఫ్‌-5’ కారణమని జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ పరీక్షల్లో తేలింది. ఇది కరోనా వైర్‌సలోని ఒమిక్రాన్‌ వేరియంట్‌కు చెందిన ఉపవంశంగా గుర్తించారు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తించిన అనేక ఒమిక్రాన్‌ ఉపవంశాల్లో ఆర్‌ఎఫ్‌-5 కూడా ఒకటి. కడప జిల్లాలో నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల్లో 4 నమూనాలను వైద్య ఆరోగ్యశాఖ పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపింది. ఆ నమూనాల ఫలితాలు శనివారం ఆరోగ్య శాఖకు అందాయి. సింగపూర్‌తో పాటు ఆగ్నేయాసియాలోని కొన్ని దేశాల్లో ఆర్‌ఎఫ్‌-5 వేరియంట్‌ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఈ వేరియంట్‌ను నిశితంగా పరిశీలిస్తోందని డీఎంఈ విష్ణువర్థన్‌ తెలిపారు. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న శాస్త్రీయ ఆధారాల ప్రకారం ఆర్‌ఎఫ్‌-5 ఇతర ఒమిక్రాన్‌ వేరియంట్లతో పోలిస్తే ప్రమాదకరం కాదన్నారు. అందువల్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఆర్‌ఎఫ్‌-5 లక్షణాలు ఇతర ఒమిక్రాన్‌ ఉప వేరియంట్ల లక్షణాల మాదిరిగానే ఉంటాయని తెలిపారు. ముఖ్యంగా గొంతునొప్పి, దగ్గు, జ్వరం, తలనొప్పి, ముక్కు కారడం లేదా మూసుకుపోవడం, అలసట, ఒంటి నొప్పులు ఉంటాయని చెప్పారు. పరీక్షలకు అవసరమైన కిట్లు, ఇతర మౌలిక సదుపాయాలను సమకూరుస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 16 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయని తెలిపారు.

Updated Date - Jul 19 , 2026 | 03:53 AM