Share News

Kurnool: భగ్గుమన్న పాతకక్షలు

ABN , Publish Date - Jan 06 , 2026 | 04:38 AM

కర్నూలు జిల్లాలో పాత కక్షలు భగ్గుమన్నాయి. ప్రత్యర్థుల దాడిలో కందనాతి గ్రామానికి చెందిన అన్నదమ్ములు బోయ పరమేశ్‌ (35), బోయ వెంకటేశ్‌ (55) దారుణ హత్యకు గురయ్యారు.

Kurnool: భగ్గుమన్న పాతకక్షలు

  • ప్రతీకార దాడిలో అన్నదమ్ములు బలి

  • ముగ్గురిపై కత్తులతో దాడి చేసిన ప్రత్యర్థులు

  • మరొక సోదరుడి పరిస్థితి విషమం

  • తప్పించుకొని స్వయంగా ట్రాక్టర్‌ నడుపుతూ స్టేషన్‌కు..

  • ముగ్గురూ మూడు చోట్ల ఉండగా పథకం ప్రకారం వెళ్లి దాడి

  • కర్నూలు జిల్లా కందనాతిలో జంట హత్యలు

కర్నూలు/ఎమ్మిగనూరు, జనవరి 5(ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లాలో పాత కక్షలు భగ్గుమన్నాయి. ప్రత్యర్థుల దాడిలో కందనాతి గ్రామానికి చెందిన అన్నదమ్ములు బోయ పరమేశ్‌ (35), బోయ వెంకటేశ్‌ (55) దారుణ హత్యకు గురయ్యారు. మరో సోదరుడు బోయ గోవిందు (36) తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రి పాలయ్యారు. మరో ఇద్దరు మహిళలు, ఐదేళ్ల బాలుడు గాయపడ్డారు. 2024లో జరిగిన తండ్రీ కొడుకుల హత్యకు ప్రతీకారంగా ఈ జంట హత్యలు జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. నిందితులు పక్కా ప్రణాళికతో ఈ దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. 2024 ఫిబ్రవరి 21న కందనాతి గ్రామంలో దేవర మహోత్సవం జరిగింది. ఆ సమయంలో కుళాయి నీళ్లు పట్టుకునే క్రమంలో పక్కపక్క ఇళ్లలో ఉన్న బిక్కి నరసింహులు, బోయ వెంకటేశ్‌ కుటుంబాల మధ్య జరిగిన చిన్నపాటి గొడవ.. ఇరువర్గాల దాడులకు కారణమైంది. నాటి ఆ ఘర్షణలో బిక్కి నరసింహులు, ఆయన కుమారుడు బిక్కి రవి తీవ్ర గాయాలపాలై.. కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆ ఘటనలో బోయ గోవిందు, బోయ వెంకటేశ్‌, బోయ పరమేశ్‌ సహా 12 మందిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. తర్వాత వారు బెయిల్‌పై బయటకొచ్చారు. కేసు విచారణలో ఉండడంతో, శాంతిభద్రతల దృష్ట్యా ఇరువర్గాలకు చెందిన కుటుంబాలను పోలీసులు కొన్ని నెలలపాటు గ్రామంలోకి రాకుండా కట్టడి చేశారు. గత ఏడాది దసరా పండుగకు తిరిగి ఇరువర్గాల కుటుంబాలు గ్రామానికి చేరుకున్నాయి.


పక్కా ప్రణాళికతోనే హత్య: సోమవారం పక్కా ప్రణాళికతో ఈ దాడులు జరిగాయి. బోయ గోవిందు భార్య వీరేషమ్మ, ఐదేళ్ల కుమారుడు లోకేంద్రతో కలిసి ట్రాక్టర్‌పై పొలం నుంచి ఇంటికి వస్తుండగా.. సచివాలయం దగ్గరలో బిక్కి దుబ్బ నరసింహులు, బిక్కి లక్ష్మయ్య, బిక్కి వెంకటేశ్‌ వారి ట్రాక్టర్‌కు మరో ట్రాక్టర్‌ను అడ్డం పెట్టి గోవిందుపై గడ్డపారతో దాడి చేశారు. కడుపులోకి గడ్డపార బలంగా చొచ్చుకెళ్లింది. భర్తను కాపాడుకోవడానికి భార్య వీరేషమ్మ అడ్డుకోగా ఆమెతో పాటు లోకేంద్రకు గాయాలయ్యాయి. నిందితులు అక్కడి నుంచి బోయ పరమేశ్‌ (35) ఇంటికి వెళ్లి.. గోవిందు, ఆయన భార్య జయమ్మలపై మారణాయుధాలతో దాడి చేయడంతో పరమేశ్‌ అక్కడిక్కడే మృతి చెందాడు. అంతటితో ఆగకుండా గ్రామానికి సమీపంలోని ఆముదం పొలానికి నీళ్లు పెడుతున్న బోయ వెంకటేశ్‌ (55) వద్దకు వెళ్లి మారణాయుధాలతో దాడి చేసి హతమార్చారు. వరుసగా జరిగిన ఈ దాడుల్లో బోయ గోవిందు ఒక్కడే గాయాలతో బయపడి, భార్య, ఐదేళ్ల కొడుకును తీసుకొని అదే ట్రాక్టర్‌పై ఎమ్మిగనూరు పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నాడు. అతడిని మెరుగైన వైద్యం కోసం పోలీసులు కర్నూలుకు తరలించారు. గాయపడిన పరమేశ్‌ భార్య జయమ్మ, గోవిందు భార్య వీరేషమ్మ, కుమారుడు లోకేంద్రనూ ఆస్పత్రిలో చేర్చారు. ఇన్‌చార్జి ఎస్పీ విక్రాంత్‌పాటిల్‌, ఎమ్మిగనూరు డీఎస్పీ భార్గవి, ఇతర సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే నిందితులు పరారయ్యారు. గ్రామంలో బందోబస్తును రెట్టింపు చేసినట్లు డీఎస్పీ భార్గవి మీడియాకు వివరించారు.

Updated Date - Jan 06 , 2026 | 04:39 AM