సంవృద్ధిగా ఆయిల్
ABN , Publish Date - Apr 28 , 2026 | 12:17 AM
డీజిల్ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కొండపల్లిలోని ఆయిల్ కంపెనీల్లో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ సోమవారం విస్తృతంగా తనిఖీలు జరిపారు. ఐవోసీఎల్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ కంపెనీల నుంచి 200 ట్యాంకర్లకుపైగా ఆయిల్ ఉమ్మడి జిల్లాలోని బంకులకు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. దీంతో మంగళవారం మధ్యాహ్నానికి సాధారణ పరిస్థితులు నెలకొననున్నాయి.
- సీఎం ఆదేశాలతో కదిలిన అధికార యంత్రాంగం
- కొండపల్లి ఆయిల్ కంపెనీల్లో కలెక్టర్ లక్ష్మీశ తనిఖీ
- అవుట్‌లెట్లకు ఆయిల్ సరఫరా జరిగేలా చర్యలు
- ఐవోసీఎల్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ కంపెనీల నుంచి 200 ట్యాంకర్లకుపైగా సరఫరా
- ఎన్టీఆర్ జిల్లాలో 146, కృష్ణాజిల్లాలో 120 బంకులకు ఆయిల్
- నేటి మధ్యాహ్నానికి సాధారణ స్థితికి ఉమ్మడి జిల్లాలో పరిస్థితి
డీజిల్ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కొండపల్లిలోని ఆయిల్ కంపెనీల్లో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ సోమవారం విస్తృతంగా తనిఖీలు జరిపారు. ఐవోసీఎల్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ కంపెనీల నుంచి 200 ట్యాంకర్లకుపైగా ఆయిల్ ఉమ్మడి జిల్లాలోని బంకులకు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. దీంతో మంగళవారం మధ్యాహ్నానికి సాధారణ పరిస్థితులు నెలకొననున్నాయి.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
డీజిల్ సంక్షోభాన్ని అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని సీఎం చంద్రబాబు నిర్దేశించటంతో ఉమ్మడి జిల్లాలోని కలెక్టర్లు సోమవారం రంగంలోకి దిగారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ కొండపల్లిలోని ఆయిల్ కంపెనీల్లో విస్తృతంగా పర్యటించడంతో పాటు డీలర్ల నుంచి వస్తున్న ఇండెంట్లు, కంపెనీల నుంచి డిస్పాచ్ చేస్తున్న పరిమాణాలను పరిశీలించారు. డిమాండ్‌కు అనుగుణంగా కంపెనీల నుంచి ఆయిల్ పంపిణీ జరిగేలా చర్యలు తీసుకున్నారు. ఫలితంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా డీలర్లకు సమృద్ధిగా డీజిల్, పెట్రోల్ సమకూరనుంది. మంగళవారం మధ్యాహ్నం నాటికి పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే అవకాశం కనిపిస్తోంది.
బయటకు క్యూ కట్టిన ట్యాంకర్లు
కొండపల్లిలోని ఐవోసీఎల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ ఆయిల్ కంపెనీల నుంచి ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి (పార్ట్) జిల్లాల్లోని బంకులకు డీజిల్, పెట్రోల్ సరఫరా భారీగా జరుగుతోంది. ప్రతి రోజూ సగటున 200 ట్యాంకర్ల ద్వారా ఆయిల్ సరఫరా చేస్తున్నారు. వీటి ద్వారా మూడు లక్షల లీటర్ల డీజిల్, పెట్రోల్ పంపిణీ జరుగుతుంది. సంక్షోభ సమయంలో 100 ట్యాంకర్లకు మించి వెళ్లేవి కావు. సోమవారం కలెక్టర్ రంగంలోకి దిగడంతో 200 పైచిలుకు ట్యాంకర్లు కొండపల్లి నుంచి బయటకు కదిలాయి. సోమవారం అర్ధరాత్రి, మంగళవారం తెల్లవారుజాము నాటికి పూర్తిగా ఇవి ఆయా బంకులకు చేరుకోనున్నాయి.
ఎన్టీఆర్ జిల్లాలో 214 అవుట్ లెట్లు
ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం 214 అవుట్‌లెట్లు ఉండగా.. 50 బంకుల్లో డీజిల్, పెట్రోల్ లేక మూతబడినట్టు జిల్లా యంత్రాంగం గుర్తించింది. ఆయిల్ కంపెనీల దగ్గర మాత్రం 20 అవుట్ లెట్లలోనే నిల్వలు లేనట్టుగా లెక్కలు ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 146 డిపోలకు ఆయిల్‌ను సమృద్ధిగా పంపించాలని కలెక్టర్ లక్ష్మీశ లోడ్ ప్లాన్ చేశారు. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట నాటికి 83 అవుట్‌లెట్లకు ఆయిల్‌ను పంపించారు. మొత్తం 502 కిలోలీటర్ల పెట్రోల్, 697 కిలోలీటర్ల డీజిల్‌ను పై అవుట్‌లెట్లకు పంపిణీ చేయటం జరిగింది. అవుట్‌లెట్లకు ఈ ఆయిల్ సరఫరా కాగానే.. 247 కిలోలీటర్ల పెట్రోల్, 367 కిలో లీటర్ల డీజిల్‌ను వాహనాలకు ఫిల్ చేశారు. మిగిలిన 63 అవుట్‌లెట్లకు సంబంధించి ఆయిల్ రవాణా జరుగుతోంది.
కృష్ణాజిల్లాలో 175 బంకులు
కృష్ణాజిల్లాలో మొత్తం 175 డీజిల్, పెట్రోల్ అవుట్‌లెట్లు ఉన్నాయి. జిల్లా అధికారుల లెక్కల ప్రకారం వీటిలో 58 అవుట్‌లెట్లలో డీజిల్, పెట్రోల్ నిల్వలు లేవని గుర్తించారు. ఆయిల్ కంపెనీలు మాత్రం 31 అవుట్ లెట్లలో మాత్రమే నిల్వలు లేవని గుర్తించింది. జిల్లాలోని 120 అవుట్ లెట్లకు ఆయిల్‌ను పంపిణీ చేయాలని ఆయిల్ కంపెనీలకు ఎన్టీఆర్ కలెక్టర్ లక్ష్మీశ నిర్దేశించారు. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు 50 అవుట్ లెట్లకు ఆయిల్‌ను పంపిణీ చేశారు. మొత్తం 361 కిలోలీటర్ల పెట్రోల్, 410 కిలో లీటర్ల డీజిల్‌ను సరఫరా చేశారు. బంకుల్లో 177 కిలోలీటర్ల పెట్రోల్, 204 కిలోలీటర్ల డీజిల్‌ను వాహనాలకు ఫిల్ చేయటం జరిగింది. మంగళవారం నాటికి మిగిలిన 70 అవుట్‌లెట్లకు కూడా ఆయిల్‌ను పంపిణీ చేయనున్నారు.