తిరుపతిలో పోలింగ్ సరళిపై అధికారుల నిఘా
ABN , Publish Date - Nov 02 , 2026 | 12:19 AM
తిరుపతి నగర పాలక సంస్థ ఎన్నికల పోలింగ్ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైంది. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఓటింగ్ ప్రక్రియ సజావుగా సాగుతోందా? ఓటర్లకు ఇబ్బందులు ఏమైనా ఎదురవుతున్నాయా? భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అనే అంశాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
కలెక్టర్ నుంచి కమిషనర్ వరకు సుడిగాలి పర్యటన
ఓటింగ్ తీరును పరిశీలించిన ఉన్నతాధికారులు
అభ్యర్థులు, పార్టీల నేతల సందర్శనలతో కేంద్రాల వద్ద సందడి
తిరుపతి సెంట్రల్, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): తిరుపతి నగర పాలక సంస్థ ఎన్నికల పోలింగ్ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైంది. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఓటింగ్ ప్రక్రియ సజావుగా సాగుతోందా? ఓటర్లకు ఇబ్బందులు ఏమైనా ఎదురవుతున్నాయా? భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అనే అంశాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వెంకటేశ్వర్లు, కమిషనర్ జయకృష్ణ, సిబ్బంది కలిసి ఉదయం నగరంలోని శ్రీ పద్మావతి గర్ల్స్ హైస్కూలు, 25 వ వార్డు, 1,2,3 పోలింగ్ కేంద్రాల్లో అక్కారాంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 60 వవార్డు 1,2 పోలింగ్ కేంద్రాలు, తిమ్మినాయుడుపాల్లెం ఎంపీపీ స్కూలు, 1 వ వార్డు, 1,2 పోలింగ్ కేంద్రాలు, సత్యనారాయణపురంలోని 63 వ వార్డు, 1 నుంచి 5 వరకు వున్న పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన మౌళిక వసతులు, పోలింగ్ సరళిని ఎన్నికల సాధారణ పరిశీలకులు డాక్టర్ వరప్రసాద్‌తో కలిసి పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుంది? ఎన్నికల ఏర్పాట్లు, ఓటర్లకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సంధర్బంగా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ తిరుపతి నగర పాలక సంస్థ పరిధిలోని 304 పోలింగ్ కేంద్రాల్లో 100 శాతం వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేశామన్నారు. మిగిలిన నాలుగు పురపాలిక సంఘాల్లో 50 శాతం కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్, మరో 50 శాతం కేంద్రాల్లో వీడియోగ్రఫీ ద్వారా పోలింగ్ ప్రక్రియను వీడియోగ్రఫీ ద్వారా రికార్డు చేయడం జరిగిందన్నారు. అనంతరం మధ్యాహ్నం నుంచి నగర పాలక సంస్థ కమిషనర్ జయకృష్ణ డిప్యూటి కమిషనర్ అమరయ్యతో కలసి దాదాపు 10 డివిజన్లలో జరుగుతున్న పోలింగ్ సరళి, తాగునీరు, పారిశుద్యం ఏర్పాట్లు, విద్యుత్ సౌకర్యం, ఇతర మౌళిక వసతులు వున్నాయా లేదా అని పరిశీలించారు. ఓటర్లు ప్రశాంతంగా వచ్చి ఓటు వేసి వెళ్ళే విధంగా పోలింగ్ సిబ్బంది చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అర్హులైన ఓటర్లందరూ పోలింగ్ కేంద్రాలకు వచ్చి ప్రజాస్వామ్య పద్దతిలో ఓట్లు వేసి వెళ్ళాలని విజ్ఞప్తి చేశారు. ఉదయం నుంచి కమిషనర్ సుడిగాలి పర్యటన చేసి ఎక్కడా రిగ్గింగ్, దొంగ ఓట్లుకు అవకాశం లేకుండా ప్రిసైడింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆదివారం తిరుపతిలోని 304 కేంద్రాల్లో జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగిందని చెప్పారు.
ఓటు హక్కు వినియోగించుకున్న మేయర్ అభ్యర్థులు, ముఖ్య నాయకులు
తిరుపతి సెంట్రల్, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): తిరుపతిలో ఆదివారం జరిగిన నగర పాలక సంస్థ ఎన్నికల్లో కూటమి మేయర్ అభ్యర్థితో పాటు వైసీపీ, ఇతర పార్టీల అభ్యర్థులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీడీపీ తరపున మేయర్ అభ్యర్థిగా పోటిలో వున్న జేబీ శ్రీనివాస్ ఉదయం 10 గంటలకు పోస్టల్ కాలనీలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అక్కడ నుంచి కలియ తిరుగుతూ కెనడీనగర్‌లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. అలాగే శివజ్యోతినగర్, అక్కారాంపల్లి, సత్యనారాయణపురం, తిమ్మినాయుడుపాలెం, అశోక్‌నగర్, ఎన్టీవో కాలనీతో పాటు దాదాపు 59 పోలింగ్ కేంద్రాలు పరిశీలించారు. ఇక తుడా చైర్మన్ దివాకర రెడ్డి 52 వ డివిజన్, 53, 66, 1 వ డివిజన్, 5 వ డివిజన్, 32 వ డివిజన్, 23 వ డివిజన్, 25 వ డివిజన్ పరిధిలోని పోలింగ్ కేంద్రాలు పరిశీలించారు. ఓటర్లకు ఓటు ఎలా వేయాలి? మేయర్‌కు, కార్పొరేటర్‌కు వేర్వేరుగా రెండు బ్యాలెట్ పేపర్లలో సీలు వేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహయాదవ్, అతని కుటుంబ సభ్యులు కలసి 7 వ డివిజన్ పరిధిలోని లక్ష్మీపురం 7-4 బూత్‌లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ స్థానిక ఎస్పీ జేఎన్‌ఎం పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి, అతని కుమారుడు అభినయ రెడ్డి కుటుంబ సభ్యులు కలిసి తిరుమల రెడ్డి నగర్‌లోని 1 వ డివిజన్‌లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. శెట్టిపల్లి పోలింగ్ బూత్‌లో ఓటింగ్ సరళిని వైసీపీ మేయర్ అభ్యర్థి వాసుయాదవ్ పరిశీలించారు.