Share News

కష్టాలు, సంక్షోభాల నుంచే పరిష్కార మార్గాలు

ABN , Publish Date - Apr 23 , 2026 | 03:37 AM

కష్టాలు, సంక్షోభాల నుంచే పరిష్కార మార్గాలు ఆవిష్కృతం కావాలని, ఆ దిశగా యువత వినూత్న ఆలోచనలతో ముందుకు సాగాలని ఒడిశా గవర్నర్‌ డాక్టర్‌ కంభంపాటి హరిబాబు ఆకాంక్షించారు.

కష్టాలు, సంక్షోభాల నుంచే పరిష్కార మార్గాలు

  • నిషా ముక్త క్యాంప్‌సలుగా వర్సిటీలను తీర్చిదిద్దాలి

  • ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో ఒడిశా గవర్నర్‌ కంభంపాటి హరిబాబు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): కష్టాలు, సంక్షోభాల నుంచే పరిష్కార మార్గాలు ఆవిష్కృతం కావాలని, ఆ దిశగా యువత వినూత్న ఆలోచనలతో ముందుకు సాగాలని ఒడిశా గవర్నర్‌ డాక్టర్‌ కంభంపాటి హరిబాబు ఆకాంక్షించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇంజనీరింగ్‌ కళాశాల, మహిళా ఇంజనీరింగ్‌ కళాశాలలు సంయుక్తంగా బుధవారం విశాఖపట్నం బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ కరోనా వంటి విపత్కర సమయంలో డిజిటల్‌ పేమెంట్‌ అనే సరికొత్త విధానం విస్తృతంగా వినియోగంలోకి వచ్చిందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ బాగుపడాలన్నా, ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నా వస్తువుల దిగుమతికి వెచ్చించే ఖర్చును నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. క్రూడాయిల్‌, ఆయుధ సామగ్రి, వంట నూనెల దిగుమతికి అధిక మొత్తాన్ని వెచ్చిస్తున్నామని, వీటికిప్రత్యామ్నాయ మార్గాలపై యువత దృష్టి సారించాలని సూచించారు. ఏకాగ్రత, క్రమశిక్షణ, స్థిరమైన కృషి కలిగి ఉంటే నిర్దిష్ట లక్ష్యాలను సాధించడం సాధ్యపడుతుందన్నారు. పుస్తకాలను దాటి అభ్యాసనం జరగాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్‌కు విద్యార్థులు దూరంగా ఉండేలా చూడాలని, నిషా ముక్త క్యాంప్‌సలుగా వర్సిటీలను తీర్చిదిద్దేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉన్నత విద్య మండలి చైర్మన్‌ కె.మధుమూర్తి మాట్లాడుతూ ఏయూ మానవ వనరులను తయారుచేయడంతోపాటు నాయకత్వాన్ని కూడా పెంపొందించిందన్నారు. అనంత అవకాశాలను అందించే శక్తి ఏయూకు ఉందన్నారు. కార్యక్రమంలో సింగపూర్‌ ఎన్‌టీయూ (నన్యాంగ్‌ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ) ప్రెసిడెంట్స్‌ చైర్‌ ప్రొఫెసర్‌ ఉపద్రష్ట రామమూర్తి, రెక్టార్‌ ప్రొఫెసర్‌ పి.కింగ్‌, ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ ఎం.శశి, మహిళా ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.పద్మశ్రీతోపాటు పలువురు మాజీ ప్రిన్సిపాల్స్‌, సీనియర్‌ ప్రొఫెసర్లు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు పూర్వ విద్యార్థులైన ప్రముఖులను, మాజీ ప్రిన్సిపాల్స్‌ను ఘనంగా సత్కరించారు. అనంతరం ప్రత్యేక సంచికను గవర్నర్‌ హరిబాబు ఆవిష్కరించారు.

Updated Date - Apr 23 , 2026 | 03:37 AM