Share News

ఇచ్చంపల్లిలో మిగులు జలాలు లేవు

ABN , Publish Date - Jun 16 , 2026 | 04:25 AM

గోదావరి-కావేరి అనుసంధాన పథకం కోసం తెలంగాణలోని ఇచ్చంపల్లి ప్రాజెక్టు నుంచి జలాల తరలింపు సాధ్యం కాదని జాతీయ జల అభివృద్ధి సంస్థ(ఎన్‌డబ్ల్యూడీఏ) స్పష్టం చేసింది.

ఇచ్చంపల్లిలో మిగులు జలాలు లేవు

  • తేల్చిన జాతీయ జల అభివృద్ధి సంస్థ

  • గోదావరి నీరు కావేరికి మళ్లించాలంటే ఛత్తీస్‌గఢ్‌ అనుమతి తప్పనిసరి

  • ఆ రాష్ట్రం వాడుకోని సాగునీరే శరణ్యం.. నివేదికలో స్పష్టంచేసిన ఎన్‌డబ్ల్యూడీఏ

  • తెలంగాణ నుంచి అనుసంధానిస్తే ప్రయోజనం లేదు: ఏపీ జలవనరుల శాఖ

అమరావతి, జూన్‌ 15(ఆంధ్రజ్యోతి): గోదావరి-కావేరి అనుసంధాన పథకం కోసం తెలంగాణలోని ఇచ్చంపల్లి ప్రాజెక్టు నుంచి జలాల తరలింపు సాధ్యం కాదని జాతీయ జల అభివృద్ధి సంస్థ(ఎన్‌డబ్ల్యూడీఏ) స్పష్టం చేసింది. దీనికి కారణం.. ఇచ్చంపల్లిలో మిగులు జలాలేవీ లేకపోవడమేనని పేర్కొంది. ఇచ్చంపల్లిలో 75 శాతం నీటి లభ్యతే ఉన్నందున మిగులు జలాలు అందుబాటులో లేవని తేల్చిచెప్పింది. గోదావరి-కావేరి అనుసంధాన పథకం కోసం కేంద్ర జల సంఘం సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌)ను తయారు చేసింది. దీని ప్రకారం.. 2023 నాటికి ఇచ్చంపల్లి వద్ద గోదావరి జలాలు 75 శాతం అందుబాటులో ఉన్నాయి. మిగులు జలాలేవీ అందుబాటులో లేవు. ఈ మేరకు ఎన్‌డబ్ల్యూడీఏ ఓ నివేదికలో స్పష్టం చేసింది. 1980 నుంచి ఇప్పటి వరకు గోదావరి జలాలపై అధ్యయనం చేసినట్టు పేర్కొంది. గోదావరి-కావేరి అనుసంధాన పథకం కోసం 4,189 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్‌ల(ఎంసీఎం) జలాలు అవసరమవుతాయని తెలిపింది. ఈ జలాలను తరలించాలంటే.. ఇచ్చంపల్లి నుంచి సాధ్యంకాదని, ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌ వినియోగించుకోని సాగునీటిని వాడుకోవాలని అభిప్రాయపడింది. కానీ, గోదావరి జల వివాదాల ట్రైబ్యునల్‌ ఆదేశాల మేరకు సాగునీటిని ఇతర ప్రాంతాలకు బదలాయించేందుకు వీల్లేదని కూడా స్పష్టం చేసింది. అయితే, ఛత్తీస్‌గఢ్‌ వాడుకోకుండా వదిలేసిన 149 టీఎంసీలను ఇచ్చంపల్లి నుంచి కావేరికి తరలించేందుకు ముందస్తుగా అనుమతులు పొందాల్సి ఉందని ఎన్‌డబ్ల్యూడీఏ వెల్లడించింది. దీంతో ఛత్తీస్‌గఢ్‌ అనుమతి ఇస్తేనే గోదావరి-కావేరీ అనుసంధాన పథకానికి కదలిక వచ్చే వీలుందని నిపుణులు చెబుతున్నారు. నీటి లభ్యత లేకపోవడంతో.. ఇచ్చంపల్లి నుంచి కావేరికి గోదావరి జలాలను తరలించడం ప్రశ్నార్థకంగా మారిందని రాష్ట్ర జల వనరుల నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గత నెల 23న సీడబ్ల్యూసీ ఆధ్వర్యంలో గోదావరి నదీ యాజమాన్య బోర్డు హైబ్రీడ్‌ విధానంలో గోదావరి-కావేరి అనుసంధాన పథకం నీటి లభ్యతపై సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో తెలంగాణ భూభాగం నుంచి తుపాకుల గూడెం వద్ద సమక్క-సారలక్క ఎత్తి పోతల పథకం నుంచి నాగార్జున సాగర్‌ మీదుగా కావేరికి నీటిని తరలించడంపైన, అదేవిధంగా పోలవరం-బనకచర్ల హెడ్‌రెగ్యులేటర్‌ మీదుగా కావేరీకి గోదావరిని అనుసంధానించడంపైనా చర్చించారు. అయితే, తెలంగాణ భూభాగం నుంచి గోదావరి జలాలను కావేరికి అనుసంధానించడం వల్ల ఆంధ్రప్రదేశ్‌కు ఒనగూరే ప్రయోజనం ఏమీ ఉండదని ఏపీ వాదించింది. ఈ నేపథ్యంలో పోలవరం-కావేరి అనుసంధాన పథకం చేపట్టాలని ఏపీ స్పష్టం చేసింది. ఒకవైపు నీటి లభ్యత లేకపోవడం, మరోవైపు ఏకాభిప్రాయం కుదరకపోవడంతో.. గోదావరి-కావేరి అనుసంధాన పథకంపై కేంద్ర జలశక్తి శాఖ తుది నిర్ణయానికి రాలేకపోతోందని జలవనరుల నిపుణులు చెబుతున్నారు.

Updated Date - Jun 16 , 2026 | 04:25 AM