12 లక్షలిస్తే మీ కూతురిని అప్పగించేస్తా!
ABN , Publish Date - Aug 10 , 2026 | 04:07 AM
ప్రేమించి పోలీస్ స్టేషన్లో పెళ్లి చేసుకున్న యువకుడు.. ఆపై తన భార్యను ఆమె తల్లిదండ్రులకు అప్పగించడానికి రూ.12 లక్షలకు బేరం పెట్టిన ఉదంతమిది.
స్టేషన్లో పెళ్లి చేసుకున్న రోజే ప్రేమికుడి బేరం
రంగంలోకి నూజివీడు పోలీసులు
నూజివీడు, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): ప్రేమించి పోలీస్ స్టేషన్లో పెళ్లి చేసుకున్న యువకుడు.. ఆపై తన భార్యను ఆమె తల్లిదండ్రులకు అప్పగించడానికి రూ.12 లక్షలకు బేరం పెట్టిన ఉదంతమిది. ఏలూరు జిల్లా నూజివీడు మండలం గొల్లపల్లికి చెందిన యువతి, కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లికి చెందిన మధు అనే యువకుడు ప్రేమించుకున్నారు. ఇద్దరు మేజర్లే. నాలుగు రోజుల క్రితం మధు స్నేహితులు నలుగురు ఆ యువతిని బాపులపాడు మండలం వీరవల్లి పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లి అక్కడ ప్రేమికులకు వివాహం జరిపించారు. కుమార్తె జాడ తెలియక యువతి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో అదేరోజు మధు, అతడి స్నేహితులు యువతి తల్లిదండ్రులకు ఫోన్‌చేసి ‘మీ కూతుర్ని మీకు అప్పగించాలంటే రూ.12 లక్షలు చెల్లించాలి. అలాగే.. మా మీద ఎలాంటి కేసులూ లేకుండా చేస్తే మీ కూతురిని మీ ఇంటి ముందు దించుతాం’ అంటూ బేరసారాలు సాగించారు. దీంతో ఆమె తల్లిదండ్రులు రూ.6లక్షలు చెల్లించడానికి సిద్ధపడ్డారు. డబ్బు చెల్లించినా తమ కుమార్తెను అప్పగిస్తారో లేదో అనే అనుమానంతో వీరు ఆదివారం రాత్రి నూజివీడులో మీడియాకు, మంత్రి కొలుసు పార్థసారథి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో నూజివీడు పోలీసులు రంగంలోకి దిగి సదరు ప్రేమికుడిని, అతడి స్నేహితులను పట్టుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు.