Gulf TDP Leaders: గల్ఫ్ దేశాల్లో ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళి
ABN , Publish Date - Jan 20 , 2026 | 04:13 AM
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 30వవర్ధంతిసందర్భంగా ఆదివారం రాత్రి గల్ఫ్ దేశాల్లో తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు...
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 30వవర్ధంతిసందర్భంగా ఆదివారం రాత్రి గల్ఫ్ దేశాల్లో తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆయనకు ఘనంగా నివాళులు ఆర్పించారు. తెలుగుదేశం పార్టీ సౌదీ అరేబియా అధ్వర్యంలో రాజధాని రియాద్ నగరంలో జాని బాషా అధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ అభిమానులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అనే సిద్దాంతాన్ని తెలుగునాట శ్రీకారం చుట్టిన మహానాయకుడు ఎన్టీఆర్ అని జానీ బాషా పేర్కొన్నారు. బహ్రెయిన్ జరిగిన కార్యక్రమంలో పార్టీ నాయకులను ఉద్దేశించి శాసన సభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని సంపూర్ణంగా బలపర్చిన ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగించడానికి నేటి తరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు రఘునాథ్ బాబు, హరిబాబు, రాంమోహన్, తదితరులు పాల్గొన్నారు. కువైత్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ నాయకులు సుధాకర్ రావు కుదరవల్లి, ఈశ్వర్లు ,వెంకట్ కోడూరి, సుబ్బరాయుడు ఎన్టీఆర్‌కు ఘన నివాళి ఆర్పించారు. దుబాయి ఎమిరేట్‌లో కూడ తెలుగుదేశం పార్టీ అభిమానులు ఎన్టీఆర్ వర్ధంతిని నిర్వహించారు. ఒమన్, ఖతర్ దేశాల్లోనూ తెలుగుదేశం పార్టీ అభిమానులు నందమూరి తారక రామారావుకు ఘనంగా నివాళులు అర్పించారు. గల్ఫ్ దేశాల్లో కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ గల్ఫ్ విభాగం అధ్యక్షుడు రావి రాధాకృష్ణ సమన్వయం చేసారు.