ఎన్టీఆర్ ప్రారంభించారు..చంద్రబాబు పూర్తిచేశారు!
ABN , Publish Date - Aug 26 , 2026 | 05:53 AM
రాయలసీమ అభివృద్దికి సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో సంపూర్ణ అభివృద్ధి చేసి పూర్వ వైభవం తీసుకురావడం తమకే సాధ్యమని కర్నూలు జిల్లా ఇన్‌చార్జి మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.
సీమ ప్రాజెక్టులపై నిమ్మల వెల్లడి
ఈ రెండేళ్లలో నీటి పథకాలకు 27 వేల కోట్లు
ఇందులో సగం రాయలసీమ స్కీములకే
ఒకే సీజన్‌లో తుంగభద్రకు 33 కొత్త గేట్లు
రూ.1,600 కోట్లతో వేదవతి ప్రాజెక్టు: మంత్రి
మంత్రాలయంలో ‘మంత్రుల అవుట్‌రీచ్’
కర్నూలు, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): రాయలసీమ అభివృద్దికి సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో సంపూర్ణ అభివృద్ధి చేసి పూర్వ వైభవం తీసుకురావడం తమకే సాధ్యమని కర్నూలు జిల్లా ఇన్‌చార్జి మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ రెండేళ్లలో సాగునీటి ప్రాజెక్టులపై రూ.27 వేల కోట్లు వెచ్చిస్తే.. అందులో సగం నిధులు సీమ ప్రాజెక్టులకే ఖర్చు చేశామని తెలిపారు. విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, మంత్రాలయం టీడీపీ ఇన్‌చార్జి రాఘవేంద్రరెడ్డితో కలసి మంగళవారం మంత్రాలయంలో జరిగిన ‘మంత్రుల అవుట్‌రీచ్’ కార్యక్రమంలో నిమ్మల పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడారు. కళ్లముందే వేల టీఎంసీల వరద శ్రీశైలం ప్రాజెక్టు దాటి సముద్రంలో కలుస్తుంటే.. ఆ నీళ్లు కరువుసీమకు మళ్లించాలనే మహోన్నత ఆశయంతో తెలుగుగంగ ప్రాజెక్టు, గాలేరు-నగరి, హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిన మహనీయుడు ఎన్టీఆర్ అని తెలిపారు. ఆ ప్రాజెక్టులను పూర్తి చేసిన ఘనత చంద్రబాబుదేనన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు ప్రమాదంలో ఉందని కేంద్ర జల సంఘం హెచ్చరించినా నాడు జగన్ ఒక్కపైసా ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తే.. కూటమి ప్రభుత్వం వచ్చాక రూ.203 కోట్లతో మరమ్మతులు చేపట్టామని చెప్పారు.
ఒకే సీజన్‌లో తుంగభద్ర డ్యాం 33 గేట్లూ తొలగించి కొత్తవి బిగించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. కరువు పీడిత, ఫ్లోరైడ్ బాధిత ప్రకాశం జిల్లాకు కృష్ణా నీళ్లివ్వాలని ఆనాడు చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని.. ఇన్నాళ్లకు పూర్తిచేసి ఈ నెల 31న ఆయన చేతుల మీదుగానే జాతికి అంకితం చేయబోతున్నామని వివరించారు. సీమ జిల్లాలకు గుండ్రేవుల ప్రాజెక్టు, ఆర్డీఎస్ కుడి కాలువ ప్రాజెక్టు ఎంతో అవసరమని.. అంతర్రాష్ట్ర సమస్యల వల్ల పెండింగ్ పడుతూ వచ్చాయని తెలిపారు. సామరస్యంగా వివాదాన్ని పరిష్కరించి ఈ ప్రాజెక్టులను చేపడతామని చెప్పారు. రూ.1,600 కోట్లతో వేదవతి ప్రాజెక్టును 2029లోగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారని అన్నారు. బీసీలకు పెద్దపీట వేసిన ఘనత టీడీపీదేనని, వారికి స్థానిక సంస్థల్లో 34శాతం రిజర్వేషన్ కల్పిస్తే.. జగన్ 24 శాతానికి తగ్గించారని, మళ్లీ 34 శాతానికి పెంచి చంద్రబాబు చరిత్ర సృష్టించారని చెప్పారు.