Share News

అనంతలోనే ఎన్టీఆర్‌ రాజకీయ ప్రస్థానం ప్రారంభం

ABN , Publish Date - May 29 , 2026 | 04:12 AM

టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు రాజకీయ ప్రస్థానం ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే మొదలైందని విశ్రాంత ఐఏఎస్‌ అధికారి కె.లక్ష్మీనారాయణ అన్నారు.

అనంతలోనే ఎన్టీఆర్‌ రాజకీయ ప్రస్థానం ప్రారంభం

  • రాయలసీమ ప్రజల గుండెల్లో ఆయనకు ప్రత్యేక స్థానం

  • విశ్రాంత ఐఏఎస్‌ కె.లక్ష్మీనారాయణ

అనంతపురం ఉన్నత విద్య, మే 28 (ఆంధ్రజ్యోతి): టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు రాజకీయ ప్రస్థానం ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే మొదలైందని విశ్రాంత ఐఏఎస్‌ అధికారి కె.లక్ష్మీనారాయణ అన్నారు. అనంతపురం జిల్లాలోని ఎస్కే యూనివర్సిటీలో గురువారం జరిగిన ఎన్టీఆర్‌ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. వీసీ జ్యోతికుమార్‌, రిజిస్ట్రార్‌ రమేశ్‌బాబు తదితరులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ ఉమ్మడి అనంతపురం జిల్లాను తన కర్మభూమి అని నమ్మారని, అందుకే హిందూపురం నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని సాగించారని అన్నారు. రాయలసీమ అభివృద్ధి కోసం తెలుగు గంగ ప్రాజెక్టు, గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు తెచ్చారన్నారు. రాయలసీమ ప్రజల హృదయాల్లో ఆయన ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారని చెప్పారు. వీసీ జ్యోతికుమార్‌ మాట్లాడుతూ.. ఏపీలో ఆయన పరిపాలన ఒక చరిత్ర అన్నారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలమంతా ధర్మకర్తగానే పరిపాలన చేశారని, ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజలకు అందించారని కొనియాడారు. అనంతరం విశ్రాంత ఐఏఎస్‌ కె.లక్ష్మీనారాయణను ఘనంగా సత్కరించారు. వర్సిటీ గ్రంథాలయానికి తాను రచించిన ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర పుస్తకాలను లక్ష్మీనారాయణ కానుకగా ఇచ్చారు. కార్యక్రమంలో ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ రామచంద్ర, మాజీ రిజిస్ర్టార్‌ సుధాకర్‌ బాబు, ఆర్థిక శాఖ మాజీ ఆచార్యులు నారాయణ, లక్ష్మయ్య, ప్రొఫెసర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - May 29 , 2026 | 04:12 AM