‘జలసిరి’ కావాలి!
ABN , Publish Date - Apr 06 , 2026 | 04:31 AM
పేద రైతుల పొలాల్లో జలసిరిని కురిపించే ఎన్టీఆర్ జలసిరి పథకం అమలు కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. సాగు విస్తీర్ణం పెంచి, మంచి దిగుబడులు సాధించేందుకు...
గత టీడీపీ హయాంలో ప్రారంభమైన పథకం
జలకళగా పేరు మార్చిన గత వైసీపీ సర్కారు
మొత్తం ఉచితం అని చెప్పి చేతులెత్తేసిన వైనం
కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో జలసిరికి హామీ
పథకం ప్రారంభం కోసం రైతుల ఎదురుచూపు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
పేద రైతుల పొలాల్లో జలసిరిని కురిపించే ఎన్టీఆర్ జలసిరి పథకం అమలు కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. సాగు విస్తీర్ణం పెంచి, మంచి దిగుబడులు సాధించేందుకు గాను 2014-19 మధ్యకాలంలో టీడీపీ హయాంలో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఎస్సీ, ఎస్టీ రైతులు రూ.6వేలు, ఇతర పేద రైతులు రూ.25వేలు ఖర్చుచేస్తే సుమారు రూ.2.42 లక్షల విలువైన బోరు, మోటారు, సోలార్ పంపుసెట్ అందించారు. అప్పట్లో భారీసంఖ్యలో రైతులు ఈ పథకం కింద లబ్ధి పొందారు. నీటి వనరులు లేనిచోట దీంతో రైతులకు ఎంతో మేలు జరిగింది. 2019లో వైసీపీ సర్కార్ వచ్చిన తర్వాత వైఎ్‌సఆర్ జలకళగా పేరు మార్చింది. రైతు భరోసా కింద జలకళ పేరుతో బోరుబావుల పథకం విధి విధానాలు తెచ్చారు. 2019-20లో బడ్జెట్‌లో రూ.200 కోట్లు, 2020-21లో రూ.100 కోట్లు, 2021-22లో రూ.200 కోట్లు చొప్పున కేటాయించారు. అయితే ఏ సంవత్సరం కూడా రూ.50 కోట్లకు మించి ఖర్చు చేయలేదు. మొత్తం ఉచితంగానే అందిస్తామని చెప్పి చివరకు చేతులెత్తేసింది. రైతులకు ఉచితంగా సోలార్ పంపుసెట్లు అందిస్తామని మరోసారి మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికో బోర్ మెషీన్ కొనుగోలు చేసి రైతుల పొలాల్లో ఉచితంగా బోర్లు వేస్తామని అప్పట్లో వాగ్దానం చేసింది. టెండర్లు పిలిచినా ఆ బోర్ మెషీన్లు కొనలేదు. ఆ తర్వాత ప్రైవేట్ కాంట్రాక్టర్ల ద్వారా నియోజకవర్గానికో మెషీన్ ఏర్పాటు చేసి బోర్లు తవ్వాలని నిర్ణయించారు. అయితే బిల్లులు ఇవ్వకపోవడంతో వారు బోర్లు వేయకుండా నిలిపేశారు. బోర్ల కోసం జిల్లాల్లో వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చినా పట్టించుకోలేదు.
నిబంధనలు సరళతరం
రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతో పాటు అగ్రవర్ణాల పేద రైతుల భూములను సస్యశ్యామలం చేసేందుకు రూపొందించిన పథకం ఎన్టీఆర్ జలసిరి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిర జలప్రభ పేరుతో ఈ పథకం ప్రారంభమైనా... అప్పట్లో నాబార్డు నిధులివ్వకపోవడంతో కొనసాగలేదు. ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని నెలల పాటు ప్రభుత్వ ప్రధానకార్యదర్శులే స్వయంగా నిరంతర కసరత్తుతో పకడ్బందీగా ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చారు. విస్తృత అవగాహన కలగడంతో రైతులు భారీగా దరఖాస్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ జలసిరి ద్వారా రూ.6 వేలు చెల్లిస్తే ఐదెకరాల లోపు ఎస్సీ, ఎస్టీ రైతులకు 200 అడుగుల బోరుబావితో పాటు రూ.2.42 లక్షల విలువైన 5 హెచ్‌పీ సోలార్‌పంపు సెట్లను అమర్చేవారు. అగ్రవర్ణాలకైతే రూ.25 వేలు చెల్లిస్తే ఈ సౌకర్యాలన్నీ అందేవి. 2018-19 సంవత్సరానికి సంబంధించి 45,300 బోర్లు తవ్వి వాటికి సోలార్ పంపు సెట్లు అమర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అప్పట్లో 12,305 బోరుబావులను తవ్వారు. దాదాపు 8,939 బోరుబావులను సోలార్ పంపుసెట్లతో శక్త్తిమంతం చేశారు. దీనిద్వారా 17,878 మంది రైతులు లబ్ధి పొందగా, 44,695 ఎకరాలు సాగులోకి వచ్చాయి. ఇందుకు ప్రభుత్వం రూ.51.26 కోట్లు ఖర్చు చేసింది. 2016-17లో ప్రారంభించిన ఈ పథకం అంచలంచెలుగా పేదల్లోకి వెళ్లింది. రాష్ట్రవ్యాప్తంగా లక్ష బోర్లు ఏర్పాటుచేసి 10 లక్షల ఎకరాలు సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంజూరైన బోర్లన్నీ రద్దు చేసింది. అంతకుముందు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకుని మంజూరైన వారిని పట్టించుకోలేదు. కొంతమంది రైతులు సోలార్ సెట్ల కోసం చేసిన డిపాజిట్ డీడీలను వెనక్కి తీసుకున్నారు. పలు జిల్లాల్లో ఆ డీడీలు కూడా ఇంకా లబ్ధిదారులకు తిరిగి ఇవ్వలేదు. ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి ఇచ్చిన హామీ మేరకు తిరిగి ఎన్టీఆర్ జలసిరిని అమలు చేయాలని, గత టీడీపీ హయాంలో బోర్లు వేసి అసంపూర్తిగా ఉన్నవారికి కూడా మోటార్లు, పంపుసెట్లు అందజేయాలని రైతులు కోరుతున్నారు.