Share News

NTR Health University: అంతా రూల్స్‌ ప్రకారమే అంటూ..

ABN , Publish Date - Jan 03 , 2026 | 06:39 AM

కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ (సీవోఈ) నియామక ప్రక్రియను నిబంధనల ప్రకారమే చేపట్టామని ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ తెలిపింది...

NTR Health University: అంతా రూల్స్‌ ప్రకారమే అంటూ..

  • ‘ఆంధ్రజ్యోతి’ కథనంపై హెల్త్‌ వర్సిటీ వివరణ

  • అయితే తన ప్రకటనలోనే దొరికేసిన వైనం

  • ‘సీవోఈ’గా మెడికల్‌ ఫ్యాకల్టీ ఉంటే పాలన బాగుంటుందట!

  • విచిత్ర వాదన..‘అనుబంధ’ నిబంధన పక్కకు..

  • డెంటల్‌, ఆయు్‌షకు అర్హత ఉన్నా మొండిచెయ్యి

  • ‘కోరిన’ వ్యక్తితో భర్తీ

అమరావతి, జనవరి 2(ఆంధ్రజ్యోతి): కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ (సీవోఈ) నియామక ప్రక్రియను నిబంధనల ప్రకారమే చేపట్టామని ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ తెలిపింది. అనుబంధ కాలేజీల ప్రొఫెసర్లను ఈ పోస్టులో నియమించాలన్న నిబంధనను పక్కనబెట్టి, తిరుపతి స్విమ్స్‌కు చెందిన డాక్టర్‌ సీహెచ్‌ శ్రీకాంత్‌ను నియమించడంపై శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’ ‘‘ఏంటీ నియామకం?’’ పేరుతో కథనం ప్రచురించింది. దీనిపై వర్సిటీ అధికారులు ఒక ప్రకటనలో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ‘‘గత ఏడాది అక్టోబర్‌ 10వ తేదీన సీవోఈ పోస్టుకు నోటిఫికేషన్‌ జారీ చేశాం. వర్సిటీ అనుబంధ కాలేజీల నుంచి ఎనిమిది మంది వైద్యులు ఈ పోస్టు కోసం దరఖాస్తు చేశారు. అందులో నలుగురు మాత్రమే వర్సిటీ కోరిన పత్రాలను సమర్పించారు. దీంతో ఆ నలుగురి పేర్లనే వర్సిటీ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ (ఈసీ) సమావేశంలో పరిగణనలోకి తీసుకున్నాం. వారిలో ఒక్కరు మాత్రమే మెడికల్‌ ఫ్యాకల్టీకి చెందిన వ్యక్తి. మిగిలిన ముగ్గురూ డెంటల్‌ కాలేజీ ప్రొఫెసర్లు. ఈ అంశంపై ఈసీ భేటీలో సుదీర్ఘంగా చర్చించాం. కమిటీ సభ్యులంతా మెడికల్‌ ఫ్యాకల్టీ వైపే మొగ్గు చూశారు. వర్సిటీ అకడమిక్‌ వ్యవహారాలపై మెడికల్‌ ఫ్యాకల్టీకే పూర్తి అవగాహన ఉంటుందని, పరిపాలన వ్యవహారాల్లో అనుభవం ఉంటుందని సభ్యులు అభిప్రాయపడ్డారు. అందువల్ల వర్సిటీ అనుబంధ కాలేజీలకు చెందిన వైద్యులను సీవోఈగా నియమించాలన్న నిబంధనను ఈసీ మీటింగ్‌లో సవరించాం. అందుకు సభ్యులంతా అంగీకరించారు. వర్సిటీ అనుబంధ కాలేజీలతోపాటు రాష్ట్రంలోని ఏదైనా మెడికల్‌ కాలేజీలో విధులు నిర్వహించే ప్రొఫెసర్లు (మెడికల్‌ ఫ్యాకల్టీ) సైతం సీవోఈ పోస్టు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఆ సవరణ కల్పించింది. ఇదంతా సక్రమంగానే జరిగింది. ఈసీ మీటింగ్‌లో తీసుకున్న నిర్ణయం ప్రకారమే వ్యవహరించాం’’ అని అధికారులు తమ వివరణలో తెలిపారు.


దొరికిపోయారు ఇలా...

ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ సర్వీస్‌ రూల్స్‌ -2015 నిబంధనల ప్రకారం సీవోఈ పోస్టుకు మెడికల్‌, డెంటల్‌, ఆయుష్‌ విభాగాల ప్రొఫెసర్లు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. నాలుగు దరఖాస్తుల్లో ఒకరు మెడికల్‌, ముగ్గురు డెంటల్‌ విభాగాలకు చెందిన వైద్యులున్నట్టు తన ప్రకటనలో వర్సిటీయే అంగీకరించింది. ఆ ముగ్గురు కూడా హెల్త్‌ వర్సిటీ అనుబంధ కాలేజీల్లో విధులు నిర్వహిస్తున్నవారే. అలాంటప్పుడు ఆ ముగ్గురిలో ఒకరిని ఎంపిక చేసే అవకాశం ఉంది. కానీ వర్సిటీ అధికారులు ఉద్దేశపూర్వకంగానే ‘మెడికల్‌ ఫ్యాకల్టీ’ అనే వాదనను తెరపైకి తెచ్చారు. మెడికల్‌ ఫ్యాకల్టీ అయితే వర్సిటీ పాలన బాగుంటుందన్న విచిత్రమైన వాదనను ముందుకు తెచ్చారు. వర్సిటీ అధికారులు సీవోఈగా ఎవరిని ఎంపిక చేయాలన్న విషయంలో ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చి.. ఆ తర్వాతే ఈసీ భేటీ నిర్వహించారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయాన్ని ప్రభుత్వం వద్ద గోప్యంగా ఉంచి, డా.శ్రీకాంత్‌ను కమిటీనే ఎంపిక చేసిందనే అభిప్రాయం కల్గించారు. ప్రభుత్వం దీనిపై ఎటువంటి విచారణ చేయకుండానే జీవో జారీ చేసింది.

వారంలోనే ముగించేశారు..

ఈసీ మీటింగ్‌లో తెచ్చిన సవరణ ప్రకారం రాష్ట్రంలో ఏ మెడికల్‌ కాలేజీలో విధులు నిర్వహించే వైద్యులైనా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. నిబంధనల ప్రకారం, డెంటల్‌, ఆయుష్‌ విభాగాల వైద్యులకు కూడా వెసులుబాటు ఇవ్వాలి. కానీ వర్సిటీ అధికారులు అలా చేయలేదు. కేవలం మెడికల్‌ ఫ్యాకల్టీకి మాత్రమే వెసులుబాటు కల్పించారు. ఈ మేరకు గత ఏడాది డిసెంబరు 17వ తేదీన సీవోఈ పోస్టుకు రెండోసారి నోటిఫికేషన్‌ జారీ చేసింది. రెండో నోటిఫికేషన్‌లో కేవలం వారం రోజులు గడువు మాత్రమే ఇచ్చారు. ముగ్గురు వైద్యులు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నారు. తిరుపతి స్విమ్స్‌కు చెందిన డా.శ్రీకాంత్‌తో పాటు ప్రభుత్వ ఆయుర్వేద కాలేజీకి చెందిన ప్రొఫెసర్‌ డా.కె.విజయకుమారి, డా.అపర్ణలు దరఖాస్తు చేశారు. ఈ ముగ్గురిలోనూ విజయకుమారి వర్సిటీ అనుబంధ కాలేజీలో విధులు నిర్వహిస్తున్న వైద్యురాలే. కానీ, ఆమె దరఖాస్తును కూడా పక్కన పెట్టడం గమనార్హం. ‘కోరుకున్నట్టే’ శ్రీకాంత్‌ను ఆ పోస్టులో వర్సిటీ అధికారులు కూర్చోబెట్టారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Updated Date - Jan 03 , 2026 | 06:39 AM