Share News

ఎన్టీఆర్‌కు ఘన నివాళి

ABN , Publish Date - May 29 , 2026 | 03:13 AM

టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు 103వ జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులు, నేతలు, సినీ నటులు, అభిమానులు ఆయనకు ఘనంగా ..

ఎన్టీఆర్‌కు ఘన నివాళి

  • ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్దకుటుంబ సభ్యులు, నేతల నివాళులు

  • ఎన్టీఆర్‌కు భారతరత్న తెలుగు ప్రజల ఆకాంక్ష: నారా భువనేశ్వరి

5.jpg

ఖైరతాబాద్‌/హైదరాబాద్‌/న్యూఢిల్లీ, మే 28 (ఆంధ్రజ్యోతి): టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు 103వ జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులు, నేతలు, సినీ నటులు, అభిమానులు ఆయనకు ఘనంగా నివాళి అర్పించారు. నారా భువనేశ్వరి, నందమూరి రామకృష్ణ, దగ్గుబాటి పురందేశ్వరి దంపతులు, కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి నివాళి అర్పించారు. లక్ష్మీపార్వతి, మోత్కుపల్లి నర్సింహులు, మాజీ మంత్రులు మండవ వెంకటేశ్వర్లు, పెద్దిరెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డి తదితరులు అంజలి ఘటించారు. సినీ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ తెల్లవారుజామునే ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్దకు వచ్చారు. కొంతసేపు తాత సమాధి వద్ద మౌనంగా కూర్చుని నివాళి అర్పించారు. ఢిల్లీలో పార్లమెంటు కొత్త భవనంలోని టీడీపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో, ఏపీ భవన్‌లోని అంబేద్కర్‌ ఆడిటోరియంలో ఎన్టీఆర్‌ జయంతి ఉత్సవాలను నిర్వహించారు. కాగా, ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా ఎన్టీఆర్‌ భవన్‌లో ఉచిత మెగా వైద్య, రక్తదాన శిబిరం నిర్వహించారు. ఎన్టీఆర్‌ తనయుడు రామకృష్ణ కూడా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌కు భారతరత్న తెలుగు ప్రజల ఆకాంక్ష అని, దీనిపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నామని నారా భువనేశ్వరి చెప్పారు. ఇక ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ.. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్‌ అని, రాజకీయమంటే ప్రజాసేవ అని ఆయన చూపించారని పేర్కొన్నారు.

ఎన్టీఆర్‌ జీవితం ఎందరికో స్ఫూర్తి: ప్రధాని మోదీ

ఎన్టీఆర్‌ జీవితం ఎంతో మందికి ఒక స్ఫూర్తిగా నిలుస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రజాసంక్షేమం, పాలన నిబద్ధతతో పేదలు, అణగారిన వర్గాల వారికి ఆత్మగౌరవంతో కూడిన జీవితాన్ని అందించారన్నారు. ఈ మేరకు గురువారం ‘ఎక్స్‌’లో పోస్టు పెట్టారు. ఏపీలో తన మిత్రుడు చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం.. ప్రజల కోసం ఎన్టీఆర్‌ కన్న కలలను, ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి పూర్తిగా కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

Updated Date - May 29 , 2026 | 03:13 AM