Share News

CM Chandrababu Naidu: డబుల్‌ ఇంజన్‌ కాదు.. ఇది బుల్లెట్‌ సర్కారు

ABN , Publish Date - Jan 10 , 2026 | 06:13 AM

మనది డబుల్‌ ఇంజన్‌ సర్కారు కాదని.. బుల్లెట్‌ సర్కారు అని సీఎం చంద్రబాబు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరంలో శుక్రవారం..

CM Chandrababu Naidu: డబుల్‌ ఇంజన్‌ కాదు.. ఇది బుల్లెట్‌ సర్కారు

  • జనవరి 9 పవిత్రమైన రోజు... మండపేట కార్యకర్తల భేటీలో సీఎం

రాయవరం, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): మనది డబుల్‌ ఇంజన్‌ సర్కారు కాదని.. బుల్లెట్‌ సర్కారు అని సీఎం చంద్రబాబు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరంలో శుక్రవారం ఆ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘జనవరి 9 పవిత్రమైన రోజు. చరిత్రలో సుపరిపాలనకు నాంది పలికిన రోజు. ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్‌ ప్రమాణస్వీకారం చేసిన రోజు. అలాగే సుపరిపాలనలో భాగంగా ఇవాళ నేను రాయవరంలో రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్‌పుస్తకాలు అందించడం ఒక చరిత్ర. ఎన్నికల్లో గెలవడం.. కలిసి పనిచేయడం ముఖ్యం. అందుకే ఎన్నికల ముందు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో కలిశాం. ఆ నిర్ణయం తీసుకున్న వెంటనే ఎన్నికలు ఏకపక్షమవుతాయన్న అభిప్రాయం వచ్చింది. నాడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను బట్టి బీజేపీ అవసరం ఉంది.. ఆ పార్టీ ముందుకొస్తే ముగ్గురం కలిసి కూటమి పెట్టాం. అనునిత్యం పార్టీని కాపాడుకునే బాధ్యత కార్యకర్తలదే.. కార్యకర్తలను అన్ని విధాలుగా ఆదుకునే బాధ్యత నాదే’ అని హామీ ఇచ్చారు. సాధ్యం కాదన్న సూపర్‌ సిక్స్‌ పథకాలను అమలు చేసి చూపిస్తున్నామన్నారు. దేశంలో ఎక్కువ పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌ చిరునామాగా మారిందని చెప్పారు. పార్టీలో అవసరం, అవకాశాలను బట్టి ఎవరిని ఎక్కడ ఉపయోగించుకోవాలో తనకు తెలుసన్నారు. టీడీపీకి భవిష్యత్‌లో అపజయమన్నదే లేకుండా ముందుకు తీసుకువెళ్లాలని.. మరో 15 ఏళ్లు అధికారంలో ఉండేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు పనిచేస్తే 2047లో రాష్ట్రం ఎక్కడో ఉంటుందని.. ఈ ప్రక్రియలో భాగస్వాములై రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా అవకాశాలు అందిపుచ్చుకోవాలని శ్రేణులకు పిలుపిచ్చారు.

Updated Date - Jan 10 , 2026 | 06:13 AM