చురుగ్గా ఈశాన్య రుతుపవనాలు
ABN , Publish Date - Oct 19 , 2026 | 04:20 AM
దక్షిణ కోస్తాంధ్ర, తమిళనాడుకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర కర్ణాటకల్లో వేర్వేరుగా ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి.
నేడు, రేపు పలు జిల్లాలకు భారీ వర్షసూచన
విశాఖపట్నం, అమరావతి, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): దక్షిణ కోస్తాంధ్ర, తమిళనాడుకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర కర్ణాటకల్లో వేర్వేరుగా ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. దీంతో బంగాళాఖాతం నుంచి తేమగాలులు తమిళనాడు, కోస్తాంధ్ర, రాయలసీమ వైపుగా వీస్తున్నాయి. ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా మారి ఆదివారం రాయలసీమ, కోస్తాంధ్రలో ఎక్కువచోట్ల వర్షాలు కురిశాయి. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం ఎనిమిది గంటల వరకు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడా అతిభారీగా, కాకినాడ నుంచి ప్రకాశం జిల్లా వరకు, అన్నమయ్య, కడప జిల్లాల్లో భారీవర్షాలు కురవనున్నాయి. సోమవారం నుంచి మంగళవారం వరకు కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్నందున ఈనెల 22 వరకు కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు కురుస్తాయని ఇస్రో వాతావరణ నిపుణుడు పేర్కొన్నారు. కాగా, ఆదివారం ప్రకాశం జిల్లా కొరిసపాడులో 36, తిరుపతి జిల్లా వెంకటగిరిలో 30.3, నంద్యాల జిల్లా టంగుటూరులో 28.9, కడప జిల్లా చింతకొమ్మదిన్నెలో 26.7, నెల్లూరు జిల్లా దూబగుంటలో 22 మిల్లీమీటర్ల వాన పడినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.