ఉత్తరాంధ్ర యువతకు విముక్తి లభిస్తుందా?
ABN , Publish Date - Jun 17 , 2026 | 06:02 AM
అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కోసం యావత్తు ప్రపంచమే కాదు.. ఉత్తరాంధ్ర వాసులు కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. శుక్రవారం జెనీవాలో జరిగే ఈ ఒప్పందంతో తమ వాళ్లకు విముక్తి లభిస్తుందని ఉత్తరాంధ్ర వాసులు ఆశిస్తున్నారు.
హోర్ముజ్ నౌకల్లో చిక్కుకున్న మన నావికులు
శ్రీకాకుళం, విజయనగరంలోని కుటుంబాల ఎదురుచూపులు
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)
అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కోసం యావత్తు ప్రపంచమే కాదు.. ఉత్తరాంధ్ర వాసులు కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. శుక్రవారం జెనీవాలో జరిగే ఈ ఒప్పందంతో తమ వాళ్లకు విముక్తి లభిస్తుందని ఉత్తరాంధ్ర వాసులు ఆశిస్తున్నారు. యుద్ధం కారణంగా హోర్ముజ్ జలసంధి దిగ్బంధానికి గురికావడంతో ప్రపంచ నౌకాయానం సంక్షోభంలో పడింది. హోర్ముజ్ జలసంధి మీదుగా ప్రతిరోజూ రాకపోకలు సాగించే దాదాపు 130 నౌకల్లో భారతీయ నావికులు ఉంటారు. వీరిలో అనేకమంది ఈ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందినవారే. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి నౌకలపై జరిగిన దాడుల్లో ఇప్పటివరకు ఆంధ్రులతో సహా ఏడుగురు భారతీయ నావికులు చనిపోగా, గాయపడ్డ వారిలోనూ కొందరు ఆంధ్రులు ఉన్నారు. ఒక అంతర్జాతీయ నౌకలో పనిచేస్తున్న 20 ఏళ్ల పరపతి రమణది శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మం గ్రామం. ఇరాన్ తీరంలో ఇరుక్కుపోయిన నౌకలో రమణతోపాటు సంతబొమ్మాళి మండలానికి చెందిన వంకల రవి, ఆముదాలవలసలోని కొత్తకొండపేటకు చెందిన నాగుల దుర్గాప్రసాద్, విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలానికి చెందిన కొమర సోమరాజు ఉన్నారు. వీరంతా కొంతకాలంగా తినడానికి తిండీ, తాగడానికి నీళ్లు లేక నౌకలో నరకయాతన అనుభవిస్తున్నారు. వీరిని ఆదుకునేందుకు భారతీయ అధికారులు అక్కడికి వెళ్లాలన్నా.. అనేక అవరోధాలున్నాయి. బందర్ అబ్బాస్ ప్రాంతం అమెరికా దిగ్బంధంలో ఉండడంతో నౌక వైపు వెళ్లి.. సహాయం అందించడం అంత సులువు కాదు. పైగా అంతర్జాతీయ నౌకాయాన నిబంధనలు, బీమా నియమాలు అడ్డొస్తున్నట్టు సమాచారం. కాగా, హోర్ముజ్ జలసంధిలోని నౌకల్లో తెలుగు నావికులు ఉన్నా.. వివిధ కారణాలతో వారు తమ వివరాలను బహిర్గతం చేయడం లేదని అంటున్నారు. అయితే భారత్‌లోని ప్రతి అధికార వ్యవస్థను సంప్రదించి సహాయం కొరకు అర్థించినట్లు సిక్కోల్ సీమెన్ అనే సంస్థ నిర్వాహకుడు బడే శ్రీరామ్మూర్తి తెలిపారు.