పరిశ్రమల హబ్‌గా ఉత్తరాంధ్ర
ABN , Publish Date - Apr 23 , 2026 | 03:34 AM
ఉత్తరాంధ్ర పారిశ్రామిక అభివృద్ధిలో మరో కీలక అడుగు పడుతోంది. పరిశ్రమల ఏర్పాటుతో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలిస్తోంది.
అనకాపల్లిలో 5,400 కోట్లతో రెన్యూ ఎనర్జీ భారీ ప్లాంట్
6 గిగావాట్ల సోలార్ ఇన్‌గాట్ వేఫర్ ఉత్పత్తి యూనిట్
125 మెగావాట్ల హైబ్రిడ్ రెన్యూవబుల్ పవర్ ప్రాజెక్టు
ఈ యూనిట్లకు నేడు సీఎం చంద్రబాబు శంకుస్థాపన
2028 నాటికి ఉత్పత్తి ప్రారంభం.. 2,100 మందికి ఉపాధి
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
ఉత్తరాంధ్ర పారిశ్రామిక అభివృద్ధిలో మరో కీలక అడుగు పడుతోంది. పరిశ్రమల ఏర్పాటుతో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలిస్తోంది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం, రాంబిల్లి ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్)లోని జడ్.చింతువ పంచాయతీ పరిధిలో రూ. 5400 కోట్లతో రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ ఓ భారీ ప్లాంట్‌ను ప్రారంభిస్తోంది. దీనిలో భాగంగా ఆ కంపెనీ రూ. 4,200 కోట్ల పెట్టుబడితో 6 గిగావాట్స్ సామర్థ్యంతో తొలి ఇంటిగ్రేటెడ్ సోలార్ ఇన్‌గాట్-వేఫర్ గ్రీన్ ఎనర్జీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. మరో రూ. 1,200 కోట్లతో 125 మెగావాట్ల హైబ్రిడ్ క్యాప్టివ్ రెన్యూవబుల్ పవర్ ప్రాజెక్టును నిర్మిస్తోంది. వీటికి ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం శంకుస్థాపన, భూమి పూజ చేయనున్నారు. ఈ రెండు ప్రాజెక్టులు రెండేళ్లలో పూర్తి చేయనున్నారు. ఈ పరిశ్రమల ఏర్పాటు ద్వారా సుమారు 2,100 మందికి ఉపాధి లభిస్తుంది. ఉద్యోగాల్లో స్థానిక యువతకు ప్రాధాన్యం ఇస్తారు. ఈ ప్లాంట్‌ల ఏర్పాటుతో అనకాపల్లి జిల్లా రాష్ట్రంలో ముఖ్యమైన పరిశ్రమల హబ్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటోంది. ఇప్పటికే నక్కపల్లి మండలంలో రూ. 1.5 లక్షల కోట్ల వ్యయంతో ఆర్సెలార్ మిట్టల్, నిప్పన్ స్టీల్ భారీ ఫ్యాక్టరీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. దీంతో ప్రపంచ దృష్టిని జిల్లా ఆకర్షించింది. నక్కపల్లి మండలంలోనే బల్క్ డ్రగ్ పార్కు కూడా ఏర్పాటవుతోంది. తాజాగా అచ్యుతాపురం, రాంబిల్లి సెజ్‌లో పునరుత్పాదక ఇంధన రంగంలో దిగ్గజ సంస్థ ‘రెన్యూ’ గ్రూపు తొలుత రూ. 3,990 కోట్లతో ఇంటిగ్రేటెడ్ సోలార్ ఇన్‌గాట్-వేఫర్ సోలార్ గ్రీన్ ఎనర్జీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని భావించింది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో ఆ పెట్టుబడులు రూ. 5,400 కోట్లకు పెంచింది.
సౌర విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన ఫొటోవాల్టాయిక్ (సోలార్) పలకలు ఇక్కడ తయారు చేస్తారు. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుతోపాటు రెండు గిగావాట్ల హైడ్రో స్టోరేజీ ప్రాజెక్టు, 300 కేటీపీఏ (కిలో టన్నుల వార్షిక ఉత్పత్తి) సామర్థ్యంతో గ్రీన్ అమ్మోనియా ప్లాంటు, ఐదు గిగావాట్ల హైబ్రిడ్ రెన్యువబుల్ ప్రాజెక్టులు (విండ్, సోలార్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్), 125 మెగావాట్ల హైబ్రిడ్ క్యాప్టివ్ రెన్యువబుల్ పవర్ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటు కోసం 2025 డిసెంబరులో విశాఖపట్నంలో జరిగిన పెట్టుబడుల సదస్సులో ప్రభుత్వంతో ‘రెన్యూ ఎనర్జీ గ్లోబల్ పీఎల్‌సీ’ గ్రూపు యాజమాన్యం ఒప్పందం చేసుకుంది. రాంబిల్లి మండలంలో ఏపీఐఐసీ ఫేజ్-2లోని జడ్.చింతువ గ్రామ పరిధిలో గల గజిరెడ్డిపాలెంలో సుమారు 136 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుకు 95 మెగావాట్ల నిరంతర విద్యుత్ రోజుకు పది మిలియన్ లీటర్ల నీరు అవసరం. పరిశ్రమ నిర్మాణ సమయంలో, ఉత్పత్తి ప్రారంభించిన తరువాత ప్రభుత్వం వివిధ రూపాల్లో రూ. 1,247 కోట్ల వరకు రాయితీలు ఇస్తుంది. విద్యుత్ వ్యయంపై పూర్తి మినహాయింపు ప్రకటించింది. రహదారులు, నీరు, విద్యుత్తు వంటి మౌలిక సదుపాయాలను ప్రభుత్వమే కల్పిస్తుంది. 2028 డిసెంబరు నాటికి ఇక్కడ ఉత్పత్తి ప్రారంభం అవుతుందని అంచనా వేస్తున్నారు. సౌర విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన ఫొటోవాల్టాయిక్ పలకలను దేశీయంగా తయారు చేసే తొలి పరిశ్రమగా ఇది గుర్తింపు పొందనుంది.