Backward Classes Welfare Dept: బీసీ సంక్షేమశాఖ పరిధిలోకి నూర్‌బాషా కార్పొరేషన్
ABN , Publish Date - Jan 06 , 2026 | 06:15 AM
ఏపీ నూర్‌బాషా/దూదేకుల సంక్షేమ కార్పొరేషన్‌ను ఏపీ సొసైటీ రిజిస్ట్రేషన్ చట్టం నుంచి తొలగించి బీసీ సంక్షేమశాఖ పరిధిలోని కో-ఆపరేటివ్ సహకార చట్టం కిందకు తెచ్చారు.
అమరావతి, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): ఏపీ నూర్‌బాషా/దూదేకుల సంక్షేమ కార్పొరేషన్‌ను ఏపీ సొసైటీ రిజిస్ట్రేషన్ చట్టం నుంచి తొలగించి బీసీ సంక్షేమశాఖ పరిధిలోని కో-ఆపరేటివ్ సహకార చట్టం కిందకు తెచ్చారు. ఈ మేరకు బీసీ సంక్షేమశాఖ ఉత్తర్వులు జారీచేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ కార్పొరేషన్‌ను ఏపీ సొసైటీస్ రిజిస్ట్రేషన్ చట్టం-2001 కింద రిజిస్టర్ చేశారు. అనాదిగా ఆ కులానికి చెందిన వారు రాష్ట్రంలో దూది వడకటం, పత్తి సాగు, కాటన్ ఫ్యాబ్రిక్ తయారు, పరుపుల తయారు తదితర పనులు చేస్తున్నారని, అయితే టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత వారు ఉపాధి కోల్పోయారని బీసీ సంక్షేమశాఖ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. వారి అభివృద్ధికి వృత్తిపరంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలంటే నూర్‌బాషా/దూదేకుల సంక్షేమ కార్పొరేషన్‌ను బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్‌గా ఏర్పాటు చేయాలని సూచించింది.