నా పెళ్లికి అడ్డుపడితే చంపేస్తా!
ABN , Publish Date - Aug 26 , 2026 | 05:22 AM
నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు సాదిక్‌ఖాన్ బాధిత కుటుంబాన్ని ఏ స్థాయిలో వేధింపులకు గురిచేశాడో, వారిని ఆత్మహత్యకు పురిగొల్పేలా ఏ విధమైన బెదిరింపులకు పాల్పడ్డాడో పోలీసుల విచారణలో బయటపడినట్లు తెలిసింది.
నూకరాజు కుటుంబానికి సాదిక్ తీవ్ర బెదిరింపు
(కాకినాడ-ఆంధ్రజ్యోతి)
నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు సాదిక్‌ఖాన్ బాధిత కుటుంబాన్ని ఏ స్థాయిలో వేధింపులకు గురిచేశాడో, వారిని ఆత్మహత్యకు పురిగొల్పేలా ఏ విధమైన బెదిరింపులకు పాల్పడ్డాడో పోలీసుల విచారణలో బయటపడినట్లు తెలిసింది. ఆ సమాచారం ప్రకారం.. సాదిక్ వేరొక యువతిని రహస్యంగా వివాహం చేసుకొనేందుకు ప్లాన్ వేశాడు. దీన్ని 14న తెలుసుకున్న సౌజన్య.. సాదిక్‌ను నిలదీసింది. దీంతో సౌజన్యను తీవ్రస్థాయిలో బెదిరించాడు. తన పెళ్లికి అడ్డుతగిలితే ‘నీ కుటుంబాన్ని అంతా చంపేస్తా’ అని హెచ్చరించాడు. ఒక దశలో సౌజన్యపై సాదిక్ చేయి చేసుకున్నాడు. ‘నా జీవితానికి అడ్డు తగిలితే.. ఊరుకోను. నీ ప్రైవేటు ఫొటోలు, వీడియోలు అన్నీ బయటపెడతా..’ అని బెదిరించాడు. సౌజన్య భర్త జగదీశ్వరరెడ్డి ఎలా చనిపోయాడో.. మీకు కూడా అదే గతి పట్టిస్తానంటూ బెదిరించాడు. పరువు పోతుందనే ఉద్దేశంతో నూకరాజు కుటుంబం ఆత్మహత్య నిర్ణయం తీసుకున్నారు. అయితే నూకరాజు కుటుంబం సామూహిక ఆత్మహత్యకు పాల్పడుతుందని తెలియదని, విషయం తెలిసిన తర్వాత తాను పారిపోయానని నిందితుడు చెప్పినట్లు తెలిసింది. మరోవైపు జగదీశ్వరరెడ్డిని చంపేందుకు సాదిక్ బంగారంలో వినియోగించే సైనైడ్‌ను హైదరాబాద్‌లో సేకరించాడని, దాన్ని ప్రొటీన్ పౌడర్‌లో కలిపి హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో జగదీశ్వరరెడ్డికి ఇచ్చేలా చేశాడని విచారణలో గుర్తించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో సైనైడ్ విక్రయించిన వారెవరనే వివరాలను రాబట్టిన పోలీసులు.. అతడ్ని పట్టుకునేందుకు చర్యలు ప్రారంభించారు. ఇందుకోసం ఓ పోలీసు బృందం హైదరాబాద్ వెళ్లింది.
సాదిక్‌ను పోలీస్ కస్టడీకి ఇవ్వండి!
నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో ఇంకా కీలక విషయాలు వెలుగులోకి రావాల్సి ఉంది. లోతైన విచారణ చేసేందుకు నిందితుడు సాదిక్‌ను ఏడు రోజుల కస్టడీకి అప్పగించాలని కోరుతూ కాకినాడ సర్పవరం పోలీసులు మంగళవారం కోర్టులో పిటిషన్ వేశారు. మరోవైపు సాదిక్‌కు బెయిల్ ఇప్పించేందుకు ఓ న్యాయవాది ఇప్పటికే పిటిషన్ వేసినట్టుగా తెలిసింది.