ఇది ముమ్మాటికీ చట్టవిరుద్ధం!
ABN , Publish Date - Feb 28 , 2026 | 05:29 AM
సీఐడీ సునీల్ నాయక్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్లు ప్రకటించిన కోర్టు.. ఆ ఆర్డర్ ఇవ్వకుండానే దానిపై ఎదురుపక్షం వేసిన రీకాల్ పిటిషన్‌కు నంబర్ ఎలా ఇస్తుందని ప్రాసిక్యూషన్స్ జాయింట్ డైరెక్టర్ వీరగంధం ....
వారెంట్ ఆర్డర్ మాకు ఇవ్వకుండా..రీకాల్ పిటిషన్‌కు నంబర్ ఎలా ఇస్తారు..?
సునీల్ నాయక్ వారెంట్ విషయంలోకోర్టుకు ప్రాసిక్యూషన్స్ డైరెక్టర్ ప్రశ్న
గుంటూరు మొబైల్ కోర్టులో గంటకు పైగా వాడీవేడి వాదనలు
నేడు ఉత్తర్వులు ఇస్తానన్న న్యాయాధికారి
గుంటూరు, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): సీఐడీ సునీల్ నాయక్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్లు ప్రకటించిన కోర్టు.. ఆ ఆర్డర్ ఇవ్వకుండానే దానిపై ఎదురుపక్షం వేసిన రీకాల్ పిటిషన్‌కు నంబర్ ఎలా ఇస్తుందని ప్రాసిక్యూషన్స్ జాయింట్ డైరెక్టర్ వీరగంధం రాజేంద్రప్రసాద్ ప్రశ్నించారు. ఇది ముమ్మాటికీ చట్టవిరుద్ధమని.. తన 30 ఏళ్ల సర్వీసులో ఇలా జరగడం ఎప్పుడూ చూడలేదన్నారు. కనీసం తనకు నోటీసు కూడా ఇవ్వలేదని.. ఈ వ్యవహారంలో న్యాయపరంగా ఎంత దూరమైనా వెళ్తానని స్పష్టం చేశారు. డిప్యూటీ స్పీకర్, అప్పటి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును సీఐడీ కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో.. ఏ-7, నాటి సీఐడీ డీఐజీ సునీల్ నాయక్‌పై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీచేస్తున్నట్లు గుంటూరు మొబైల్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయాధికారి స్రవంతి గురువారం ప్రకటించారు. దీనిపై శుక్రవారం అధికారిక ఉత్తర్వులిస్తానన్నారు. వారెంట్ ఉత్తర్వులు జారీచేస్తే వాటిని అమలు చేసి బిహార్ నుంచి నాయక్‌ను తీసుకొచ్చేందుకు విజయనగరం ఎస్పీ దామోదర్ నేతృత్వంలోని పోలీసు అధికారుల బృందం ఇప్పటికే పట్నాలో మకాం వేసి ఉంది. అయితే పట్నా సెషన్స్ కోర్టు నాయక్‌కు మార్చి 2 వరకు అరెస్టు నుంచి రక్షణ ఇచ్చిన నేపథ్యంలో మొబైల్ కోర్టు జారీచేసిన నాన్‌బెయిలబుల్ వారెంట్ చెల్లదని, దానిని రద్దు చేయాలంటూ ఆయన తరఫు న్యాయవాదులు గురువారమే రీకాల్ పిటిషన్ వేశారు. దానికి కోర్టు సిబ్బంది నంబర్ (104/202) కూడా ఇచ్చారు. శుక్రవారం వారెంట్ ఉత్తర్వులు తీసుకునేందుకు రాజేంద్రప్రసాద్ కోర్టుకు వచ్చారు. ఈ సందర్భంగా నాయక్ తరఫు న్యాయవాదులు దాఖలుచేసిన రీకాల్ పిటిషన్‌పై వాదనలు వింటామని మేజిస్ట్రేట్ స్రవంతి ప్రకటించడంతో ఆయన అభ్యంతరం తెలిపారు. నాన్‌బెయిలబుల్ వారెంట్ ఆర్డర్ కాపీ తమ చేతికి ఇవ్వకుండా.. దానిపై రీకాల్ పిటిషన్‌ను అనుమతించడం చట్ట విరుద్ధమన్నారు. గుంటూరులోని రెండో ఏడీజే కోర్టులో నాయక్ ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్మిస్ అయిందని, దానిపై ఆయన ఏపీ హైకోర్టుకు.. లేదంటే సుప్రీంకోర్టుకు మాత్రమే వెళ్లాలని.. అలాంటిది పట్నా సెషన్స్ కోర్టు బెయిల్ ఎలా మంజూరు చేస్తుందని ప్రశ్నించారు. నాయక్‌పై మార్చి 2 వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఆ కోర్టు ఇచ్చిన తీర్పునకు చట్టబద్ధత లేదని.. దానిని పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం లేదని తెలిపారు. వారెంట్ ఉత్తర్వులు ఇవ్వడం తప్ప మరో మార్గం లేదని, చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే తాను న్యాయపరంగా ఎంత దూరమైనా వెళ్తానని తెలిపారు. శనివారం నాయక్ తరఫు న్యాయవాదుల వాదనలు విని తగు ఉత్తర్వులు జారీ చేస్తానని న్యాయాధికారి వెల్లడించారు.