Share News

AP Govt: సొంత నిర్ణయాలొద్దు!

ABN , Publish Date - Jan 09 , 2026 | 05:54 AM

విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామి ఆలయానికి విద్యుత్‌ సరఫరా నిలిపివేతపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. విద్యుత్‌, దేవదాయ శాఖల అధికారులతోపాటు ఆలయ కార్యనిర్వహణాధికారి...

AP Govt: సొంత నిర్ణయాలొద్దు!

  • దుర్గగుడి ఈవో, విద్యుత్‌ అధికారులపై సర్కారు సీరియస్‌

  • ఆలయానికి విద్యుత్‌ బంద్‌పై క్యాబినెట్‌లో కీలక చర్చ

  • రెండు శాఖల అధికారులనూ సచివాలయానికి పిలిపించిన మంత్రులు ఆనం, గొట్టిపాటి

అమరావతి, జనవరి 8(ఆంధ్రజ్యోతి): విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామి ఆలయానికి విద్యుత్‌ సరఫరా నిలిపివేతపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. విద్యుత్‌, దేవదాయ శాఖల అధికారులతోపాటు ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) శీనానాయక్‌ను గురువారం సచివాలయానికి పిలిపించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. విద్యుత్‌ బకాయిల చెల్లింపులో ఎందుకు జాప్యం జరిగిందని, ఈవో అసలు ఏం చేస్తున్నారని ఆరాతీసింది. ఇదే సమయంలో ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులకు మాటమాత్రం చెప్పకుండా ఆలయానికి విద్యుత్‌ సరఫరా నిలిపివేయడంపై ఆ శాఖ అధికారులపైనా మండిపడినట్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పిచ్చిపనులతో ప్రభుత్వానికి అప్రతిష్ఠ తెస్తారా అని అధికారులను మందలించినట్లు తెలిసింది. గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ అంశం చర్చకొచ్చింది. జనసేనకు చెందిన మంత్రులు దీనిని ప్రస్తావించార ని తెలిసింది. దీనికి కారణమైన తమ అధికారులపై చర్యలు తీసుకున్నామని ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ మంత్రివర్గంలో చెప్పినట్లు తెలిసింది. సమావేశం జరుగుతుండగానే విద్యుత్‌ శాఖ అధికారులు, దేవదాయ శాఖ కార్యదర్శి, కమిషనర్‌, దుర్గగుడి ఈవోను, ఇతర అధికారులను సచివాలయానికి పిలిపించారు. దేవదాయ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, విద్యుత్‌ మంత్రి గొట్టిపాటి వారితో మాట్లాడారు. విద్యుత్‌ సరఫరా నిలివేతకు దారితీసిన పరిస్థితులు, ఆ తర్వాతి పరిణామాలను అడిగి తెలుసుకున్నారు. రూ.3 కోట్ల మేర బకాయులు పేరుకుపోయేవరకు ఎందుకు కరెంటు బిల్లులు చెల్లించలేదని ఈవోను ప్రశ్నించారు. ‘ బిల్లులు చెల్లించాలని విద్యుత్‌ శాఖ నుంచి వచ్చిన నోటీసులకు ఎందుకు స్పందించలేదు? బిల్లులు ఎందుకు చెల్లించలేదు’ అని నిలదీసినట్లు తెలిసింది. 2023 ఫిబ్రవరి నుంచి రూ.3.08 కోట్లమేర విద్యుత్‌ బకాయిలు ఉన్నాయని.. అంత పేరుకుపోయేవరకు ఎందుకు చెల్లించలేదని అడిగారు.


దీనిపై ఉన్నత స్థాయిలో సమీక్ష చేశారా? ఈ విషయాన్ని ఎందుకు గుర్తించలేదని దేవదాయ కమిషనర్‌ను కూడా ప్రశ్నించినట్లు తెలిసింది. అసలు ఇంత ప్రముఖ ఆలయానికి విద్యుత్‌ సరఫరా నిలిపివేయాలన్న నిర్ణయం ఓ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ ఎలా తీసుకుంటారు.. ఈ విషయాన్ని ఎస్‌ఈకి, చీఫ్‌ ఇంజనీర్‌కు ఎందుకు తెలియజేయలేదని విద్యుత్‌ అధికారులను మంత్రులు ప్రశ్నించారు. ప్రభుత్వ స్థాయిలో అనుమతి తీసుకుని చేయాల్సిన పనిని, ఈఈ స్థాయిలో ఎలా నిర్ణయిస్తారని.. ఇది తీవ్రమైన క్రమశిక్షణరాహిత్యమని గొట్టిపాటి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సమన్వయం లేకపోవడం, కీలకమైన అంశాలను పెద్దల దృష్టికి తీసుకురాకపోవడం, నోటీసులకు స్పందించకుండా నాన్చడం వంటి చర్యలు అధికారుల క్రమశిక్షణరాహిత్యానికి నిదర్శనమని, ఈ వైఫల్యాలపై ఎందుకు చర్యలు తీసుకోకూడదని మంత్రులు మండిపడినట్లు తెలిసింది. ఆలయాలకు విద్యుత్‌ సరఫరా నిలిపివేతపై క్షేత్ర స్థాయి అధికారులు సొంత నిర్ణయాలు తీసుకోవద్దని, బకాయిలు, ఇతర సమస్యలుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేసినట్లు తెలిసింది.

Updated Date - Jan 09 , 2026 | 05:54 AM