Share News

Supreme Court:సేల్‌ అగ్రిమెంట్‌కు స్టాంప్‌ డ్యూటీ అక్కర్లేదు

ABN , Publish Date - Jan 17 , 2026 | 03:50 AM

ఏళ్ల తరబడి అద్దెకు ఉంటున్న ఇంటిని కొనుగోలు చేయడానికి యజమానితో ఒప్పందం చేసుకుంటే ఆ ఒప్పందాన్ని సేల్‌డీడ్‌గా పరిగణించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Supreme Court:సేల్‌ అగ్రిమెంట్‌కు స్టాంప్‌ డ్యూటీ అక్కర్లేదు

  • ఏపీ స్టాంప్‌, రిజిస్ట్రేషన్‌ చట్టంపై సుప్రీం తీర్పు

  • 50 ఏళ్లుగా అద్దెకు ఉంటున్న వ్యక్తికి భారీ ఊరట

న్యూఢిల్లీ, జనవరి 16(ఆంధ్రజ్యోతి): ఏళ్ల తరబడి అద్దెకు ఉంటున్న ఇంటిని కొనుగోలు చేయడానికి యజమానితో ఒప్పందం చేసుకుంటే ఆ ఒప్పందాన్ని సేల్‌డీడ్‌గా పరిగణించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆస్తి కొనుగోలుకు సంబంధించి ‘అగ్రిమెంట్‌ టు సేల్‌’(విక్రయ ఒప్పందం) కుదుర్చుకున్నప్పటికీ ఆస్తి స్వాధీనం కాకపోతే దానిపై పూర్తిస్థాయి స్టాంప్‌ డ్యూటీ చెల్లించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఆంధ్రప్రదేశ్‌ స్టాంప్‌, రిజిస్ట్రేషన్‌ చట్టం ప్రకారం.. కేవలం ఒప్పందం జరిగినంత మాత్రాన అది ‘కన్వేయన్స్‌’ (ఆస్తి బదిలీ/రిజిస్ట్రేషన్‌) కిందకు రాదని, దానికి స్టాంప్‌ డ్యూటీ, పెనాల్టీలు కట్టాల్సిన పనిలేదని స్పష్టం చేసింది. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వయ్యేటి శ్రీనివాసరావు వర్సెస్‌ గైనిడి జగజ్యోతి కేసులో జస్టిస్‌ బి.వి. నాగరత్న, జస్టిస్‌ ఆర్‌. మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం గురువారం కీలక తీర్పునిచ్చింది. జగజ్యోతి ఇంట్లో శ్రీనివాసరావు గత 50 ఏళ్లుగా అద్దెకుంటున్నారు. 2009లో తను అద్దెకుంటున్న ఇంటిని రూ.9 లక్షలకు కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. రిజిస్ట్రేషన్‌ విషయంలో వివాదం తలెత్తడంతో శ్రీనివాసరావు కోర్టును ఆశ్రయించారు. అయితే, విచారణ సమయంలో ఒప్పందాన్ని సేల్‌ డీడ్‌గా భావించి దానికి తగ్గట్టుగా స్టాంప్‌ డ్యూటీ, పెనాల్టీ కట్టాలని ట్రయల్‌ కోర్టు, ఏపీ హైకోర్టు ఆదేశించాయి. దీంతో శ్రీనివాసరావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఆ ఉత్తర్వులను కొట్టివేస్తూ బాధితుడికి ఊరటనిచ్చింది.

Updated Date - Jan 17 , 2026 | 03:50 AM