లడ్డూల తయారీకి నెయ్యి కొరత లేదు
ABN , Publish Date - Mar 10 , 2026 | 04:59 AM
శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి అవసరమైన ఆవు నెయ్యి నిల్వలు టీటీడీ వద్ద సమృద్ధిగా ఉన్నాయని టీటీడీ స్పష్టం చేసింది.
అసత్య ప్రచారాలను నమ్మొద్దు: టీటీడీ
తిరుమల, మార్చి 9(ఆంధ్రజ్యోతి): శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి అవసరమైన ఆవు నెయ్యి నిల్వలు టీటీడీ వద్ద సమృద్ధిగా ఉన్నాయని టీటీడీ స్పష్టం చేసింది. ఇటీవల కొందరు వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో టీటీడీ వద్ద నెయ్యి నిల్వలు లేవని, లడ్డూ ప్రసాదాల తయారీలో అంతరాయం ఏర్పడుతోందని అసత్య ప్రచారం చేయడం సరికాదని సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ‘ఆవు నెయ్యి సరఫరా మూడంచెల కొనుగోలు విధానం ద్వారా జరుగుతోంది. ఒకే సంస్థపై ఆధారపడకుండా మూడు సంస్థల ద్వారా నెయ్యి సరఫరా జరుగుతున్న క్రమంలో అనుకోని ఇబ్బందులు తలెత్తినా సరఫరాలో అంతరాయం లేకుండా టీటీడీ ముందుజాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందాపూర్ డెయిరీ నుంచి తిరుమలకు వస్తున్న నెయ్యి ట్యాంకర్ ఇటీవల కడప జిల్లా కొండాపురం సమీపంలో ప్రమాదానికి గురైన విషయం నిజమే. అయితే ప్రమాదానికి గురైనంత మాత్రాన నెయ్యి సరఫరాకు ఎలాంటి అంతరాయం లేదు. మిగిలిన రెండు సంస్థల నుంచి నెయ్యి సరఫరా జరుగుతోంది. ప్రస్తుతం భక్తులకు అందించేందుకు 7 లక్షల లడ్డూలు సిద్ధంగా ఉన్నాయి. వాస్తవాలు ఇలా ఉంటే టీటీడీ వద్ద నెయ్యి నిల్వలు లేవని, శ్రీవారి కైంకర్యాలకు, లడ్డూప్రసాదాల తయారీకి ఆటంకం కలుగుతోందని అసత్య ప్రచారం చేయడం బాధాకరం. భక్తులు వాటిని నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం’ అని టీటీడీ ఆ ప్రకటనలో వివరించింది.