Share News

CM Chandrababu Naidu: రాజకీయాలొద్దు

ABN , Publish Date - Jan 08 , 2026 | 03:42 AM

నీటి విషయంలో రాజకీయాలు చేయొద్దంటూ తెలంగాణను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ప్రజా ప్రయోజనాల కోసం రాజకీయం చేయాలి.

CM Chandrababu Naidu: రాజకీయాలొద్దు

  • నదీ జలాలపై ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి

  • భావోద్వేగాలతో ఆటలు సరికాదు

  • తెలంగాణకు సీఎం చంద్రబాబు హితవు

  • గోదావరిలో పుష్కలంగా జలాలు.. దేవాదులను విస్తరిస్తే కాదంటామా?

  • గతంలో కాళేశ్వరాన్ని అడ్డుకున్నామా?.. కానీ, ‘పోలవరం’పై రాజకీయమా?

పోలవరం, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): నీటి విషయంలో రాజకీయాలు చేయొద్దంటూ తెలంగాణను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ‘‘ప్రజా ప్రయోజనాల కోసం రాజకీయం చేయాలి. అంతేగానీ, రాజకీయాలకోసం రాజకీయం కాదు. రాజకీయ నేతలు పోటీలు పడి మాట్లాడవద్దు.’’ అని ఆయన హితవు పలికారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో ప్రధాన డ్యామ్‌ పనుల పురోగతిని బుధవారం జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడితో కలిసి చంద్రబాబు పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సముద్రంలో కలిసే జలాలను ఎవరైనా వాడుకోవచ్చునని, దానిపై తెలంగాణకు అభ్యంతరం ఎందుకని ప్రశ్నించారు. ‘‘తెలుగు జాతి ఒక్కటే. ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి. భావోద్వేగాలతో ఆటలు సరికాదు.’’ అని సూచించారు. గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తుంటే తామెప్పుడూ అడ్డు చెప్పలేదని గుర్తు చేశారు. కానీ, పోలవరం - నల్లమల సాగర్‌పై తెలంగాణ నేతలు అనవసరంగా రాజకీయాలు చేస్తున్నారని తెలిపారు. గోదావరి నదిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయని, వాటిని వాడుకుని దేవాదుల ప్రాజెక్టును తెలంగాణ విస్తరించుకుంటే ఎవరు కాదంటారని వ్యాఖ్యానించారు. కానీ, పోలవరం జలాలను ఏపీ వినియోగించుకుంటే అభ్యంతరం చెప్పడం తెలంగాణకు తగునా అని ప్రశ్నించారు ‘‘కృష్ణా డెల్టాను ఆధునీకరించి 20 టీఎంసీలను పొదుపు చేసి, ఆ నీళ్లను భీమాకు (తెలంగాణ) కేటాయించాం. హైదరాబాద్‌ నగరానికి నాగర్జునసాగర్‌ జలాలను తీసుకువచ్చాం. .తెలుగుజాతి కోసం హైదరాబాద్‌ను అభివృధి చేశాం.’’ అని గుర్తు చేశారు. పోలవరం నీళ్లు వినియోగించుకుని కృష్ణాజలాలను పొదుపు చేసుకుని, రాయలసీమకు మళ్లిస్తున్నాం. అన్నీ కలసి వస్తే అవసరమైతే తెలంగాణకూ నీళ్లివ్వవచ్చు’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Updated Date - Jan 08 , 2026 | 03:54 AM