Share News

CM Chandrababu Naidu: ఇక ఎవడూ కబ్జా చేయలేడు!

ABN , Publish Date - Jan 10 , 2026 | 04:24 AM

ఇక మీ భూమిని ఎవడూ కబ్జా చేయలేడు. మీ భూమి-మీ హక్కు. అత్యాధునికమైన బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీతో పాస్‌పుస్తకాలు రూపొందిస్తున్నాం.

CM Chandrababu Naidu: ఇక ఎవడూ కబ్జా చేయలేడు!

  • మీ భూమి-మీ హక్కు.. బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీతో పాస్‌ పుస్తకాలు

  • ఏడాదిలోగా ప్రతి నెలా 2-9 మధ్య పంపిణీ కార్యక్రమం

  • కూటమి రాకుండా ఉంటే.. మీ భూములు గోవిందా అయ్యేవి

  • ఆ నరకాసురుడిని మళ్లీ రానివ్వొద్దు

  • సంక్రాంతికి కోడిపందేలు చూద్దాం

  • కానీ జూదాలు వద్దు: చంద్రబాబు

  • తూర్పుగోదావరి రాయవరంలో రైతులకు పాస్‌పుస్తకాలు అందజేత

రాజమహేంద్రవరం, జనవరి 9(ఆంధ్రజ్యోతి): ‘ఇక మీ భూమిని ఎవడూ కబ్జా చేయలేడు. మీ భూమి-మీ హక్కు. అత్యాధునికమైన బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీతో పాస్‌పుస్తకాలు రూపొందిస్తున్నాం. ఒక తప్పు కూడా లేకుండా మీకు అందిస్తాం’ అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం పరిధిలోని రాయవరంలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన ‘మీ భూమి-మీహక్కు’ ప్రజావేదిక సభలో సీఎం ప్రసంగించారు. ‘తెలుగుదేశం కూటమి అధికారంలోకి రాకుంటే మీ భూములు గోవిందా.. గోవిందా అయ్యేవి.. అవునా? కాదా?.. అవునంటే చేతులు పైకెత్తండి..’ అని ఆయన అనగానే సభలో అందరూ చేతులు పైకెత్తారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. ‘ఇదీ ఆనాటి పరిస్థితి. ఇవాళ చరిత్రాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. రాజముద్రతో పట్టాదారు పాస్‌ పుస్తకాలు ఇస్తున్నాం. ఇది పవిత్ర కార్యక్రమం. మనందరికీ భూమి అనేది ఒక అటాచ్‌మెంట్‌. మన తల్లిదండ్రులు, పూర్వీకుల నుంచి వారసత్వంగా వస్తోంది. ప్రాణంపోయినా ఒప్పుకుంటాడేమో కానీ రైతు భూమిని వదులుకోవడానికి ఇష్టపడడు. కరోనా సమయంలో అందరికీ హాలిడే.. రైతుకు మాత్రం లేదు. ఆ సమయంలో కూడా వ్యవసాయం చేసి అందరికీ అన్నంపెట్టిన రైతును మరచిపోకూడదు. అలాంటి భూమిని గత వైసీపీ ప్రభుత్వం, అప్పటి సీఎం జగన్‌.. సమస్యగా మార్చేశారు. అతలాకుతలం చేశారు’ అని మండిపడ్డారు. ఇంకా ఏం చెప్పారంటే..


మీ భూములపై పెత్తనం చేయాలని..

సున్నితమైన సమస్యతో తలగోక్కుంటే మసైపోతారని నాటి సీఎంకు చెప్పాను. కానీ లెక్కపెట్టలేదు. అహంకారం కళ్లపైకెక్కింది. నీ తల్లో, తండ్రో, తాతముత్తాతలో ఇచ్చిన ఆస్తికి ఆయన ఫొటో వేసుకున్నాడు. మీ భూమి సరిహద్దుల్లో సర్వే రాళ్లు పెట్టి, వాటిపై తన బొమ్మ పెట్టుకున్నాడు. మరోపక్క మీభూమిని కంప్యూటరీకరించి ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ తెచ్చాడు. ఆ చట్టానికి అధిపతులుగా ప్రైవేటు వాళ్లను.. తన మనుషులను పెట్టుకున్నాడు. మీ భూమి-మీహక్కు. వేరేవాళ్ల ఫొటో ఉండడానికి వీల్లేదని.. రాజముద్రతో మళ్లీ మీకు పట్టాదారు పాసుపుస్తకాలు ఇస్తానని నేనా రోజు హామీ ఇచ్చాను. ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ రద్దు చేస్తానని చెప్పాను. రెండో సంతకం దానిపైనే పెట్టాను. వైసీపీ ప్రభుత్వం 22ఏ తీసుకొచ్చి.. మీ భూమిని ఏ రౌడీషీటర్‌ అడిగినా, రాజకీయ నాయకుడు అడిగినా ఇవ్వకపోతే దాన్ని నిషేధ జాబితాలోకి మార్చేసింది. ఇవాళ 6,680 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేశాం. 4,784 గ్రామాల్లో పాసు పుస్తకాలు ముద్రించాం. 22.33 లక్షల పుస్తకాలు సిద్ధంగా ఉన్నాయి. రాష్ట్రం మొత్తమ్మీద లక్షా 18 వేల పాసు పుస్తకాల్లో లోపాలున్నాయి. అవన్నీ సరిచేస్తున్నాం. సంవత్సరం కాలపరిమితి పెట్టుకున్నాను.. ప్రతినెలా 1న పింఛన్లు ఇవ్వాలి. 2 నుంచి 9 వరకూ పాసుపుస్తకాల పంపిణీ. ఒక తప్పు కూడా లేకుండా ఇవ్వాలి.


ఐదేళ్లకోసారి మార్చేద్దామనే ఆలోచన వద్దు

ఐదేళ్లకోసారి ప్రభుత్వాన్ని మార్చేద్దామని ఆలోచన మంచిదికాదు. సుస్థిర పాలనతోనే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. ఇక విద్యుత్‌ చార్జీలు పెరగవు. గత ప్రభుత్వ చార్జీలు పెంచేసి అనేక రకాలుగా ప్రజలను ఇబ్బంది పెట్టింది. వృథాగా పోయే నీటి కోసం తెలుగు రాష్ర్టాల మధ్య గొడవలు వద్దు.

ప్రభల తీర్థాలకు రాష్ట్ర గుర్తింపు

గోదావరి జిల్లాల్లో.. ముఖ్యంగా కోనసీమలో సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసే ప్రభల తీర్థాలకు రాష్ట్ర పండుగ గుర్తింపు ఇచ్చాం. జగన్నతోట ప్రభల శివుని రూపం. 470 ఏళ్లనాటి వారసత్వ ఆధ్యాత్మిక సాంస్కృతిక ఉద్యమానికి రక్షణ ఇవ్వనున్నాం. సంక్రాంతికి గోదావరి జిల్లాలో కోడిపందేలు గుర్తుకు వస్తాయి. జూదాలు వద్దు.. కానీ వారసత్వాన్ని పరిరక్షించుకోవడానికి కోడిపందాలు చూద్దాం. ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి. చరిత్రలో ఒక నరకాసురుడిని వధిస్తే ఏటా దీపావళి చేసుకుంటున్నాం. ఇవాళ మళ్లీ నరకాసురుడి పాలన రాకూడదు. ‘నా అదృష్టం. గోదావరి పుష్కరాలు మూడోసారి నిర్వహించే అవకాశం వచ్చింది. 2027 మార్చిలోపు పోలవరం పూర్తి చేసి ప్రజలకు అంకితం ఇస్తాం. సొంత బాబాయిని హత్య చేసి నామీదకు తోసినవాడి వ్యవహారం ఎలా ఉంటుందో తెలుసుకుని వైసీపీపట్ల అప్రమత్తంగా ఉన్నాను. డేగకన్ను వేశాను. వాళ్ల పాపాలు కడిగేస్తాం.

12న నారావారిపల్లికి సీఎం

సీఎం చంద్రబాబు సోమవారం తిరుపతి జిల్లాకు రానున్నారు. సూళ్లూరుపేటలో సోమవారం రాష్ట్రస్థాయి ఫ్లెమింగో ఫెస్టివల్‌ ముగింపు వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరవుతారు. అనంతరం రోడ్డు మార్గాన స్వగ్రామమైన చంద్రగిరి మండలం నారావారిపల్లి చేరుకుంటారు. 13, 14, 15 తేదీల్లో సంక్రాంతికి ఎప్పటిలాగే కుటుంబసభ్యులతో గడుపుతారు. 14న స్వర్ణ నారావారిపల్లి ప్రాజెక్టులో భాగంగా అమలవుతున్న పలు కార్యక్రమాలను సమీక్షిస్తారు. 15న తిరుపతి అర్బన్‌ మండలం శెట్టిపల్లి ల్యాండ్‌ పూలింగ్‌ స్కీమ్‌ కింద లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేస్తారు. అదే రోజు ఉండవల్లికి తిరుగు ప్రయాణమవుతారు.

Updated Date - Jan 10 , 2026 | 04:25 AM