ఇక పారిశ్రామిక వెలుగులు!
ABN , Publish Date - Feb 11 , 2026 | 01:20 AM
పార్టనర్‌షిప్ సమ్మిట్‌లో భాగంగా కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం ఉమ్మడి కృష్ణాజిల్లాలో భారీ ప్రాజెక్టులు కార్యరూపం దాల్చనున్నాయి. కృష్ణాజిల్లాలో షిప్ బిల్డింగ్ - షిప్ రిపేర్ భారీ పరిశ్రమలు ఏర్పాటు కానుండగా.. సోలార్ పార్క్, కమర్షియల్ కాంప్లెక్స్‌లు వంటివి వీటికి తోడవుతున్నాయి. స్థానికంగా ఉపాధి కల్పనతో పాటు బందరు అభివృద్ధి ముఖచిత్రంపై చెరగని ముద్రను వేయనున్నాయి. విజయవాడలో సీ ప్లేన్ ఆపరేషన్స్‌కు వీలుగా వాటర్ ఏరోడ్రమ్, కబేళా ఆధునీకరణ, ట్రక్ టెర్మినల్‌లో రోరో ప్రాజెక్టు, కేఎల్ రావు పార్కులో వాటర్ థీమ్ పార్కుల అభివృద్ధితో నగరం రూపురేఖలు మారనున్నాయి.
- ఉమ్మడి కృష్ణాకు భారీగా పెట్టుబడుల రాక
- మచిలీపట్నానికి షిప్ బిల్డింగ్ - షిప్ రిపేర్ ప్రాజెక్టులు
- రూ.9,100 కోట్ల వ్యయంతో ఏర్పాటుకు చర్యలు
- ముందుకొచ్చిన పెట్రో గ్రూప్, గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ సంస్థలు
- ఈ నెలాఖరుకు పూర్తికానున్న ప్రక్రియ
- బందరులో సోలార్ పార్క్, క మర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం!
- బెజవాడలో కబేళా ఆధునీకరణ, వాటర్ థీమ్ పార్క్, వాటర్ ఏరోడ్రోమ్ ఏర్పాటు
- ఇబ్రహీంపట్నంలో ట్రక్ టెర్మినల్ ఇన్ర్ఫా ‘రోరో’ అభివృద్ధికి డీపీఆర్‌ల రూపకల్పన
పార్టనర్‌షిప్ సమ్మిట్‌లో భాగంగా కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం ఉమ్మడి కృష్ణాజిల్లాలో భారీ ప్రాజెక్టులు కార్యరూపం దాల్చనున్నాయి. కృష్ణాజిల్లాలో షిప్ బిల్డింగ్ - షిప్ రిపేర్ భారీ పరిశ్రమలు ఏర్పాటు కానుండగా.. సోలార్ పార్క్, కమర్షియల్ కాంప్లెక్స్‌లు వంటివి వీటికి తోడవుతున్నాయి. స్థానికంగా ఉపాధి కల్పనతో పాటు బందరు అభివృద్ధి ముఖచిత్రంపై చెరగని ముద్రను వేయనున్నాయి. విజయవాడలో సీ ప్లేన్ ఆపరేషన్స్‌కు వీలుగా వాటర్ ఏరోడ్రమ్, కబేళా ఆధునీకరణ, ట్రక్ టెర్మినల్‌లో రోరో ప్రాజెక్టు, కేఎల్ రావు పార్కులో వాటర్ థీమ్ పార్కుల అభివృద్ధితో నగరం రూపురేఖలు మారనున్నాయి.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
ఉమ్మడి కృష్ణాజిల్లా అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో ప్రధానంగా విజయవాడలో సీ ప్లేన్ ఆపరేషన్స్‌కు వీలుగా వాటర్ ఏరోడ్రమ్, కబేళా ఆధునీకరణ, ట్రక్ టెర్మినల్‌లో రోరో ప్రాజెక్టు, కేఎల్ రావు పార్కులో వాటర్ థీమ్ అభివృద్ధికి డీపీఆర్ రూపకల్పనకు ప్రభుత్వం నిర్దేశించింది. డీపీఆర్‌లు పూర్తి కాగానే.. పీపీపీ విధానంలో వీటి అభివృద్ధికి చర్యలు తీసుకోనుంది. మచిలీపట్నం పోర్టును దృష్టిలో పెట్టుకుని సంబంధిత రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించడంలో ప్రభుత్వం విజయం సాధించింది. ప్రభుత్వం చేసిన ప్రమోషన్ కారణంగా.. షిప్ బిల్డింగ్ - షిప్ రిపేర్ ప్రాజెక్టులలో భారీ పెట్టుబడులు రాబోతున్నాయి. విజయవాడలో పర్యాటకాభివృద్ధి, రవాణా రంగానికి దోహదపడే పలు ప్రాజెక్టులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
బందరు పోర్టు.. కీలక రంగాల్లో పెట్టుబడులు
మచిలీపట్నం పోర్టును దృష్టిలో పెట్టుకుని షిప్ బిల్డింగ్ - షిప్ రిపేర్ రంగానికి చెందిన రెండు భారీ పరిశ్రమలు కృష్ణాజిల్లాలో ఏర్పాటు కాబోతున్నాయి. రూ.9,100 కోట్ల వ్యయంతో కూడుకున్న భారీ పెట్టుబడులు రానున్నాయి. ఈ నెలాఖరుకు ప్రక్రియను పూర్తి చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధంగా ఉంది. యునైటెడ్ పెట్రో గ్రూప్ సంస్థ షిఫ్ బిల్డింగ్ - షిప్ రిపేర్ ప్రాజెక్టు ఏర్పాటుకు ముందుకు వచ్చింది. రాష్ట్రంలోనే ఈ రంగంలో అత్యధిక పెట్టుబడి రూ.7,600 కోట్ల వ్యయంతో కృష్ణాజిల్లాలో ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ఈ ప్రాజెక్టు కోసం 1,185 ఎకరాల భూములు అవసరం కానున్నాయని ప్రతిపాదించింది. భూములను సేకరించగలిగితే.. ఈ ప్రాజెక్టు ఏర్పాటు ద్వారా 12 వేల మందికి ఉద్యోగాలను కల్పించటం సాధ్యమవుతుంది. గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ సంస్థ కూడా షిప్ బిల్డింగ్ - షిప్ రిపేర్ ప్రాజెక్టు ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ఈ ప్రాజెక్టు కోసం రూ.1,500 కోట్ల పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపించింది. ఈ ప్రాజెక్టు కోసం 200 ఎకరాల భూములు కావాలని ప్రతిపాదించటం జరిగింది. భూములను సేకరించగలిగితే 1500 మందికి స్థానికంగా ఉద్యోగావకాశాలు లభిస్తాయి.
వీటి కార్యకలాపాలు ఇలా..
షిప్ బిల్డింగ్ ప్రాజెక్టుల ద్వారా నౌకల నిర్మాణం జరుగుతుంది. నౌకల డిజైన్ రూపకల్పన, స్టీల్ ప్లేట్లను ఆటోమేటెడ్ కటింగ్ విధానంలో కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్‌తో ఖచ్చితంగా కత్తిరించడం, నౌకను బ్లాక్‌గా విభజించి విడివిడిగా నిర్మించి వెల్డింగ్ చేయడం, షిప్ నిర్మాణం జరిగాక ఇంటీరియర్ పనులు పూర్తి చేయడం, షిప్ పనితీరును పరిక్షించడం వంటివి జరుగుతాయి. షిప్ రిపేర్ ప్రాజెక్టుల ద్వారా షిప్ బాటమ్ శుభ్రపరచడం, థ్రస్టర్లు, హాల్ శుభ్రపరచడం, పెయింటింగ్, స్టీల్ రెన్యూవల్, ప్రొషల్షన్ వర్క్స్, ఇంజిన్లు, జనరేటర్లు, పంపులు, వాల్వులు, పైపింగ్ సిస్టమ్ ఓవర్ హాలింగ్, బల్లాస్ట్, ఫ్యూయల్ ట్యాంకులో లోపలి మరమ్మతులు, క్రేన్లు, విండ్లాస్, డెక్ పైపింగ్ వంటివి ఉపరితల పరికరాల వర్క్స్, నౌకల ఇతర రిపేర్లు వంటివన్నీ జరుగుతాయి.
సోలార్ పార్క్!
మచిలీపట్నం మూడు స్తంభాల సెంటర్ దగ్గర గ్రౌండ్ మౌంటెడ్ సోలార్ పార్క్‌ను రూ.10 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయటం కోసం డీపీఆర్ రూపకల్పన జరుగుతోంది. డీపీఆర్ పూర్తి కాగానే.. ప్రాజెక్టు పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తవుతుంది. గ్రౌండ్ మౌంటెడ్ సోలార్ పార్క్ అంటే భూమిపైన సోలార్ ప్యానల్స్ (ఫొటోవోల్టాయిక్ మాడ్యూల్స్) శ్రేణిని ఏర్పాటు చేసి గ్రిడ్‌కు అనుసంధానం చేస్తారు.
క మర్షియల్ కాంప్లెక్స్!
మచిలీపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) ఆఫీసుతో పాటు కమర్షియల్ స్పేస్ కోసం 2.71 ఎకరాల విస్తీర్ణంలో ఆఫీసు కమ్ కమర్షియల్ కాంప్లెక్స్‌ను రూ.60 కోట్ల వ్యయంతో నిర్మించేందుకు డీపీఆర్‌కు రూపకల్పన చేస్తున్నారు.
విద్యాధరపురంలో కబేళా ఆధునీకరణ!
ఎన్టీఆర్ జిల్లాలో విద్యాధరపురంలో వీఎంసీ నిర్వహణలోని ‘కబేళ’ను ఆధునీకరించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. రూ.10కోట్ల వ్యయంతో కబేళను ఆధునీకరించేందుకు డీపీఆర్ రూపకల్పన చేయిస్తోంది. కబేళా ఆధునీకరణలో భాగంగా.. ఆటోమేషన్, మెకనైజేషన్ (రోబోటిక్స్, కన్వేయర్ సిస్టమ్), యానిమల్ వెల్ఫేర్, వథ సమయంలో జంతువుల బాధ తగ్గించడం, హైజీన్ - ఫుడ్ సేఫ్టీ, మాంసం నాణ్యతను పెంచేలా ప్రాసెసింగ్ చేయడం, డిజిటల్ ట్రాకింగ్, డేటా మేనేజ్‌మెంట్ వంటి విధానాలు ఉంటాయి.
వాటర్ థీమ్ పార్క్‌కు చర్యలు!
విజయవాడ కార్పొరేషన్ నిర్వహణలో ఉన్న ప్రధాన పార్కులలో కేఎల్ రావు పార్కు కూడా ఒకటి. ఈ పార్కులో రూ.4కోట్ల వ్యయంతో వాటర్ థీమ్ పార్కును అభివృద్ధి చేసేందుకు డీపీఆర్‌ను తయారు చేయించటం జరుగుతోంది. ప్రస్తుతం తుది దశలో ఉంది.
రూ.14 కోట్లతో వాటర్ ఏరోడ్రోమ్ ఏర్పాటు!
కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజీ దగ్గర వాటర్ ఏరోడ్రోమ్ (నీటిపై సీప్లేన్‌లు దిగడానికి, ఎగరడానికి ఉపయోగించే విమానాశ్రయం) ఏర్పాటుకు రూ.14 కోట్ల వ్యయంతో పనులు చేపట్టేందుకు వీలుగా ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన డీపీఆర్ కూడా తుది దశలో ఉంది.
రూ.15 కోట్ల వ్యయంతో ట్రక్ టెర్మినల్ ఇన్ర్ఫా
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ట్రక్ టెర్మినల్‌ను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకు వచ్చేందుకు వీలుగా రోరో ప్రాజెక్టుకు రూ.15 కోట్ల వ్యయంతో ప్రభుత్వం డీపీఆర్ తయారు చేయించాలని నిర్ణయించింది. రోరో అంటే రోల్ ఆన్ రోల్ ఆఫ్. ట్రక్ టెర్మినల్‌లో పార్కింగ్ చేసిన ట్రక్కులను వ్యాగన్లపై నడిపిస్తారు. నిలుపుదల చేసిన ట్రక్కులను క్రమబద్ధీకరించడం ఈ విధానంలో ఉంటుంది.