Share News

ఇక సెలవు!

ABN , Publish Date - Feb 21 , 2026 | 01:12 AM

బెజవాడ సిటీ బస్‌ ఆపరేషన్‌లో అతి ముఖ్యమైన విద్యాధరపురం బస్‌ డిపో నుంచి ఇక సేవలు నిలిచిపోనున్నాయి. తక్షణం ఖాళీ చేసి తమకు స్వాధీన పరచాల్సిందిగా ఆర్టీసీ హెడ్‌ ఆఫీస్‌ ఇంజనీరింగ్‌ విభాగం నుంచి విజయవాడ రీజనల్‌ అధికారులకు ఆదేశాలు అందాయి. నగరంలో ఎలక్ర్టిక్‌ బస్సులను ప్రవేశపెడుతున్న నేపథ్యంలో వీటి నిర్వహణ విద్యాధరపురం డిపో కేంద్రంగా చేపట్టాలని నిర్ణయించారు. డిపో పరిధిలోని బస్సులను సమీపంలోని డిపోలకు కేటాయిస్తూ ఆర్టీసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. నెల రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు.

ఇక సెలవు!

- విద్యాధరపురం బస్‌ డిపో ఖాళీ చేయాలని ఆదేశాలు

- నెల రోజుల్లో స్వాధీనం చేయాలని హెడ్‌ ఆఫీస్‌ నుంచి ఉత్తర్వులు

- ఎలక్ర్టిక్‌ బస్సుల నిర్వహణ కోసమని వెల్లడి

- ఇక్కడి బస్సులు సమీపంలోని డిపోలకు కేటాయింపు

- ఉద్యోగుల కేటాయింపుపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం

- అధికారుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న ఉద్యోగ సంఘాలు

బెజవాడ సిటీ బస్‌ ఆపరేషన్‌లో అతి ముఖ్యమైన విద్యాధరపురం బస్‌ డిపో నుంచి ఇక సేవలు నిలిచిపోనున్నాయి. తక్షణం ఖాళీ చేసి తమకు స్వాధీన పరచాల్సిందిగా ఆర్టీసీ హెడ్‌ ఆఫీస్‌ ఇంజనీరింగ్‌ విభాగం నుంచి విజయవాడ రీజనల్‌ అధికారులకు ఆదేశాలు అందాయి. నగరంలో ఎలక్ర్టిక్‌ బస్సులను ప్రవేశపెడుతున్న నేపథ్యంలో వీటి నిర్వహణ విద్యాధరపురం డిపో కేంద్రంగా చేపట్టాలని నిర్ణయించారు. డిపో పరిధిలోని బస్సులను సమీపంలోని డిపోలకు కేటాయిస్తూ ఆర్టీసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. నెల రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ):

విద్యాధరపురం బస్‌ డిపోను పూర్తిగా ఖాళీ చేసేందుకు ఆర్టీసీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. డిపోలో మొత్తం 93 బస్సులు ఉన్నాయి. వీటిలో ఐదు స్పేర్‌ ఉంటాయి. మిగిలిన 88 బస్సులు రన్నింగ్‌లో ఉంటాయి. వీటిలో ఐదు సూపర్‌ లగ్జరీలు ఉన్నాయి. మిగిలిన 83 సిటీ బస్సులు. వీటిలో సింహభాగం విజయవాడ లోకల్‌గా తిరిగేవే ఉన్నాయి. ఓ ఇరవై శాతం బస్సులు మాత్రం గ్రేటర్‌ విజయవాడ విలీన ప్రాంతాలైన రూరల్‌ గ్రామాలకు కూడా వెళతాయి. నగరం (కోర్‌ సిటీ)లో తిరిగే బస్సులన్నింటినీ దగ్గరగా ఉన్న గవర్నర్‌పేట-1, గవర్నర్‌ పేట-2, ఇబ్రహీంపట్నం బస్‌ డిపోలకు కేటాయించాలని నిర్ణయించారు. కోర్‌ సిటీలో మొత్తం 45 సిటీ బస్సులు తిరుగుతున్నాయని గుర్తించి ఈ మూడు డిపోలకు కేటాయించారు. మరో 43 బస్సులు ఉన్నాయి. వీటిలో ఐదు బస్సులు సూపర్‌ లగ్జరీ కావటంతో వాటిని ఆటోనగర్‌ బస్‌ డిపోకు పంపించనున్నారు. గన్నవరం డిపోకు 20 బస్సులు, ఉయ్యూరు డిపోకు 19 బస్సులు, నూజివీడు డిపోకు 2, జగ్గయ్యపేట డిపోకు రెండు బస్సుల చొప్పున కేటాయించారు. ఇవి కూడా సిటీ బస్సులే అయినప్పటికీ నగరం నుంచి దూర ప్రాంతాలకు వెళతాయి కాబట్టి ఈ డిపోలకు కేటాయించారు.

పినాకిల్‌ సంస్థకు కేటాయింపు

విద్యుత బస్సులను అద్దె ప్రాతిపదికన హైదరాబాద్‌కు చెందిన జీరో 21 లిమిటెడ్‌ నుంచి తీసుకోవాలని నిర్ణయించారు. విద్యుత బస్సుల నిర్వహణను మాత్రం పినాకిల్‌ అనే సంస్థకు అప్పగించారు. పినాకిల్‌ సంస్థ చార్జింగ్‌ స్టేషన్లు, రిపేర్లు, ఇతర నిర్వహణ వంటివి చేపట్టడం కోసమే ఆ సంస్థకు విద్యాధరపురం బస్‌ డిపోను కేటాయిస్తున్నారు. ఇప్పటికే విద్యాధరపురం బస్‌ డిపోకు విద్యుత కనెక్షన్‌ కోసం ఆర్టీసీ అధికారులు విద్యుత శాఖకు దరఖాస్తు చేశారు.

ఉద్యోగుల నుంచి వ్యతిరేకత

విద్యాధరపురం బస్‌ డిపోను ప్రైవేటు సంస్థ పినాకిల్‌కు అప్పగించటంపై ఆర్టీసీ ఉద్యోగుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. డిపోను ఖాళీ చేయాల్సిందిగా ఆర్టీసీ యాజమాన్యం తాజాగా ఆదేశాలు జారీ చేయటంతో ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇక్కడి 93 బస్సులను ఇతర డిపోలకు కేటాయించినా.. ఉద్యోగులకు సంబంధించి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఉద్యోగులను ఏ డిపోకు వెళ్లాలనుకుంటున్నారో ఆప్షన్‌ తీసుకుంటారేమో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ప్రైవేటు సంస్థకు సొంత డిపోను ఖాళీ చేయించి ఇవ్వటంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. ఉద్యోగ సంఘాలన్నీ కూడా దశలవారీ ఆందోళన కార్యక్రమాలకు పిలుపునివ్వటంతో ఈ వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారే అవకాశం కనిపిస్తోంది. విద్యుత బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకుంటున్న నిర్ణయాన్ని ఆర్టీసీ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు స్వాగతిస్తున్నాయి. కానీ సొంత డిపోను ఇవ్వవద్దని.. ఒకవేళ అంతగా ఇవ్వాలనుకుంటే ఆర్టీసీకి చెందిన ఖాళీ స్థలాలను ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. గొల్లపూడిలో ఉన్న ఆర్టీసీ స్థలాన్ని కానీ, విద్యాధరపురంలోనే జోనల్‌ వర్క్‌షాప్‌ పక్కనే స్ర్కాప్‌ బస్సులను పార్కింగ్‌ చేసే ప్రాంతాన్ని కూడా పినాకిల్‌ సంస్థకు ఇవ్వటం ద్వారా ఎలక్ర్టిక్‌ బస్సుల మెయింట్‌నెన్స్‌ చేయటం కుదురుతుందని సూచిస్తున్నాయి. ఈ సూచనలను ఆర్టీసీ ఉన్నతాధికారులు ఖాతరు చేయటం లేదు.

పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు ఇబ్బందే!

పశ్చిమ నియోజకవర్గంలో సింహభాగం ప్రజలు పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన వారు ఎక్కువుగా ఉంటారు. విద్యాధరపురం బస్సు డిపో పరిధిలో సగానికి పైగా బస్సులు నియోజకవర్గ పరిధిలోనే తిరుగుతాయి. గట్టువెనుక, చిట్టినగర్‌ ప్రాంతాలకు రూట్‌ నెంబర్‌ 3, 5, 11 బస్సులు తిరుగుతాయి. విద్యాధరపురం డిపో నుంచి జక్కంపూడి, కబేళా, హెచ్‌బా కాలనీలకు వెళ్లే బస్సులన్నీ కూడా ప్రస్తుత విద్యాధరపురం బస్సు డిపో నుంచి రెండు నిమిషాల వ్యవధిలో చేరుకునే పరిస్థితి ఉంది. ఈ బస్సులను ఇక్కడి నుంచి తీసి గవర్నర్‌పేట - 1, 2, ఇబ్రహీంపట్నం, ఉయ్యూరు నుంచి నడిపితే.. దూరాభారం అవతుంది. ప్రస్తుత టైమింగ్స్‌ దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు.

Updated Date - Feb 21 , 2026 | 01:12 AM