Share News

రాష్ట్రంలో గ్యాస్‌ కొరత లేదు

ABN , Publish Date - Apr 07 , 2026 | 04:02 AM

రాష్ట్రంలో ఎల్పీజీ, పెట్రోలు, డీజిల్‌, ఎరువుల కొరత లేదని, వాటి నిల్వలు పుష్కలంగా ఉన్నాయని పౌరసరఫరాల శాఖ డైరెక్టర్‌ శ్రీవాస్‌ నూపుర్‌ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు.

రాష్ట్రంలో గ్యాస్‌ కొరత లేదు

  • ఎల్పీజీ, పెట్రోల్‌, డీజిల్‌, ఎరువుల నిల్వలు పుష్కలం: శ్రీవాస్‌ నూపుర్‌

అమరావతి, ఏప్రిల్‌ 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎల్పీజీ, పెట్రోలు, డీజిల్‌, ఎరువుల కొరత లేదని, వాటి నిల్వలు పుష్కలంగా ఉన్నాయని పౌరసరఫరాల శాఖ డైరెక్టర్‌ శ్రీవాస్‌ నూపుర్‌ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. ప్రజలు, రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సోమవారం విజయవాడలోని సివిల్‌ సప్లయిస్‌ భవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం రాష్ట్రంపైనా ఉన్నప్పటికీ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజలకు వంటగ్యాస్‌ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ, తగిన చర్యలు తీసుకున్నామని వివరించారు. గ్యాస్‌, పెట్రోలు, డీజిల్‌ కొరత ఉందంటూ సోషల్‌ మీడియాలో సృష్టిస్తున్న వదంతులను నమ్మి ప్రజలు భయాందోళనతో ప్యానిక్‌ బుకింగ్‌లు చేయవద్దని, సిలిండర్ల కోసం గ్యాస్‌ ఏజెన్సీలు, గొడౌన్ల వద్దకు పరుగులు తీయొద్దని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని రిఫైనరీల్లో ప్రస్తుతం 14 వేల టన్నుల ఎల్పీజీ నిల్వలు ఉన్నాయని తెలిపారు. వినియోగదారులు ఆన్‌లైన్‌లో గ్యాస్‌ బుక్‌ చేసుకుంటే.. 2-3 రోజుల్లో ఇంటికే తీసుకువచ్చి సిలిండర్‌ డెలివరీ చేస్తారని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించి సిలిండర్లను దారి మళ్లించిన వారిపై ఇప్పటి వరకు 1075 కేసులు నమోదు చేసి, 4377 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నామన్నారు.

Updated Date - Apr 07 , 2026 | 04:03 AM