Share News

కూటమికి విడాకుల్లేవు!

ABN , Publish Date - Jan 28 , 2026 | 04:21 AM

‘టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిలో విభేదాలు సృష్టించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. మనం అప్రమత్తంగా ఉండాలి. మనకు విడాకులు లేవు.. కలిసికట్టుగా ముందుకెళ్లడమే మన ఎజెండా’ అని టీడీపీ...

కూటమికి విడాకుల్లేవు!

  • కలిసికట్టుగా ముందుకెళ్లాలి: లోకేశ్‌

  • చిన్న చిన్న సమస్యలుంటాయ్‌.. కలిసి పరిష్కరించుకుందాం

  • విభేదాల సృష్టికి వైసీపీ ప్రయత్నం

  • మనం అప్రమత్తంగా ఉండాలి

  • కాలానుగుణంగా పార్టీలో మార్పులు

  • గ్రామ పార్టీ అధ్యక్షుడు పొలిట్‌బ్యూరో వరకు ఎదగాలి.. వర్క్‌షాపులో లోకేశ్‌

చంద్రబాబు ట్రెండ్‌సెట్టర్‌. 75 ఏళ్ల వయసులో కూడా యువకుడిలా పనిచేస్తున్నారు. ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు సేవ చేయాలని నిత్యం ఆలోచించే వ్యక్తి.

ఎన్టీఆర్‌ ఎంతో మంది యువతకు అవకాశాలు కల్పించారు. ఇప్పుడు టీడీపీని మళ్లీ యువరక్తంతో నింపాల్సిన సమయం వచ్చింది. అందుకే యువతను ప్రోత్సహిస్తున్నాం.

- మంత్రి లోకేశ్‌

అమరావతి, జనవరి 27(ఆంధ్రజ్యోతి): ‘టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిలో విభేదాలు సృష్టించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. మనం అప్రమత్తంగా ఉండాలి. మనకు విడాకులు లేవు.. కలిసికట్టుగా ముందుకెళ్లడమే మన ఎజెండా’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్‌ స్పష్టం చేశారు. టీడీపీ పార్లమెంటరీ నియోజకవర్గ కమిటీల వర్క్‌షాపును రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో కలిసి మంగళవారం కేంద్ర కార్యాలయంలో ఆయన ప్రారంభించారు. ప్రాంతీయ పార్టీ ఒకసారి ప్రతిపక్షంలోకి వస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుందో మనందరం చూశామని ఈ సందర్భంగా అన్నారు. కానీ కార్యకర్తల బలంతో వాటన్నిటినీ అధిగమించి అధికారంలోకి రాగలిగామని చెప్పారు. ‘పార్టీ నేతలు అలకవీడాలి. లేదంటే మనందరం నష్టపోతాం. అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలంటే ప్రభుత్వ కొనసాగింపు చాలా ముఖ్యం. కనీసం 15 ఏళ్లు కూటమి అధికారంలో ఉండి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. చిన్న చిన్న సమస్యలు ఉంటాయ్‌. కలిసి పరిష్కరించుకుందాం’ అని సూచించారు. దేశంలో అభివృద్ధి, సంక్షేమానికి సీఎం చంద్రబాబు బ్రాండ్‌ అంబాసిడర్‌ అయితే.. టీమ్‌-11 (జగన్‌ అండ్‌ కో) మాత్రం కల్తీ నెయ్యి, కోడి కత్తి, కల్తీ మద్యానికి బ్రాండ్‌ అంబాసిడర్లు అని ఎద్దేవాచేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా టీడీపీలో మార్పులు రావాలన్నారు. మన బలం, బలగం కార్యకర్తలేనని చెప్పారు.


పార్టీలో సంస్కరణల కోసం కృషి చేస్తున్నానన్నారు. ‘సామాన్య గ్రామ పార్టీ అధ్యక్షుడు.. పొలిట్‌బ్యూరో వరకు ఎదగాలన్నదే నా ఆకాంక్ష. జిల్లా పార్టీ కమిటీల స్థానంలో పార్లమెంటరీ పార్టీ కమిటీలను తీసుకొచ్చేందుకు నాకు 18 నెలల సమయం పట్టింది. దీని కోసం పొలిట్‌బ్యూరోలో పోరాడాను. పార్లమెంటరీ కమిటీల్లో అంకితభావం ఉన్నవారినే నియమించాం. వీటిలో మొదటిసారి ఎన్నికైన వారు 83శాతం మంది ఉన్నారు’ అని తెలిపారు. సీనియర్లు, జూనియర్లను సమానంగా గౌరవిస్తానని చెప్పారు. చంద్రబాబు ఆలోచనలు ఎప్పుడూ ఓ దశాబ్దం ముందుంటాయన్నారు. ‘1995లో ఐటీని తీసుకొస్తే అందరూ ఎగతాళి చేశారు. ఈ రోజు సైబరాబాద్‌ ఆయన ముందుచూపునకు నిదర్శనంగా నిలిచింది. ఇప్పుడు ఏపీని క్వాంటమ్‌ కంప్యూటింగ్‌లో అగ్రగామిగా ఉంచేందుకు చంద్రబాబు శ్రమిస్తున్నారు. దేశం మొత్తం పెట్టుబడుల్లో 25 శాతం మన రాష్ట్రానికే వస్తున్నాయి. ప్రతిపక్షం 200 కేసులు వేసినా 150 రోజుల్లో డీఎస్సీ పూర్తి చేసి 16 వేల మందికి టీచర్‌ ఉద్యోగాలు కల్పించాం. 6వేల మందిని పోలీసు కానిస్టేబుళ్లుగా నియమించాం. చేసినవి చెప్పుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది’ అని తెలిపారు.


పార్టీ సొంత ఇల్లు.. ప్రభుత్వం అద్దె ఇల్లు!

పార్టీ సొంత ఇల్లు అయితే.. ప్రభుత్వం అద్దె ఇల్లు వంటిదని లోకేశ్‌ తెలిపారు. ప్రతి ఒక్కరూ పార్టీ కార్యాలయానికి సమయం కేటాయించాలన్నారు. చంద్రబాబుకు ఎంత పని ఒత్తిడి ఉన్నా వారానికోసారి కార్యాలయానికి వస్తున్నారని, కార్యకర్తలను కలుస్తున్నారని గుర్తుచేశారు. ‘వ్యక్తులు శాశ్వతం కాదు. పార్టీయే శాశ్వతం. పదవిని ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలి’ అని కోరారు.

కమిటీ సభ్యులకు స్వయంగా ఆహ్వానం

వర్క్‌షాపునకు 25 పార్లమెంటరీ నియోజకవర్గాల నుంచి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతోపాటు 40 మంది చొప్పున కమిటీ సభ్యులు హాజరయ్యారు. వీరందరికీ లోకేశ్‌ స్వయంగా ఆహ్వానం పలికారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలుకరించి ఫొటోలు దిగారు. ఉదయం 8.15కే కార్యాలయానికి చేరుకున్న ఆయన.. రాత్రి 7.30 వరకు అక్కడే గడిపారు.

Updated Date - Jan 28 , 2026 | 04:23 AM