తగ్గేదేలే..!
ABN , Publish Date - Jan 07 , 2026 | 01:15 AM
జిల్లాలో రేషన్ మాఫియా తగ్గేదేలే అంటోంది. రేషన్ అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు జాయింట్ కలెక్టర్ ఇలక్కియా టాస్క్‌ఫోర్స్‌ను నియమించినా భయమే లేదన్నట్టుగా ప్రవర్తిస్తోంది. పేదలకు అందాల్సిన రేషన్ పక్కదారి పడుతూనే ఉంది. తాజాగా కొండపల్లిలో భారీ స్థాయిలో రేషన్ బియ్యం పట్టుబడటం రేషన్ దందా తీరుకు అద్దం పడుతోంది.
- జిల్లాలో రెచ్చిపోతున్న రేషన్ మాఫియా
- ఇటీవల టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసిన జిల్లా అధికారులు
- అరునా లెక్కచేయని అక్రమార్కులు
- కొండపల్లిలో భారీగా పట్టుబడిన రేషన్ బియ్యం
- పీడీయాక్ట్ కేసులు నమోదు చేస్తామన్నా.. వెనుకడుగువేయని అక్రమార్కులు
జిల్లాలో రేషన్ మాఫియా తగ్గేదేలే అంటోంది. రేషన్ అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు జాయింట్ కలెక్టర్ ఇలక్కియా టాస్క్‌ఫోర్స్‌ను నియమించినా భయమే లేదన్నట్టుగా ప్రవర్తిస్తోంది. పేదలకు అందాల్సిన రేషన్ పక్కదారి పడుతూనే ఉంది. తాజాగా కొండపల్లిలో భారీ స్థాయిలో రేషన్ బియ్యం పట్టుబడటం రేషన్ దందా తీరుకు అద్దం పడుతోంది.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
జిల్లాలో రేషన్ మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు జిల్లా అధికారులు టాస్క్‌ఫోర్స్‌ను నియమించి వారం రోజులు కూడా కాకముందే మంగళవారం కొండపల్లిలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని పెద్ద మొత్తంలో విజిలెన్స్ అధికారులు దాడి చేసి మరీ పట్టుకున్నారు. దీనిని బట్టి చూస్తే టాస్క్‌ఫోర్స్ అన్నా కూడా రేషన్ మాఫియా బెదరటం లేదు. ప్రతి రేషన్ డిపోకు ఇద్దరు సచివాలయ ఉద్యోగులు ప్రతి రోజూ పర్యవేక్షణ చేసేలా బాధ్యతలు అప్పగించారు. ఏదో ఒక సమయంలో వీరు డిపోకు వెళ్లి స్టాక్ నిల్వలను పరిశీలించాల్సి ఉంది. అలాగే పోలీసులు కూడా డిపోలను ర్యాండమ్‌గా చెక్ చేయాల్సి ఉంది. విజిలెన్స్ అధికారులు కూడా తనిఖీలు నిర్వహిస్తుండాలి. ఒక రకంగా టాస్క్‌ఫోర్స్ కమిటీలనేవి రేషన్ దుకాణదారులు, అక్రమార్కులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. అయినా కూడా అక్రమార్కులు వెనుకడుగు వేయటం లేదు. జాయింట్ కలెక్టర్ ఇలక్కియా ఇటీవల పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుతో మాట్లాడి రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచిన వారిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేయాలని కోరారు. దీనిపై సీపీ కూడా సానుకూలంగా స్పందించారు. అక్రమంగా రేషన్ బియ్యాన్ని నిల్వ ఉంచితే పీడీ యాక్ట్ పెడతారన్న భయం కూడా రేషన్ మాఫియాకు లేకపోవడం గమనార్హం.
తాత్కాలిక డీలర్లతో రేషన్ బియ్యం పక్కదారి
జిల్లా వ్యాప్తంగా రేషన్ దుకాణాల రేషనలైజేషన్ ప్రక్రియను ప్రారంభించారు. కార్డుల సంఖ్య తగ్గించి నూతన డిపోలను ఏర్పాటు చేసి, కొత్తవారికి అవకాశాలు కల్పించాలని, రేషనలైజేషన్ తర్వాత ఎన్టీఆర్ జిల్లాలో 110 రేషన్ దుకాణాలు అదనంగా ఏర్పాటు చేయవచ్చని నిర్ణయించారు. నూతన డీలర్ల కోసం పౌరసరఫరాల శాఖ అధికారులు పరీక్షలు కూడా నిర్వహించారు. అర్హులైన వారిని ఎంపిక చేశారు. ఇది జరిగి చాలాకాలమవుతున్నా ఇప్పటివరకు వారికి చౌక దుకాణాలను కేటాయించలేదు. దీంతో తాత్కాలిక డీలర్లు, స్వయం సహాయక సంఘాలు కొన్ని డిపోలను నిర్వహిస్తున్నాయి. తాత్కాలికంగా డీలర్లుగా పనిచేస్తున్న వారిలో కొందరు, స్వయం సహాయక సంఘాలు కొన్ని రేషన్‌ను పక్కదారి పట్టిస్తున్నాయి. టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసినా.. ఎలాగూ ఊడే ఉద్యోగమే కదా అన్న భావనలో ఉంటున్నారని తెలిసింది. దీంతో రేషన్ బియ్యం పక్కదారి పడుతూనే ఉంది. తక్షణం ఎంపిక చేసిన నూతన డీలర్లకు నూతన షాపులను కేటాయించాల్సిన అవసరం ఉంది.
కార్డుదారుల నుంచి డీలర్ల కొనుగోలు
జిల్లాకు ఇస్తున్న నూరుశాతం కోటాలో ప్రతి నెలా సగటున 92 శాతం పంపిణీ మాత్రమే జరుగుతోంది. దీనిలో కూడా కేవలం 30శాతం మంది మాత్రమే బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. దాదాపు 70 శాతం మంది కార్డుదారులు బియ్యం తీసుకుంటున్నప్పటికీ.. వెంటనే డీలర్లకు విక్రయించేస్తున్నారు. ఇది బహిరంగ రహస్యమే. ఈ రేషన్ బియ్యం డీలర్ల ద్వారా రేషన్ వ్యాపారులు, మాఫియా గుప్పెట్లోకి చేరుతుంది. కార్డుదారులు తమకు ఇచ్చిన రేషన్‌ను అమ్ముకోకుండా వారికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.