‘ఇంటి’ దొంగలపై చర్యల్లేవ్!
ABN , Publish Date - Jan 21 , 2026 | 12:39 AM
గృహ నిర్మాణ పథకం అక్రమాలకు అడ్డాగా మారింది. జిల్లాలో ఏఈలు, డీఈలు కుమ్మక్కై లబ్ధిదారులకు అందాల్సిన ఇనుము, సిమెంట్ తదితర మెటీరియల్‌ను అమ్ముకుని లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకున్నారు. బాధితుల ఫిర్యాదుతో విచారణ జరిపిన అధికారులు అవినీతి నిజమని తేల్చినా నేటి వరకు చర్యలు చేపట్టలేదు. నిందితుల నుంచి రూపాయి కూడా రికవరీ చేయలేదు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
- గృహ నిర్మాణ పథకంలో భారీగా అక్రమాలు
- ఘంటసాలలో 97 టన్నుల ఇనుము, వేల బస్తాల సిమెంటు మాయం
- వీటి విలువ రూ.84 లక్షలకుపైనే..
- ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌కు బాధితుల ఫిర్యాదు
- మీరు లెక్కతేలుస్తారా.. నన్ను తేల్చమంటారా అంటూ అధికారులపై ఆయన ఆగ్రహం
- మూడు రోజుల క్రితం ఘంటసాల గోడౌన్‌లో విచారణ ప్రారంభించి నిలిపివేత
- కోడూరు మండలంలో రూ.39 లక్షల మెటీరియల్ గోల్‌మాల్!
- చల్లపల్లి, పెడన మండలాల్లోనూ రూ.లక్షల్లో అక్రమాలు వెలుగులోకి..
- నేటి వరకు నగదు రికవరీ చేపట్టని అధికారులు
గృహ నిర్మాణ పథకం అక్రమాలకు అడ్డాగా మారింది. జిల్లాలో ఏఈలు, డీఈలు కుమ్మక్కై లబ్ధిదారులకు అందాల్సిన ఇనుము, సిమెంట్ తదితర మెటీరియల్‌ను అమ్ముకుని లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకున్నారు. బాధితుల ఫిర్యాదుతో విచారణ జరిపిన అధికారులు అవినీతి నిజమని తేల్చినా నేటి వరకు చర్యలు చేపట్టలేదు. నిందితుల నుంచి రూపాయి కూడా రికవరీ చేయలేదు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :
జిల్లాలోని పలు మండలాల్లో గృహ నిర్మాణ సంస్థ ఏఈలు, డీఈలు చేసిన అక్రమాలను నిగ్గు తేల్చకుండా ఆ సంస్థ ఉన్నతాధికారులు సాచివేత ధోరణిని అవలంభిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రధానంగా అవనిగడ్డ నియోజకవర్గంలోని కోడూరు, ఘంటసాల, చల్లపల్లి, మోపిదేవి మండలాలతో పాటు, పెడన నియోజకవర్గం పెడన టౌన్, పెడన మండలాల్లో లబ్ధిదారులకు ఇనుము, సిమెంటు ఇవ్వకుండానే ఇచ్చినట్లుగా నమోదు చేసిన అంశంపై కొంతకాలంగా ఫిర్యాదులు వస్తున్నాయి. సిమెంటు, ఇనుము, ఇసుకను మాయం చేసిన ఇంజనీరింగ్ అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా గృహనిర్మాణసంస్థ అధికారులు మీన మేషాలు లెక్కించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో అవనిగడ్డ నియోజకవర్గంలో పనిచేసిన డీఈతో పాటు ఏఈలు చేసిన అక్రమాలపై గృహనిర్మాణ సంస్థ ఎండీ కార్యాలయ విజిలెన్స్ విభాగం అధికారులు విచారణలో నిజాలు వెల్లడైనా ఏ కారణం చేతనో అక్రమాలకు పాల్పడిన వారి నుంచి రికవరీ చేయకుండా జాప్యం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
ఘంటసాల మండలంలో గోడౌన్ నుంచి సిమెంట్, ఇనుము మాయం!
ఘంటసాల మండలంలోని గృహ నిర్మాణ సంస్థ గోడౌన్ నుంచి సిమెంట్, ఇనుము మాయమైన ఘటనపై కొంతకాలంగా అనేక ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై ఆశాఖ అధికారులు విచారణ చేశారు. రూ.58లక్షల విలువైన 97 టన్నుల ఇనుము, రూ.26 లక్షల విలువైన సిమెంట్ బస్తాలు మాయమైనట్లు ప్రాథమికంగా తేల్చారు. ఇటీవల కొందరు లబ్ధిదారులు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌ను కలిసి ఘంటసాల మండలంతో పాటు నియోజకవర్గంలోని ఇతర మండలాల్లోనూ గృహ నిర్మాణం చేసుకునే లబ్ధిదారులకు సిమెంట్, ఇనుము ఇవ్వకుండానే ఇచ్చినట్లుగా నమోదు చేశారని ఫిర్యాదులు చేశారు. మోపిదేవి మండలం కోసూరువారిపాలెంలో లబ్ధిదారులు తమ గృహాలను కాంట్రాక్టుకు తీసుకున్న ఏఈ ఇళ్లను పూర్తిస్థాయిలో నిర్మాణం చేయలేదని ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎమ్మెల్యే గృహ నిర్మాణ సంస్థ అధికారులతో మాట్లాడిన సమయంలో బాధ్యులపై చర్యలు తీసుకుంటారా లేదా అని ప్రశ్నించారు. మీరు చర్యలు తీసుకోకుంటే తానే సరైన నిర్ణయం తీసుకుంటానని హెచ్చరించినట్లు గృహనిర్మాణసంస్థ అధికారులే చెప్పుకుంటున్నారు.
అవనిగడ్డ ఇన్‌చార్జి డీఈ నేతృత్వంలో విచారణ
ఎమ్మెల్యే హెచ్చరికలతో ఘంటసాల మండలంలో ఏఈలుగా ఎవరెవరు పనిచేశారు, ఎవరి హయాంలో సిమెంట్, ఇనుము ఎంతెంత మాయమైందనే విషయంపై అవనిగడ్డ ఇన్‌చార్జి డీఈ వెంకట్రావ్ నేతృత్వంలో పూర్తిస్థాయిలో లెక్కలు తేల్చేపనిని చేపట్టారు. గత సోమవారం ఘంటసాల గోడౌన్ వద్దకు హమాలీలను తీసుకువెళ్లి సిమెంట్, ఇనుముకు సంబంధించి లెక్కలు తేల్చేందుకు ప్రయత్నించారు. గోడౌన్ ఇన్‌చార్జిగా ఉన్న ఏఈ ఇప్పుడు లెక్కలు చూడవద్దంటూ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ పనిని నిలిపివేయడం గమనార్హం. పూర్తిస్థాయిలో లెక్కలు చూస్తే సిమెంట్, ఇనుము మాయమైన ఘటనలో బాధ్యులైన ఏఈలు సగం, డీఈ, ఈఈలు మరో సగం వాటాలు వేసుకుని నగదు చెల్లించాలనే ప్రతిపాదనను గృహనిర్మాణసంస్థ ఉన్నతా ఽఽధికారులు ఇటీవల జరిగిన సమావేశంలో చెప్పడంతో అక్రమాలకు పాల్పడిన అధికారులు ఆలోచనలో పడినట్లు సమాచారం.
కోడూరు మండలంలో రూ.39 లక్షలకు..
కోడూరు మండలంలో గృహ నిర్మాణ సంస్థ ఏఈ లబ్ధిదారులకు సిమెంట్, ఇనుము ఇవ్వకుండానే ఇచ్చినట్లుగా నమోదు చేయడంతో ఈ అంశంపై ఫిర్యాదులు వచ్చాయి. దీంతో గృహ నిర్మాణ సంస్థ ఎండీ కార్యాలయ విజిలెన్స్ విభాగం అధికారులు గతంలో విచారణ చేశారు. రూ.39 లక్షల విలువైన మెటీరియల్ ఈ మండలంలో మాయమైనట్లుగా నిర్ధారించారు. గతంలో ఈ మండలంలో పనిచేసిన ఏఈని విధుల నుంచి తొలగించి, సొమ్మును రికవరీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సదరు ఏఈని విధుల నుంచి తొలగించినా, నగదు రికవరీ చేయకుండా జిల్లా గృహనిర్మాణ సంస్థ అధికారులు కొద్ది నెలలుగా మిన్నకుండిపోయారు. అయితే సదరు ఏఈ మాత్రం కూటమి ప్రభుత్వంలో లబ్ధిదారులకు నూతన గృహాలు మంజూరు చేయిస్తానని ఈ మండలంలోనే తిష్టవేసి పైరవీలు చేస్తున్నాడనే ఆరోపణలు వస్తున్నాయి.
అక్రమాలు రుజువైనా..
-చల్లపల్లి మండలంలో గతంలో పనిచేసిన ఏఈపై అక్రమాలు రుజువుకావడంతో క్రమశిక్షణా చర్యల్లో భాగంగా విధుల నుంచి తొలగించారు. ఈ ఏఈ మళ్లీ తనను విధుల్లోకి తీసుకోవాలని జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధి వద్దకు వెళ్లగా, ఆయన మళ్లీ ఈ ప్రతిపాదనతో తన వద్దకు రావద్దని హెచ్చరించినట్లు సమాచారం.
-పెడన పట్టణం, మండలంలో గృహాలు నిర్మాణం చేయకుండానే చేసినట్లుగా చూపి లబ్ధిదారుల పేరున మెటీరియల్‌ను ఇచ్చినట్లుగా నమోదు చేసి అక్రమాలకు పాల్పడ్డారు. లబ్ధిదారుల నుంచి అధికారులు వివరాలు దాదాపు సేకరించారు. అయినా సదరు ఏఈలపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా జాప్యం చేస్తున్నారు.
- ఇటీవల కలెక్టర్ బాలాజీ గృహ నిర్మాణ సంస్థ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన సమయంలో సిమెంట్, ఇనుము మాయం చేసిన అధికారులపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోనని హెచ్చరించారు. అయినా అవనిగడ్డ, పెడన నియోజకవర్గాలలో అక్రమాలకు పాల్పడిన ఏఈలను కాపాడే ప్రయత్నంలోనే గృహనిర్మాణసంస్థ అధికారులు ఉన్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.