Share News

తమిరిశ సర్పంచ్‌పై చర్యల్లేవ్‌!

ABN , Publish Date - Feb 14 , 2026 | 12:48 AM

తప్పుడు కుల ధ్రువీకరణ పత్రంతో తమిరిశ గ్రామ సర్పంచ్‌ పదవి చేపట్టిన మహిళపై నాటి ఎన్నికల బరిలో నిలిచిన ప్రత్యర్థి న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. మరో 50 రోజుల్లో ఐదేళ్ల పదవీకాలం పూర్తవుతున్నా ఆమెకు న్యాయం జరగలేదు. 15 నెలల క్రితం గ్రామంలో విచారణ జరిపిన అధికారులు నేటికీ ఏ నిర్ణయం తీసుకోకపోవడం పలు విమర్శలకు దారి తీస్తోంది. నకిలీ ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రం పొంది పదవిలోకి వచ్చిన పుత్తూరు మున్సిపల్‌ చైర్మన్‌ ఆనంగి హరిని పదవి నుంచి తొలగిస్తూ పురపాలక శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

తమిరిశ సర్పంచ్‌పై చర్యల్లేవ్‌!

- తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలపై విచారణ పూర్తి చేసి 15 నెలలు

- గత వైసీపీ హయాంలో బీసీ-సీ కులానికి ఎస్సీ సర్టిఫికెట్‌ జారీ

- మరో 50 రోజుల్లో పూర్తికానున్న పదవీ కాలం

- అయినా పట్టించుకోని జిల్లా అధికారులు

- తప్పుడు పత్రాలను సమర్పించిన పుత్తూరు చైర్మన్‌ని ఇటీవల పదవి నుంచి తొలగింపు

తప్పుడు కుల ధ్రువీకరణ పత్రంతో తమిరిశ గ్రామ సర్పంచ్‌ పదవి చేపట్టిన మహిళపై నాటి ఎన్నికల బరిలో నిలిచిన ప్రత్యర్థి న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. మరో 50 రోజుల్లో ఐదేళ్ల పదవీకాలం పూర్తవుతున్నా ఆమెకు న్యాయం జరగలేదు. 15 నెలల క్రితం గ్రామంలో విచారణ జరిపిన అధికారులు నేటికీ ఏ నిర్ణయం తీసుకోకపోవడం పలు విమర్శలకు దారి తీస్తోంది. నకిలీ ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రం పొంది పదవిలోకి వచ్చిన పుత్తూరు మున్సిపల్‌ చైర్మన్‌ ఆనంగి హరిని పదవి నుంచి తొలగిస్తూ పురపాలక శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

ఆంధ్రజ్యోతి - గుడివాడ:

నకిలీ ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రం పొంది పదవిలోకి వచ్చిన పుత్తూరు మున్సిపల్‌ చైర్మన్‌ ఆనంగి హరిని పదవి నుంచి తొలగిస్తూ పురపాలక శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే రీతిలో నందివాడ మండలం తమిరిశ సర్పంచ్‌ తప్పిట ధనలక్ష్మి నకిలీ ఎస్సీ సర్టిఫికెట్‌తో పదవి పొందారని వచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు విచారణ చేసి 15 నెలలు అవుతున్నా.. ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మరో 48 రోజుల్లో సర్పంచ్‌ పదవి కాలం ముగియనుంది.

వైసీపీ హయాంలో నకిలీ ఎస్సీ సర్టిఫికెట్‌ జారీ

2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ప్రతిపాదిత నందివాడ మండలం తమిరిశ గ్రామ సర్పంచ్‌ అభ్యర్థి తప్పిట ధనలక్ష్మి ఎన్నికల అఫిడవిట్‌లో ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించారు. ఆనాడే టీడీపీ ప్రతిపాదిత అభ్యర్థి రమణమ్మ ధనలక్ష్మిది ఎస్సీ కులం కాదని, బీసీ-సీ అని నిర్ధారించే విద్యాభ్యాస పత్రాలను సమర్పించారు. అప్పటి వైసీపీ నాయకుల ఒత్తిడితో రమణమ్మ ఫిర్యాదును ఎన్నికల అధికారి తోసిపుచ్చారు. పలుమార్లు రమణమ్మ పంచాయితీరాజ్‌, రెవెన్యూ అధికారులను కలిసి న్యాయం చేయాలని కోరారు. చివరికి అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. అప్పటి ఎంపీడీవో కార్యాలయ, రెవెన్యూ అధికారులు ధనలక్ష్మి వ్యవహారంలో కోర్టును తప్పుదోవ పట్టించారు.

రెవెన్యూ శాఖ లీలలు!

రెవెన్యూ శాఖ కులధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వాలంటే ఖచ్చితంగా పాఠశాల టీసీలో ఏ కులం పేర్కొని ఉందో పరిశీలన చేసి దానిలో పేర్కొన్న విధంగా కుల ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేస్తారు. కానీ ధనలక్ష్మి విషయంలో అధికారులు ఎటువంటి పత్రాలను పరిశీలించకుండా కేవలం వైసీపీ నాయకుల ఒత్తిడితో తప్పిట ధనలక్ష్మికి ఎస్సీ సర్టిఫికెట్‌ను జారీ చేసారని రమణమ్మ ఆరోపిస్తున్నారు. పాఠశాలలో ఉన్న బీసీ-సీ కాకుండా ఎస్సీ సర్టిఫికెట్‌ ఎలా జారీ చేస్తారని నిలదీశారు.

విచారణ జరిపి 15 నెలలు..

గత వైసీపీ హయాంలో జరిగిన అన్యాయాన్ని పంచాయతీరాజ్‌ శాఖ రాష్ట్ర కమిషనర్‌ కృష్ణతేజ దృష్టికి తీసుకువెళ్లగా ఆయన వెంటనే విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని జిల్లా సీఈవోకు ఆదేశాలిచ్చారు. 2024 నవంబరు 29వ తేదీన ఎంపీడీవో మల్లీశ్వరీ, ఈవోపీఆర్డీ అబ్దుల్‌ బాషా, ఎస్‌ఐ కె.శ్రీనివాస్‌తో కూడిన విచారణ బృందం ఆధ్వర్యంలో తమిరిశ గ్రామ పంచాయతీ కార్యాలయంలో పోలీస్‌ బందోబస్తు నడుమ విచారణ పూర్తి చేశారు. ఇరువర్గాల నుంచి పత్రాలను సేకరించారు. విచారణ పూర్తి చేసి జిల్లా సీఈవోకు నివేదికను సమర్పించి 15 నెలలు కావస్తున్నా.. తప్పుడు ధ్రువీకరణ పత్రాలపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

మరో 48 రోజుల్లో పదవీకాలం పూర్తి

అక్రమంగా కుల ధ్రువీకరణ పత్రంతో పదవి పొందిన పుత్తూరు మున్సిపల్‌ చైర్మన్‌ హరిని ఈ నెల 11వ తేదీన మున్సిపల్‌ శాఖ రాష్ట్ర ముఖ్యకార్యదర్శి సురేష్‌కుమార్‌ పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే రీతిలో తమిరిశ సర్పంచ్‌ ఽధనలక్ష్మిని పదవి నుంచి తొలగిస్తారా లేదా చూసిచూడనట్లు వ్యవహరిస్తారో తేలాల్సి ఉంది. ఏప్రిల్‌ 3వ తేదీతో సర్పంచ్‌ల పదవికాలం పూర్తికానుంది. జిల్లా సీఈవో నివేదికను పరిశీలించారా లేదా బుట్టదాఖలు చేసారా అనే అనుమానం వ్యక్తమవుతుంది.

Updated Date - Feb 14 , 2026 | 12:48 AM