Share News

జూడాలకు స్టైపెండ్‌ ఇవ్వని.. మెడికల్‌ కాలేజీలకు రూ.కోటి ఫైన్‌

ABN , Publish Date - Mar 15 , 2026 | 05:45 AM

ఎంబీబీఎస్‌ ఇంటర్నీస్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ రెసిడెంట్‌ డాక్టర్లకు స్టైపెండ్‌ చెల్లింపులో నిర్లక్ష్యం వహించిన మెడికల్‌ కాలేజీలపై జాతీయ వైద్య కమిషన్‌(ఎన్‌ఎంసీ) కొరడా ఝుళిపించింది.

జూడాలకు స్టైపెండ్‌ ఇవ్వని.. మెడికల్‌ కాలేజీలకు రూ.కోటి ఫైన్‌

  • జాబితాలో ఆంధ్రప్రదేశ్‌లోని రిమ్స్‌ కూడా

హైదరాబాద్‌, మార్చి 14(ఆంధ్రజ్యోతి): ఎంబీబీఎస్‌ ఇంటర్నీస్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ రెసిడెంట్‌ డాక్టర్లకు స్టైపెండ్‌ చెల్లింపులో నిర్లక్ష్యం వహించిన మెడికల్‌ కాలేజీలపై జాతీయ వైద్య కమిషన్‌(ఎన్‌ఎంసీ) కొరడా ఝుళిపించింది. నిబంధనలు ఉల్లంఘించిన వివిధ రాష్ట్రాల్లోని ఏడు మెడికల్‌ కాలేజీలపై రూ.కోటి చొప్పున మొత్తం రూ.7 కోట్ల జరిమానా విధించింది. ఈ మేరకు ఎన్‌ఎంసీ కార్యదర్శి డాక్టర్‌ రాఘవ్‌ లాంగర్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశా రు. స్టైపెండ్‌ వివరాలను మెడికల్‌ కాలేజీలు తమ అధికారిక వెబ్‌సైట్లలో పొందుపరచాలని, పారదర్శకత పాటించాలని గతేడాది జూలైలో ఎన్‌ఎంసీ ఆదేశించింది. ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పులను ఉటంకిస్తూ పదే పదే హెచ్చరించింది. అయినా డేటా సమర్పించని కాలేజీలపై జరిమానా విధిస్తూ చర్యలు తీసుకుంది. ఈ జాబితాలో ఏపీలోని ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల(రిమ్స్‌) కూడా ఉంది. దీంతోపాటు బెంగళూరులోని ఆకాశ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, డుమ్కా మెడికల్‌ కాలేజీ (ఝార్ఖం డ్‌), బార్మర్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ(రాజస్థాన్‌), ఆర్‌కేడీఎఫ్‌ మెడికల్‌ కాలేజీ(భోపాల్‌), ప్రసాద్‌ ఇన్‌స్టిట్యూట్‌ (లఖ్‌నవ్‌), పండిట్‌ బీడీ శర్మ, పీజీ ఇన్‌స్టిట్యూట్‌ (రోహ్‌తక్‌)కు ఈ జరిమానా పడింది. కాగా, కేవలం జరిమానాతోనే సరిపెట్టబోమని, కఠిన చర్యలు ఉంటాయని ఎన్‌ఎంసీ స్పష్టం చేసిం ది. సదరు కాలేజీల్లో అడ్మిషన్లపై ఆంక్షలు విధించడం, అనుమతులు రద్దు చేయడం వంటి చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Updated Date - Mar 15 , 2026 | 05:46 AM