మెడికల్ సీట్ల భర్తీకి ముగింపు లేదా?
ABN , Publish Date - Mar 24 , 2026 | 05:09 AM
వైద్య విద్య సీట్ల భర్తీ ప్రక్రియ ‘ముగింపు లేని అంశం’గా మారుతోందని జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) సుప్రీంకోర్టు ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది.
అంతులేని ప్రక్రియగా కౌన్సెలింగ్.. సుప్రీంకోర్టులో ఎన్‌ఎంసీ వాదనలు
డాక్యుమెంట్లు, గత తీర్పులు పరిశీలిస్తామన్న ధర్మాసనం
న్యూఢిల్లీ, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): వైద్య విద్య సీట్ల భర్తీ ప్రక్రియ ‘ముగింపు లేని అంశం’గా మారుతోందని జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) సుప్రీంకోర్టు ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది. కౌన్సెలింగ్ గడువును పొడిగిస్తూ, కటాఫ్ పర్సంటైల్‌ను తగ్గిస్తూ వివిధ రాష్ట్రాల హైకోర్టులు ఇస్తున్న వరుస ఉత్తర్వులపై తీవ్ర అభ్యంతరం తెలిపింది. ‘తెలంగాణ ప్రైవేట్ మెడికల్ అండ్ డెంటల్ కాలేజ్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్’, ‘ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ మెడికల్ అండ్ డెంటల్ కాలేజ్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్’ దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ పమిడిఘంటం శ్రీనరసింహ, జస్టిస్ ఆలోక్ ఆరాధేలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఎన్‌ఎంసీ తరఫున న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. గతేడాది డిసెంబరులో ప్రారంభమైన కౌన్సెలింగ్ ప్రక్రియ నేటికీ కొనసాగుతోందన్నారు. ఇప్పటికే ఐదు నుంచి ఎనిమిది రౌండ్ల కౌన్సెలింగ్ పూర్తయిందన్నారు. దేశవ్యాప్తంగా ఇంకా 377 సీట్లు మిగిలిపోయాయని, అవన్నీ విద్యార్థులు ఆసక్తి చూపని(డిమాండ్ లేని) సబ్జెక్టులకు సంబంధించినవని తెలిపారు. దీంతో ఈ పరిస్థితిలో ‘ఉత్తమంగా ఏం చేయగలం?’ అని న్యాయవాదులను ధర్మాసనం ప్రశ్నించింది. సంబంధిత డాక్యుమెంట్లు, గత సుప్రీంకోర్టు తీర్పులను పరిశీలిస్తామని తెలిపింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.