వరంగల్ నిట్ విద్యార్థికి 1.27 కోట్ల ప్యాకేజీ
ABN , Publish Date - Jun 25 , 2026 | 03:13 AM
దేశంలోని ప్రముఖ ఇంజనీరింగ్ విద్యాసంస్థల్లో ఒకటైన వరంగల్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్‌ఐటీ) విద్యార్థులు క్యాంపస్ ...
2025-26 ప్లేస్‌మెంట్ సీజన్‌లో ఉద్యోగాల పంట
హనుమకొండ, జూన్ 24(ఆంధ్రజ్యోతి): దేశంలోని ప్రముఖ ఇంజనీరింగ్ విద్యాసంస్థల్లో ఒకటైన వరంగల్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్‌ఐటీ) విద్యార్థులు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో అదరగొట్టారు. 2025- 26 సీజన్‌లో అండర్ గ్రాడ్యుయేట్(యూజీ), పోస్టు గ్రాడ్యుయేట్(పీజీ) విద్యార్థులు అత్యుత్తమ ప్యాకేజీలు సాధించారు. సీఎస్ఈ విద్యార్థి నయన్ త్యాగి అత్యధికంగా రూ.1.27 కోట్ల వార్షిక వేతన ప్యాకేజీ పొందాడు. మరో విద్యార్థి నశ్వాన్‌కు రూ.కోటి ప్యాకేజీ లభించింది. ఆరుగురు విద్యార్థులు రూ.70 లక్షలకుపైగా వేతన ఆఫర్లను పొందారు. 27 మందికి రూ.50 లక్షలు, 130 మందికి రూ.30 లక్షల ప్యాకేజీలు పొందారు. యూజీ విద్యార్థులకు సగటున రూ.18.54 లక్షలు, మధ్యస్థ (మీడియన్) ప్యాకేజీ రూ.15 లక్షలు లభించాయి. పీజీ విద్యార్థులకు సగటున రూ.12.13 లక్షలు, మధ్యస్థంగా రూ.9 లక్షల ప్యాకేజీలు లభించాయి. ఆఫ్ క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లు, ఉన్నత విద్యలో చేరిన విద్యార్థులను పరిగణనలోకి తీసుకుంటే యూజీ ప్లేస్‌మెంట్ రేటు 95 శాతం, పీజీలో 80 శాతానికి పైగా ఉంటుందని నిట్ వర్గాలు తెలిపాయి. ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను ఎన్‌ఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుధి అభినందించారు.