Share News

రాయలసీమ ద్రోహి జగనే

ABN , Publish Date - Feb 27 , 2026 | 02:50 AM

రాయలసీమలోని ప్రాజెక్టులకు ఐదేళ్లలో ఒక్క రూపాయీ ఖర్చు చేయని జగనే సీమకు నిజమైన ద్రోహి అని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు.

రాయలసీమ ద్రోహి జగనే

  • వెలిగొండ పూర్తికాకుండానే జాతికి అంకితం

  • ఇప్పుడు అదే ప్రాజెక్టుకు నిధులు అడుగుతున్నారు

  • శాసనసభలో నిమ్మల రామానాయుడు మండిపాటు

అమరావతి, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): రాయలసీమలోని ప్రాజెక్టులకు ఐదేళ్లలో ఒక్క రూపాయీ ఖర్చు చేయని జగనే సీమకు నిజమైన ద్రోహి అని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. ప్రాజెక్టులు కొట్టుకుపోతుంటే పట్టించుకోకుండా తాడేపల్లి ప్యాలె్‌సలో మొద్దు నిద్రపోయిన జగన్‌ కాకుండా సీమకు ఎవరు ద్రోహి అవుతారని ప్రశ్నించారు. సాగునీటి రంగానికి బడ్జెట్‌లో చేసిన కేటాయింపులపై గురువారం శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘గోదావరి జలాలను కృష్ణాకు తేవాలని అప్పట్లో సీఎం చంద్రబాబు పట్టిసీమ ప్రారంభిస్తే ఇదే సభలో హేళన చేశారు. పట్టిసీమ వల్ల 13.08 లక్షల ఎకరాల స్థిరీకరణ జరిగింది. ఎగువ జలాలను శ్రీశైలం నుంచి రాయలసీమకు వినియోగించాం. ఇప్పుడూ ముందుచూపుతోనే నల్లమలసాగర్‌ ప్రాజెక్టుకు రూపకల్పన జరుగుతోంది. మధ్యలో ప్రభుత్వం మారకపోతే 2021 నాటికే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేది. రాయలసీమ ఎత్తిపోతలపై మాట్లాడే నైతికత వైసీపీకి లేదు. గత ప్రభుత్వంలోనే ఈ ప్రాజెక్టుకు ఎన్జీటీ అభ్యంతరం చెప్పింది. అయినా కేవలం మట్టి పనులు చేసి రూ.900 కోట్లు జేబులో వేసుకున్నారు. హంద్రీనీవా సుజల స్రవంతికి ఐదేళ్లలో ఒక్క రూపాయీ ఖర్చు చేయలేదు. చివరికి మోటార్ల విద్యుత్‌ బిల్లులూ కూటమి ప్రభుత్వమే చెల్లించింది. తుంగభద్ర డ్యామ్‌ నిర్వహణ లోపం కారణంగా గేటు కొట్టుకుపోయింది. మా ప్రభుత్వం వచ్చాక గేటు బిగించాం. అన్నమయ్య డ్యామ్‌ మొత్తం కొట్టుకుపోయినా స్పందించకపోతే, ఇప్పుడు గేట్లు పెట్టడానికి నిధులు కేటాయించాం. వెలిగొండ ఫీడర్‌ కాలువ పనులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అసలు ఈ కాలువే లేకుండా గత ప్రభుత్వంలో సీఎం జగన్‌ ప్రాజెక్టు పూర్తయ్యిందని జాతికి అంకితం ఇచ్చారు. పూర్తికాని ప్రాజెక్టును జాతికి అంకితం ఎలా ఇస్తారో ఆయనకే తెలియాలి. విచిత్రంగా అదే ప్రాజెక్టుకు ఎక్కువ నిధులు కేటాయించాలని వైసీపీ నేతలు ఇప్పుడు డిమాండ్‌ చేస్తున్నారు’ అని అన్నారు. కాగా, విద్యుత్‌ లైన్‌మెన్ల పోస్టుల నియామకానికి చర్యలు తీసుకుంటామని మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ చెప్పారు. డిస్కంల వద్ద ఉన్న విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫారాల నిల్వల వివరాలు వెల్లడించారు.


సాగునీటిపై చర్చలో ఎమ్మెల్యేలు

  • ఎన్టీటీ అభ్యంతరం చెబుతుందని తెలిసినా.. కావాలనే రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టారు. మట్టి పనులు చేసి దోపిడీ చేశారు. సీమకు మరణశాసనం రాసిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులకు పెద్దిరెడ్డి కంపెనీ తెలంగాణలో టెండర్లు దాఖలు చేసింది. వారే దానివల్ల ఏపీకి నష్టం అంటారు. మళ్లీ అదే ప్రాజెక్టుకు టెండర్లు వేశారు అంటే సీమపై ఎంత ప్రేమ ఉందో అర్థంచేసుకోవచ్చు

    - భూమా అఖిలప్రియ

  • వైసీపీ జీవో 365 ద్వారా వందల ప్రాజెక్టులను ప్రీక్లోజ్‌ చేసింది. నీటిపారుదలలో గత ప్రభుత్వం చేసిన రూ.5వేల కోట్ల అప్పులను ఈ ప్రభుత్వం తీర్చింది. అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోతే జగన్‌ రెడ్‌ కార్పెట్‌పై పరిశీలనకు వెళ్లారు.

    - కామినేని శ్రీనివాస్‌

  • పెన్నా-గోదావరి ప్రాజెక్టును పూర్తిచేయాలి. ఈ ప్రాజెక్టు పూర్తయితే మా పెదకూరపాడు నియోజకవర్గంలో రైతుల ఆదాయం పెరుగుతుంది.

    - భాష్యం ప్రవీణ్‌

  • కూటమి ప్రభుత్వం కొంతమేర చెరువులు నింపితేనే మా రాయలసీమ పచ్చగా కళకళలాడుతోంది. అదే పూర్తిస్థాయిలో సాగునీరు అందితే రాష్ర్టానికే రాయలసీమ అప్పు ఇస్తుంది. గత ప్రభుత్వంలో వ్యంగ్యంగా పర్సెంటా అర పర్సెంటా అని మాట్లాడారు. చివరికి ప్రాజెక్టులు పూర్తిచేయలేదు.

    - జేసీ అస్మిత్‌రెడ్డి

  • అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతే ఐదేళ్లపాటు పట్టించుకోని దాన్ని ప్రభుత్వం అనాలా? ప్రాజెక్టుల నిర్వహణకు కూడా నిధులు ఇవ్వలేదు.

    - జ్యోతుల నెహ్రూ

  • వైసీపీ పాలనలో సాగునీరు లేక వ్యవసాయం కుంటుపడింది. 200కు పైగా ప్రాజెక్టులు ముందే మూసివేశారు. వైకుంఠపురం- నకిరేకల్‌ ప్రాజెక్టును పూర్తిచేయాలి.

    - ప్రత్తిపాటి పుల్లారావు

Updated Date - Feb 27 , 2026 | 02:52 AM