‘వెలిగొండ’పై జగన్ అబ్రకదబ్ర మాయ!
ABN , Publish Date - Apr 08 , 2026 | 04:03 AM
ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాల్సిన వెలిగొండ ప్రాజెక్ట్‌ను జగన్ తన తుగ్లక్ చర్యలతో అంధకారంలోకి నెట్టారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు.
పూర్తి చేశామంటూ జాతికి అంకితం చేయడం విడ్డూరం: మంత్రి నిమ్మల
మార్కాపురం, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాల్సిన వెలిగొండ ప్రాజెక్ట్‌ను జగన్ తన తుగ్లక్ చర్యలతో అంధకారంలోకి నెట్టారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన మార్కాపురం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్ట్ పనుల పురోగతిని పరిశీలించి, అధికారులతో సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. వెలిగొండ పూర్తయిందంటూ జాతికి అంకితం పేరుతో జగన్ అబ్రకదబ్ర మాయలు చేశారని మండిపడ్డారు. గత 21 నెలలుగా వెలిగొండ పనులను పలు ఇబ్బందులు ఉన్నప్పటికీ.. పరుగులు పెట్టిస్తున్నా పూర్తికావడానికి ఇంకా సమయం పడుతుందని చెప్పారు. ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటర్, రిటైనింగ్ వాల్, వింగ్స్‌కు సంబంధించి 70 శాతం పని పూర్తి చేశామని మంత్రి తెలిపారు. త్వరలోనే నిర్వాసితుల ఖాతాల్లో ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ నగదు జమ చేస్తామని ప్రకటించారు. ఈ ఏడాది జూన్ నాటికి ప్రాజెక్ట్ పూర్తిచేయబోతున్నామని చెప్పారు. కాగా, మంగళవారం ఉదయం శ్రీశైల మల్లన్న దర్శనం అనంతరం మంత్రి నిమ్మల టూరిజం బోటులో దాదాపు 2గంటలు ప్రయాణం చేసి శ్రీశైలం బ్యాక్ వాటర్ పాయింట్ అయిన కొల్లం వాగు వద్దకు చేరారు. అక్కడ వెలిగొండ హెడ్ రెగ్యులేటర్, షట్టర్లు అమర్చిన తీరును పరిశీలించారు. ఆ తర్వాత టన్నెల్ లోపల బురద నీటి మద్య కొంతదూరం నడుచుకుంటూ వెళ్లి లైనింగ్ పనులను చూశారు. టన్నెల్ లోపల 18.8 కిలోమీటర్ల దూరం ప్రత్యేక వాహనంలో ప్రయాణించి దోర్నాల మండలం కొత్తూరు సమీపంలో బయటకు వచ్చారు.