Share News

సర్కారు బడి.. భళా!

ABN , Publish Date - Jun 14 , 2026 | 04:30 AM

ల్యాబ్‌లు, యాంఫీ థియేటర్‌, ఇండోర్‌ స్టేడియం, ఓపెన్‌ జిమ్‌, రన్నింగ్‌ ట్రాక్‌... వీటన్నింటికీ మించి చక్కటి డిజిటల్‌ క్లాస్‌రూమ్‌లు! ఒక్కముక్కలో చెప్పాలంటే... ఇంటర్నేషనల్‌ స్కూల్‌కు మించిన..

సర్కారు బడి.. భళా!

  • రాజధాని గ్రామంలో అద్భుతమైన పాఠశాల

  • ఇంటర్నేషనల్‌ స్కూల్‌ను తలపించేలా వసతులు

  • మంగళగిరి నియోజకవర్గం నిడమర్రులో నిర్మాణం

అల్లంత దూరం నుంచి చూడగానే ఆకర్షిస్తుంది!అడుగు లోపల పెట్టగానే ఆహా... అనిపిస్తుంది!ఇది కార్పొరేట్‌ స్కూలు కాదు... అచ్చంగా ప్రభుత్వ పాఠశాల అని తెలుసుకున్న వెంటనే ‘అద్భుతః’ అనే మాట వినిపిస్తుంది!అవును... ఇది మంగళగిరి నియోజకవర్గంలో, రాజధాని గ్రామమైన నిడమర్రులోని జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ ప్రాంగణం! రాష్ట్రంలో అత్యుత్తమ ప్రమాణాలతో ఏర్పాటైన మొట్టమొదటి మోడల్‌ స్కూల్‌! విద్యాశాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే లోకేశ్‌ నియోజకవర్గంలో ఏర్పాటైన ఒక ఉత్తమ పాఠశాల భవనం విశేషాలివి...

(మంగళగిరి - ఆంధ్రజ్యోతి)

ల్యాబ్‌లు, యాంఫీ థియేటర్‌, ఇండోర్‌ స్టేడియం, ఓపెన్‌ జిమ్‌, రన్నింగ్‌ ట్రాక్‌... వీటన్నింటికీ మించి చక్కటి డిజిటల్‌ క్లాస్‌రూమ్‌లు! ఒక్కముక్కలో చెప్పాలంటే... ఇంటర్నేషనల్‌ స్కూల్‌కు మించిన హంగులు, ప్రమాణాలు! ఇవన్నీ... నిడమర్రు జిల్లా పరిషత్‌ హైస్కూల్‌కు సొంతం! గత వేసవిలో మొదలైన ఈ పాఠశాల భవన నిర్మాణ పనులు ఇప్పుడు దాదాపుగా పూర్తయ్యాయి. గత విద్యాసంవత్సరం నుంచే ఈ మోడల్‌ స్కూల్‌లో విద్యాబోధన ప్రారంభించినప్పటికీ... ఈ సంవత్సరం నుంచి తొలిసారిగా, పూర్తిస్థాయిలో పని చేసేందుకు సిద్ధమైంది. విద్యార్థులకు స్వాగతం పలుకుతోంది.

ఉత్తమ బోధనకు వేదిక

రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఓ మోడల్‌ స్కూల్‌ను ఏర్పాటు చేయాలన్నది విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ ప్రణాళిక! గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లోనే కార్పొరేట్‌ స్థాయి నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ ముఖ్యోద్దేశం. ఇందులో భాగంగా తొలిదశలో 40 మోడల్‌ స్కూల్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటన్నింటికీ పైలట్‌ ప్రాజెక్టుగా నిడమర్రు జడ్పీ హైస్కూల్‌ను ఎంచుకున్నారు. ఈ హైస్కూల్‌ను 5.02 ఎకరాల విస్తీర్ణంలో రూ. 16 కోట్ల వ్యయంతో నిర్మించారు. సీబీఎస్ఈ సిలబస్‌, ఇంగ్లీషు మీడియం, డిజిటల్‌ లెర్నింగ్‌కు వేదికగా మార్చారు. ఇప్పుడు మంగళగిరి, తాడేపల్లి, తుళ్లూరు ప్రాంతాల నుంచి ఈ మోడల్‌స్కూల్‌లో అడ్మిషన్ల కోసం పోటీ పడుతున్నారు. ఒక్క సీటుకు 15 మంది చొప్పున దరఖాస్తు చేసుకున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.


సకల వసతుల సమాహారం..

నిడమర్రు మోడల్‌ స్కూల్‌లో అడుగుపెట్టగానే ‘ఎంత బాగుందో’ అనే మాటే వినిపిస్తుంది. మోడ్రన్‌ స్కూల్‌కు ఘనంగా స్వాగతంపలికేలా చక్కటి ప్రవేశ ద్వారం నిర్మించారు. దీనికి కుడివైపు చిన్నపిల్లల ప్లే గ్రౌండ్‌ పచ్చిక బయళ్లతో ఆహ్లాదంగా కనిపిస్తుంది. అటువైపే ఏడు రకాల క్రీడా పరికరాలతో కూడిన చిల్డ్రన్స్‌ పార్కు రారమ్మని పిలుస్తుంది. వాటివెంబడే పరిపాలనా భవనం ఉంది. ప్రవేశద్వారానికి ఎడమవైపు అందమైన బాటలో ఓపెన్‌ యాంఫీ థియేటర్‌... దానినిదాటి ముందుకు వెళ్తే ఓపెన్‌ జిమ్‌ కనిపిస్తాయి. ఇంకా... బాస్కెట్‌బాల్‌, బాల్‌ బ్యాడ్మింటన్‌, వాలీబాల్‌ వంటి క్రీడల కోసం బహుళ అంతస్తుల ఇండోర్‌ స్టేడియం నిర్మించారు. ఇందులో సుమారు 400 మంది క్రీడలను వీక్షించే వెసులుబాటును కల్పించారు. మరో పక్క క్రికెట్‌ ప్రాక్టీస్‌ కోసం నెట్‌లతో కూడిన మైదానాన్ని తీర్చిదిద్దారు. స్కూల్‌ గ్రౌండు మధ్యలో ఉన్న ఫుట్‌బాల్‌ లేదా క్రికెట్‌ మైదానం వీటన్నింటికీ హైలైట్‌. దీనిచుట్టూ 200 మీటర్ల రన్నింగ్‌ట్రాక్‌, వాకింగ్‌ట్రాక్‌లను అద్భుతంగా తీర్చిదిద్దారు. పాఠశాల భవనాన్ని ఇంగ్లీషు అక్షరం ‘యూ’ ఆకారంలో, రెండంతస్తుల్లో నిర్మించారు. లిఫ్టు సదుపాయం కూడా ఏర్పాటు చేశారు. మొత్తం 28 తరగతి గదులు! భవనం నడుమ కళావేదిక కనువిందు చేసేలా ఉంది. భద్రతకు పెద్దపీట వేస్తూ 40 సీసీ కెమెరాలు అమర్చారు. డైనింగ్‌ హాలు, స్టాఫ్‌ రూమ్‌లు, కంఫ్యూటర్‌ ల్యాబ్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ ల్యాబ్‌లనూ ఏర్పాటు చేశారు. విద్యార్థుల్లో శాస్త్ర సాంకేతిక, ఆవిష్కరణ నైపుణ్యాలను పెంపొందించేలా అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌ కూడా నిడమర్రు మోడల్‌ స్కూల్‌లో సిద్ధమైంది.

Updated Date - Jun 14 , 2026 | 04:31 AM