11 మంది ఉగ్రవాద సానుభూతిపరులు ఎన్‌ఐఏ కస్టడీకి
ABN , Publish Date - Jun 09 , 2026 | 04:30 AM
ఇటీవల అరెస్టయి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న 11 మంది ఉగ్రవాద సానుభూతిపరులను సోమవారం ఎన్‌ఐఏ కస్టడిలోకి తీసుకుంది.
రాజమహేంద్రవరంలో 5 రోజులు విచారణ
రాజమహేంద్రవరం సిటీ, జూన్ 8(ఆంధ్రజ్యోతి): ఇటీవల అరెస్టయి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న 11 మంది ఉగ్రవాద సానుభూతిపరులను సోమవారం ఎన్‌ఐఏ కస్టడిలోకి తీసుకుంది. ఏపీతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన వీరిని 5 రోజుల పాటు విచారించనుంది. అల్‌ఖైదా, ఐఎస్ఐఎస్ ఉగ్రవాద భావజాలానికి ఆకర్షితులై సోషల్ మీడియా వేదికగా దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్న కొంతమందిని మార్చిలో విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో 11 మందిని రిమాండ్‌పై రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. తొలుత ఈ కేసులో ప్రధాన నిందితుడు, విజయవాడకు చెందిన రెహ్మతుల్లా షరీఫ్ అహ్మద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. తర్వాత ఎండీ అనిష్(ఏ2-విజయవాడ), సోహెల్‌బేగ్(ఏ3-విజయవాడ), సాద్‌సూన్ దిల్‌ఖాసీ(ఏ4-బిహర్), సయ్యద్ బేగం(ఏ5-హైదరాబాద్), ఒక బాలుడు(ఏ6-హైదరాబాద్), లక్కిఅహ్మద్(ఏ7-ఢిల్లీ), జీశాన్ అబ్దుల్(ఏ9-రాజస్థాన్), మిర్‌షరీఫ్ అలీ(ఏ10-పశ్చిమబెంగాల్), అబ్దుల్ సలీమ్(ఏ11-కర్ణాటక), షారూక్‌ఖాన్(ఏ12-మహారాష్ట్ర), ఎస్‌కే ఫయాజ్ (ఏ13-మహారాష్ట్ర)లపై కేసులు నమోదు చేశారు. ఈ కేసును తిరిగి గత నెల 13న ఎన్‌ఐఏ రిజిష్టర్ చేసింది. ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న 11 మందిని తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టును ఆశ్రయించింది. ఇందుకు కోర్టు అనుమతించడంతో రాజమహేంద్రవరం మహిళా పోలీస్ స్టేషన్‌లో సోమవారం విచారణ ప్రారంభించింది. ఈ కేసుకు సంబంధించి నిందితుల తరపు న్యాయవాది అబూసలీం మీడియాతో మాట్లాడారు. నిందితులు ఉగ్రవాదులు అనడానికి ఎటువంటి ఆఽధారాలు లేవన్నారు.