విశాఖలో ఎన్‌ఐఏ కోర్టు ప్రారంభం
ABN , Publish Date - Sep 23 , 2026 | 07:50 AM
ఎన్‌ఐఏ(జాతీయ దర్యాప్తు సంస్థ) చట్టం కింద నమోదైన కేసులను విచారించేందుకు విశాఖపట్నంలో ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్‌ఐఏ చట్టం కింద నమోదైన కేసులన్నింటినీ ఇకపై ఈ కోర్టు విచారించనుంది
వర్చువల్‌గా ప్రారంభించిన జస్టిస్ బట్టు దేవానంద్
రాష్ట్రవ్యాప్తంగా నమోదయ్యే ఎన్‌ఐఏ కేసుల విచారణ ఇకపై ఈ కోర్టులోనే..
అమరావతి, విశాఖపట్నం, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): ఎన్‌ఐఏ(జాతీయ దర్యాప్తు సంస్థ) చట్టం కింద నమోదైన కేసులను విచారించేందుకు విశాఖపట్నంలో ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్‌ఐఏ చట్టం కింద నమోదైన కేసులన్నింటినీ ఇకపై ఈ కోర్టు విచారించనుంది. విశాఖపట్నం అడ్మినిస్ట్రేటివ్ జడ్జి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ మంగళవారం వర్చువల్‌గా ఈ కోర్టును ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాలు, కేంద్ర ప్రభుత్వ విధానపరమైన నిర్ణయంతో విశాఖలో ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు ఏర్పాటైందన్నారు. ఎన్‌ఐఏ కేసులు దేశ భద్రతతో ముడిపడి ఉన్న నేపథ్యంలో వాటిని వేగంగా విచారించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యేక కోర్టు ఏర్పాటుతో ఎన్‌ఐఏ కేసుల విచారణ వేగవంతమవుతుందని పేర్కొన్నారు. ఎన్‌ఐఏ కోర్టు బాధ్యతలు చేపడుతున్న న్యాయాధికారి శేషయ్యకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో హైకోర్టు రిజిస్ట్రార్(అడ్మినిస్ట్రేషన్) చిన్నంశెట్టి రాజు, విశాఖపట్నం జిల్లా ప్రధాన న్యాయాధికారి(పీడీజే) జి.శ్రీనివాస్, ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు న్యాయాధికారి డి.శేషయ్య, వివిధ కోర్టుల న్యాయాధికారులు, విశాఖ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నమ్మి సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.