ఏపీ, తెలంగాణలో ఎన్‌ఐఏ సోదాలు
ABN , Publish Date - Jul 09 , 2026 | 04:09 AM
ఆన్‌లైన్‌లో ఉగ్రవాద భావజాలాన్ని వ్యాపింపజేయడం, హింసాత్మక పద్ధతుల ద్వారా భారత ప్రభుత్వాన్ని కూలదోసి ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించడమే లక్ష్యంగా..
వీటితో పాటు మరో ఏడు రాష్ట్రాల్లో కూడా
భారత్‌లో ఇస్లామిక్ స్టేట్ ఏర్పాటే లక్ష్యంగా జరిగిన కుట్రల కేసులో చర్య
పలు డిజిటల్ పరికరాలు స్వాధీనం
కేసుకు మూలం విజయవాడలోనే
మార్చిలో ఐసిస్ మద్దతుదారు అరెస్టు
విజయవాడ అర్బన్, హైదరాబాద్, బళ్లారి, జూలై 8(ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్‌లో ఉగ్రవాద భావజాలాన్ని వ్యాపింపజేయడం, హింసాత్మక పద్ధతుల ద్వారా భారత ప్రభుత్వాన్ని కూలదోసి ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించడమే లక్ష్యంగా కుట్రలు జరుగుతున్నాయన్న కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) బుధవారం పలు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా ఉన్నాయి. వాటితో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బిహార్, రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీల్లోని 20 ప్రాంతాల్లో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. పలు డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం పంపించనున్నారు. ఈ కేసులో ఎన్‌ఐఏ ఇప్పటికే ఓ బాలుడు సహా 12 మందిని అరెస్టు చేసింది. వీరంతా ఇస్లామిక్ స్టేట్, అల్ ఖైదా మద్దతుదారులని, భారత్‌లో ఉగ్రవాద భావజాలాన్ని విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపింది. వాస్తవానికి ఈ వ్యవహారం విజయవాడలోనే బయటకు వచ్చింది. విజయవాడలో ఉండే రహ్మతుల్లా షరీఫ్ విదేశాల్లోని వ్యక్తులతో క్రిప్టో విధానంలో లావాదేవీలు చేస్తుండటంతో ఏపీ కౌంటర్ ఇంటలిజెన్స్ పోలీసులకు అనుమానం వచ్చి అతన్ని మార్చిలో అదుపులోకి విచారించగా ఉగ్ర నెట్‌వర్క్ బయటపడింది. అప్పుడే... డానిష్, మీర్జా సొహైల్ అనే ఇద్దరు యువకులను అరెస్టు చేశారు. తర్వాత ఈ కేసుపై ఎన్‌ఐఏ దర్యాప్తు చేపట్టింది. ఈ నెట్‌వర్క్‌లో ఉన్నవాళ్లంతా క్యాబ్ డ్రైవర్లుగా, హోటళ్లలో పనిచేస్తూ ఉగ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఎన్‌ఐఏ తెలిపింది.
విజయవాడ పాత బస్తీలో ఆకస్మిక తనిఖీలు
విజయవాడలోని పలు ప్రాంతాల్లో బుధవారం తెల్లవారుజామున 5 గంటల నుంచి ఎన్‌ఐఏ ప్రత్యేక బృందాలు ఏకకాలంలో ఆకస్మిక సోదాలు ప్రారంభించాయి. నగరంలోని వించిపేట (గాంధీబొమ్మ సెంటర్), పంజా సెంటర్, చిట్టినగర్, భవానీపురం వంటి పాతబస్తీ ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేశారు. ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయవాడలోని మహ్మద్ డానిష్, సుహైల్ బేగ్, మహ్మద్ రహంతుల్లా షరీఫ్ నివాసాల్లో సోదాలు నిర్వహించారు. పలు మొబైల్ ఫోన్లు, ఆన్‌లైన్ ఉగ్ర నెట్‌వర్క్‌కు సంబంధించిన కీలకమైన డిజిటల్ డేటాను సేకరించారు. నిందితుల కుటుంబ సభ్యుల స్టేట్‌మెంట్లు రికార్డు చేశాయి.
బళ్లారిలోనూ సోదాలు
కర్ణాటకలోని బళ్లారి పట్టణం కౌల్‌బజార్ ప్రాంతానికి చెందిన అబ్దుల్ సలాంకు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై అతడి ఇంట్లో బుధవారం ఎన్‌ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. డీఎస్పీ రాజన్ నేతృత్వంలో అబ్దుల్ సలాం ఇంట్లో అతడి భార్య, పిల్లలు, ఇరుగుపొరుగు వారితో లోతుగా విచారణ చేశారు. ఉగ్రవాదాన్ని ప్రేరేపించే పాటలు, మాటల వీడియో, ఆడియో రికార్డులతోపాటు కొన్ని కీలక ఆధారాలను ఎన్‌ఐఏ అధికారులు.. అబ్దుల్ సలాం ఇంట్లో స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.