అదే నిజమైతే దారుణమైన హక్కుల ఉల్లంఘనే!
ABN , Publish Date - Jun 27 , 2026 | 04:05 AM
గాదె సాయికృష్ణ మృతిపై సమగ్ర నివేదిక సమర్పించాలని జాతీయ మానవహక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) ఆదేశించింది. ఈ మేరకు డీజీపీ, విజయవాడ పోలీస్ కమిషనర్‌కు శుక్రవారం నోటీసులు జారీ చేసింది.
రక్షకులు భక్షకులైనట్లే
సాయికృష్ణ మృతిపై సమగ్ర నివేదిక ఇవ్వండి
డీజీపీ, సీపీకి ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు
వారంలోగా చర్యల రిపోర్టుకు ఆదేశం
కారకులైన పోలీసు అధికారులెవరు?
స్టేషన్ ఫుటేజీ రికవరీకి తీసుకున్న చర్యలేంటి?
తల్లి, ఇతర సాక్షుల భద్రతకు చేపట్టిన చర్యలేంటి?
మృతుడి కుటుంబానికి పరిహారం ఇచ్చారా?
ఈ వివరాలతో నివేదిక సమర్పణకు ఆదేశం
న్యూఢిల్లీ/అమరావతి, జూన్ 26(ఆంధ్రజ్యోతి): గాదె సాయికృష్ణ మృతిపై సమగ్ర నివేదిక సమర్పించాలని జాతీయ మానవహక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) ఆదేశించింది. ఈ మేరకు డీజీపీ, విజయవాడ పోలీస్ కమిషనర్‌కు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. వారం రోజులోగ్గా చర్యల నివేదిక సమర్పించాలని ఆదేశించింది. సాయికృష్ణను కృష్ణలంక పోలీసు స్టేషన్ సిబ్బంది అక్రమంగా అపహరించారని.. కస్టడీలో చిత్రహింసలకు గురిచేశారని, ఆ కారణంగా ఆయన మరణించాడని తమకు ఫిర్యాదు అందినట్లు తెలిపింది. ‘ఈ నేరాన్ని దాచేందుకు కొందరు పోలీసు అధికారులు మృతదేహాన్ని ద్విచక్ర వాహనంపై శ్మశానానికి తీసుకెళ్లి.. కాల్చి అవశేషాలను నదిలో కలిపినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కృష్ణలంక సీఐ నాగరాజు, ఈ వ్యవహారంలో పాత్ర ఉన్న ఇతరులను కఠినంగా శిక్షించాలని కోరారు. పోలీసు స్టేషన్ సీసీటీవీ ఫుటేజీని భద్రపరచాలని.. ఈ వ్యవహారంలో స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని అభ్యర్థించారు. ఈ ఘటనపై మీడియాలో వచ్చిన వార్తలను కమిషన్ పరిగణనలోకి తీసుకుంది. సిట్.. తన ప్రాథమిక విచారణలో కస్టోడియల్ మరణం చోటుచేసుకున్నట్లు పేర్కొంది. ప్రధాన నిందితుడు నాగరాజును సస్పెండ్ చేసి, జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. పోలీసుస్టేషన్ సీసీటీవీ రికార్డింగ్ మాయమైనట్లు తెలుస్తోంది. ‘‘నీ కొడుక్కి దండ కొనుక్కో’ అని సీఐ నాగరాజు చేసిన వ్యాఖ్యలను సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన వాంగ్మూలాన్ని మీడియా ప్రముఖంగా ప్రస్తావించింది.
ఫిర్యాదులోని అంశాలు, మీడియాలో వచ్చిన వార్తలు వాస్తవమే అయితే.. ఇది దారుణమైన మానవ హక్కుల ఉల్లంఘనే. అక్రమ నిర్బంధం, చిత్రహింసలు, కస్టోడియల్ డెత్.. రాజ్యాంగం ప్రసాదించిన అత్యంత విలువైన జీవించే హక్కుపై ప్రత్యక్ష, క్రూర దాడే. పోలీసులపై వచ్చిన ఆరోపణలు.. అధికార దుర్వినియోగం, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ సంస్థలపై నమ్మకం కోల్పోవడాన్ని ప్రతిబింబిస్తున్నాయి. సంరక్షకులు కుట్రదారులయ్యారు. వారి చర్యలు దేశీయ చట్టాల ఉల్లంఘనే కాకుండా.. భారత్ కట్టుబడి ఉన్న అంతర్జాతీయ మానవ హక్కుల ఒప్పందాలకు విరుద్ధం’ అని కమిషన్ అభిప్రాయపడింది. ఆరోపణల తీవ్రత దృష్ట్యా డీజీపీకి, విజయవాడ పోలీసు కమిషనర్‌కు నోటీసులు జారీచేయాలని ఆదేశించింది. వారు వారంలోగా సమగ్ర చర్యల నివేదికను సమర్పించాలని తేల్చిచెప్పింది. ‘ఆ నివేదికలో సిట్ దర్యాప్తు ప్రస్తుత స్థితి, సంబంధిత పోలీసు అధికారులపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ వివరాలను పేర్కొనాలి. సాయికృష్ణ అక్రమ నిర్బంధం, కస్టడీ హింస, మరణం, మృతదేహం తరలింపునకు బాధ్యులైన పోలీసు అధికారుల వివరాలు చెప్పాలి. సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నాగరాజు, ఇతరులపై తీసుకున్న శాఖాపరమైన, క్రిమినల్ చర్యల స్థితిగతులను నివేదికలో తెలియజేయాలి. కృష్ణలంక పోలీసు స్టేషన్ నుంచి తొలగించిన సీసీటీవీ ఫుటేజీ రికవరీకి, బాధితుడి మృతదేహ అవశేషాలను కనుగొనడానికి తీసుకున్న చర్యలను వివరించాలి. మృతుడి తల్లి గాదె విజయలక్ష్మి, ఇతర సాక్షుల భద్రతకు తీసుకున్న చర్యలు, మృతుడి కుటుంబానికి అందించిన మధ్యంతర పరిహారం లేదా సహాయం వివరాలను నివేదికలో పేర్కొనాలి’ అని ఆదేశించింది.