కల్తీ పాల ఘటనపై ఎన్‌హెచ్చార్సీ విచారణ
ABN , Publish Date - Mar 27 , 2026 | 05:05 AM
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి పలువురు మృతిచెందిన ఘటనను జాతీయ మానవ హక్కుల కమిషన్ ..
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి నోటీసులు
న్యూఢిల్లీ, మార్చి 26(ఆంధ్రజ్యోతి): తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి పలువురు మృతిచెందిన ఘటనను జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్చార్సీ) సుమోటోగా విచారణకు స్వీకరించింది. లాలాచెరువు, చౌడేశ్వరీనగర్, స్వరూ్‌పనగర్ ప్రాంతాల్లో కల్తీ పాలు తాగటం వల్ల ఇప్పటివరకు 16 మంది మరణించినట్లు మీడియాలో వచ్చిన వార్తా కథనాల ఆధారంగా విచారణకు స్వీకరించినట్లు ఎన్‌హెచ్చార్సీ తెలిపింది. మీడియా కథనాల ప్రకారం.. పాలల్లో విషపూరిత రసాయన ఇథిలీన్ గ్లైకాల్ కలవటం వల్ల బాధితుల శరీరంలోని పలు అవయవాల పనితీరు దెబ్బతిన్నట్లు తెలుస్తోందని, వార్తా కథనంలోని అంశాలు నిజమైతే, బాధితుల మానవ హక్కుల ఉల్లంఘన జరిగినట్లేనని కమిషన్ తెలిపింది. రెండు వారాల్లోగా ఈ ఘటనపై పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్), డీజీపీలకు నోటీసులు జారీ చేసింది. బాధితుల ఆరోగ్య పరిస్థితి, దర్యాప్తు వివరాలు, మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు నష్ట పరిహారం చెల్లింపు వివరాలను నివేదికలో పొందుపరచాలని ఎన్‌హెచ్చార్సీ ఆదేశించింది.