ఓవర్ లోడ్ వాహనాలపై.. భారీ బాదుడు
ABN , Publish Date - Apr 15 , 2026 | 04:49 AM
లారీలు, ట్రక్‌లు, ఇతర భారీ వాహనాలు నిర్దేశిత లోడ్‌కు మించిన బరువుతో జాతీయ రహదారులపైకి వస్తే భారీ ఫీజులు వసూలు చేయాలని కేంద్రం ఆదేశించింది.
10శాతం కంటే మించితే రెండు రెట్లు రుసుము
40 శాతం కంటే ఎక్కువ ఉంటే 4 రెట్లు
ఉత్తర్వులు జారీ చేసిన ఎన్‌హెచ్‌ఏఐ
అమరావతి, ఏప్రిల్ 14(ఆంధ్రజ్యోతి): లారీలు, ట్రక్‌లు, ఇతర భారీ వాహనాలు నిర్దేశిత లోడ్‌కు మించిన బరువుతో జాతీయ రహదారులపైకి వస్తే భారీ ఫీజులు వసూలు చేయాలని కేంద్రం ఆదేశించింది. ఏ వాహనంలో అయినా పరిమితికి మించి 10 శాతం వరకూ అదనంగా లోడ్ ఉంటే ఈ ఫీజుల నుంచి మినహాయింపు ఇస్తారు. అంతకంటే బరువు ఎక్కువగా ఉంటే భారీగా ఫీజులు వసూలు చేసేలా కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ (మోర్త్) ఉత్తర్వులు జారీ చేసింది. నిర్దేశిత లోడ్ కంటే 10 శాతం నుంచి 40 శాతం వరకూ ఎక్కువగా ఉంటే సాధారణ టోల్ ఫీజు కంటే రెండు రెట్లు, 40 శాతం కంటే అదనంగా ఉంటే నాలుగు రెట్ల చొప్పున ఫీజు వసూలు చేయనున్నారు. ఈ జరిమానా మొత్తాన్ని ఆయా వాహనాలకు ఉండే ఫాస్టాగ్ నుంచి లేదా డిజిటల్ చెల్లింపుల ద్వారా వసూలు చేయాలని మోర్త్ జాయింట్ సెక్రటరీ చేతన్ ఆనంద్‌సింగ్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.