NH 544G Guinness Record: రహదారి నిర్మాణంలో రెండు గిన్నిస్ రికార్డులు
ABN , Publish Date - Jan 08 , 2026 | 05:45 AM
బెంగుళూరు-కడప-విజయవాడ ఎకనమిక్ కారిడార్‌లో భాగంగా నిర్మిస్తున్న జాతీయ రహదారి 544జీ.. గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కింది.
ఎన్‌హెచ్ 544జీలో రాజ్‌పథ్ ఇన్‌ఫ్రాకాన్ ఘనత
బెంగుళూరు-కడప-విజయవాడ ఎకనమిక్ కారిడార్‌లో భాగంగా నిర్మిస్తున్న జాతీయ రహదారి 544జీ.. గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కింది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) ఆధ్వర్యంలో రాజ్‌పథ్ ఇన్‌ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ రోడ్డు నిర్మాణ పనులు చేస్తోంది. ఈ క్రమంలో నాలుగు గిన్నిస్ రికార్డులు నెలకొల్పడమే లక్ష్యంగా ఈ నెల 5న పనులు చేపట్టిన ఈ సంస్థ వాటిలో రెండు రికార్డులను బుధవారం సాధించింది. 24 గంటల వ్యవధిలో 28.95 కి.మీ. తారు రోడ్డు నిర్మించడం, ఇదే సమయంలో 10,675 మెట్రిక్ టన్నుల బిటుమినస్ కాంక్రీట్ (కంకర, తారు)ను ఉపయోగించడంతో రెండు గిన్నిస్ రికార్డులు సొంతమయ్యాయి. ఈ రికార్డులకు శ్రీసత్యసాయి జిల్లా వేదికైంది. పుట్టపర్తి మండలం వంకరకుంట-సాతార్లపల్లి మధ్య బీటీ రోడ్డు నిర్మాణంలో భగంగా ఈ రికార్డు సాధించారు.
సీఎం చంద్రబాబు అభినందన
కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ నేతృత్వంలో ఎన్‌హెచ్‌ఏఐ, రాజ్‌పథ్ ఇన్‌ఫ్రాకాన్ రెండు గిన్నిస్ రికార్డులను సాధించడం అభినందనీయమని సీఎం చంద్రబాబు ఎక్స్‌లో అభినందించారు. ఇంజనీరింగ్, కార్మిక సిబ్బంది నిబద్ధతతో ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. శ్రీసత్యసాయి జిల్లా గిన్నిస్ రికార్డులకు వేదిక కావడం గర్వంగా ఉందని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరా రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
- పుట్టపర్తి రూరల్, ఆంద్రజ్యోతి