పెళ్లయి 24 గంటలు గడవక ముందే నవవధువు దుర్మరణం
ABN , Publish Date - May 15 , 2026 | 05:31 AM
వివాహం జరిగి 24 గంటలు కాలేదు.. కాళ్ల పారాణి ఆరలేదు. పెళ్లైన తరువాత పుట్టింట అడుగుపెట్టేందుకు భర్తతో కలిసి వస్తున్న నవ వధువును మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కబళించింది.
వరుడి నిద్రమత్తుతో అదుపు తప్పిన కారు
విశాఖలో ఘటన
అగనంపూడి (విశాఖపట్నం), మే 14(ఆంధ్రజ్యోతి): వివాహం జరిగి 24 గంటలు కాలేదు.. కాళ్ల పారాణి ఆరలేదు. పెళ్లైన తరువాత పుట్టింట అడుగుపెట్టేందుకు భర్తతో కలిసి వస్తున్న నవ వధువును మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కబళించింది. ఈ ఘటనలో వరుడు, ఆమె సోదరికి గాయాలు కాగా, తీవ్రంగా గాయపడిన ఆమె తల్లి ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. విశాఖ నగర శివారు అగనంపూడిలో గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. విశాఖపట్నం జిల్లా అగనంపూడి ఉక్కు నిర్వాసిత కాలనీ కొండయ్యవలసకు చెందిన నడుపూరు రామేశ్వరి (31)కి, అనకాపల్లి జిల్లా పరవాడ మండలం వాడచీపురుపల్లికి చెందిన ఈరుగుల నరసింగరావు (42)కు బుధవారం రాత్రి వరుడి ఇంటి వద్ద వివాహం జరిగింది. భర్తతో కలిసి పుట్టింటికి వచ్చేందుకు రామేశ్వరి, తల్లి కనకమహాలక్ష్మి, సోదరి వరలక్ష్మి కారులో బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న కారు ఉక్కు జనరల్ ఆస్పత్రి రహదారిలో అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొంది. ఆ సమయంలో నరసింగరావు డ్రైవింగ్ చేస్తున్నాడు. పెళ్లి కార్యక్రమాలతో నిద్ర లేక అతడికి కళ్లు మూతలు పడడంతో ప్రమాదం చోటుచేసుకుందంటున్నారు. ఈ ఘటనలో భర్త పక్కన కూర్చున్న రామేశ్వరి సంఘటనా స్థలంలోనే మృతిచెందింది. వెనుక సీట్లో కూర్చున్న ఆమె తల్లి కనకమహాలక్ష్మి(56)కి తీవ్రగాయాలవగా కేజీహెచ్‌కు తరలించారు. రామేశ్వరి భర్త నరసింగరావు, సోదరి వరలక్ష్మి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదంలో కారు ముందు భాగం దెబ్బతింది.