రేపటి నుంచి నూతన జడ్పీ పాలన
ABN , Publish Date - Sep 24 , 2026 | 12:01 AM
జిల్లాలో రేపటి నుంచి నూతన జడ్పీ పాలన ప్రారంభం కానుంది. ఉమ్మడి జిల్లా పరిషత కార్యాలయం పునర్విభజన ప్రక్రియలో భాగంగా నంద్యాల జడ్పీ ఖరారైంది.
28 మండలాలకు స్పెషల్ ఆఫీసర్ల నియామయం
ముగిసిన ఎంపీపీల పదవీ కాలం
నేటితో జడ్పీటీసీలదీ కూడా
25న జడ్పీ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు
నంద్యాల, సెప్టెంబరు23(ఆంధ్రజ్యోతి): జిల్లాలో రేపటి నుంచి నూతన జడ్పీ పాలన ప్రారంభం కానుంది. ఉమ్మడి జిల్లా పరిషత కార్యాలయం పునర్విభజన ప్రక్రియలో భాగంగా నంద్యాల జడ్పీ ఖరారైంది. జిల్లాలోని 28 మండలాలకు సంబంధించి ఎంపీపీల పదవీకాలం ముగిసింది. దీంతో కలెక్టర్ రాజకుమారి ఆయా స్థానాల్లో 28మంది(వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు)ని ప్రత్యేక అధికారులుగా నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. నేటితో జడ్పీటీసీల పదవి కాలం కూడా ముగియనుంది. కలెక్టర్ రాజకుమారి సైతం ఈనెల 25వ తేదిన నూతన జడ్పీ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించి జిల్లాలో జడ్పీ పాలన ప్రారంభించనున్నారు. నంద్యాల పట్టణంలోని ఎమ్మార్సీ కార్యాలయంలో తాత్కాలిక జడ్పీ కార్యాలయంగా గుర్తించారు. దీంతో రేపు ఈ కార్యాలయం నుంచి జడ్పీ సేవలు ప్రారంభమవుతాయి. కొందరు కీలక శాఖ అధికారులను దూర ప్రాంతాలకు చెందిన మండలాలకు ప్రత్యేక అధికారులుగా నియమించడంతో వారిలో కొంత అసంతృప్తి నెలకున్నట్లు తెలిసింది. అంతేకాకుండా నేడు జడ్పీ సీఈవో, డిప్యూటీ సీఈఓలను నియమించే అవకాశం ఉంది.