New Year Tragedy: నూతన సంవత్సర వేడుకల్లో విషాదం
ABN , Publish Date - Jan 02 , 2026 | 05:04 AM
నూతన సంవత్సర వేడుకల్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కర్నూలు జిల్లాలో విషాదం నెలకొంది.
కోనసీమ, కర్నూలు జిల్లాల్లో ముగ్గురు మృతి
అంతర్వేది బీచ్‌లో జీప్ మునిగి యువకుడు దుర్మరణం
ఓర్వకల్లు మండలంలో ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృత్యువాత
అంతర్వేది/ఓర్వకల్లు, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): నూతన సంవత్సర వేడుకల్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కర్నూలు జిల్లాలో విషాదం నెలకొంది. కోనసీమ జిల్లా అంతర్వేది బీచ్‌కు బుధవారం రాత్రి కాకినాడ పట్టణం ఇంద్రపాలేనికి చెందిన నిమ్మకాయల శ్రీధర్ (35), వాకలపూడికి చెందిన నందమూరి వెంకట సాయి నాగ గోపీకిషన్, పెద్దాపురానికి చెందిన బొండాడ సూర్యకిరణ్ వచ్చారు. సూర్యకిరణ్ రూముకు వెళ్లిపోగా. గోపీకిషన్, శ్రీధర్ మళ్లీ బీచ్‌లో థార్ వాహనంలో తిరుగుతూ, వీడియోలు తీసుకుంటూ మైమరిచిపోయారు. ఈ క్రమంలో గోదావరి, సముద్రం సంగమం అయిన అన్నాచెల్లెలు గట్టు వద్ద వాహనం నీళ్లలోకి దూసుకెళ్లింది. ఈ పరిణామంతో ఇద్దరూ షాక్‌కు గురయ్యారు. గోపీకిషన్ వెనుకడోరు నుంచి బయటకు వచ్చి కాపాడాలంటూ కేకలు వేయడంతో అక్కడే ఉన్న కొంతమంది యువకులు అతి కష్టం మీద అతన్ని కాపాడగలిగారు. కానీ, డ్రైవింగ్ సీటులో ఉన్న శ్రీధర్ మాత్రం ఇరుక్కుపోవడంతో బయటకు తీయడం కుదరలేదు. గురువారం ఉదయం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కారును గుర్తించి జేసీబీ సాయంతో బయటకు తీశారు. శ్రీధర్ అప్పటికే మరణించాడు. దీనిపై సఖినేటిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. కొత్త సంవత్సరం మొదటి రోజు పాఠశాలకు సెలవు కావడంతో సరదాగా గడిపేందుకు వెళ్లిన నలుగురు స్నేహితుల్లో ఇద్దరు మృతి చెందారు. కర్నూలు నగరానికి చెందిన కుమ్ము సుంకన్న, శాంతి కుమారుడు వినయ్‌కుమార్ (14), ఓర్వకల్లు మండలం పాలకొలనుకు చెందిన లాల్ మహ్మద్, రేష్మా దంపతుల కుమారుడు అస్లాం (14) మంచి స్నేహితులు.
కర్నూలు నగరంలోని ఓ ప్రైవేట్ విద్యాసంస్థలో 8వ తరగతి చదువుతున్నారు. వీరు మరో నలుగురు స్నేహితులతో కలసి నూతన సంవత్సర వేడుకల కోసం ఇంటి నుంచి బయటకు వచ్చారు. సాయంత్రం దాకా సమీప ప్రాంతాల్లో తిరిగి పాలకొలను దగ్గర్లోని గుండమయ్య చెరువు కట్ట వద్దకు చేరారు. వినయ్ కుమార్ ఈత కొట్టేందుకు చెరువులోకి దిగాడు. వినయ్ మునిగిపోతున్నట్టు గుర్తించిన అస్లాం అతన్ని కాపాడేందుకు చెరువులోకి దిగాడు. ఇద్దరూ చెరువులో మునిగి మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.